పర్యాటకం.. ఒక వ్యక్తికి అమితానందాన్ని అందిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబంగా వెళ్తే.. సంతోషాల సాగరంలో ముంచి తేలుస్తుంది. అలాగే.. విభిన్న ప్రాంతాలు, దేశాల మధ్య సంబంధాలనూ మెరుగుపరుస్తుంది. స్థిరమైన అభివృద్ధిని, ఆర్థిక వ్యవస్థలను రూపొందిస్తుంది. శాంతిని ప్రోత్సహించే శక్తి.. పర్యాటకానికి ఉన్నది. తాజాగా, భారతీయ పర్యాటకుల తీరుపై ‘బుకింగ్స్.కామ్’ ఓ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
బడ్జెట్లోనే బస: వసతిని ఎంచుకునేటప్పుడు భారతీయ పర్యాటకులు బడ్జెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 34 శాతం మంది.. వారి ఆర్థిక స్థిరత్వం, ఖర్చులను బేరీజు వేసుకుంటూ.. బస కోసం బుకింగ్స్ చేస్తున్నారు. ఇది ఆలోచనాత్మకమైన, పర్యావరణ స్పృహతో కూడిన ప్రయాణాల వైపు స్పష్టమైన కదలికను సూచిస్తుంది.వ్యర్థాలను తగ్గించడంలోనూ: పర్యాటకంలో భాగంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి భారతీయులు కృషి చేస్తున్నారు. గతేడాది దాదాపు సగం మంది (48 శాతం) భారతీయ ప్రయాణికులు ప్లాస్టిక్ బాటిల్స్‌ను కొనుగోలు చేయలేదు. పునర్వినియోగ సీసాలను వెంట తీసుకెళ్లారు. అదే సమయంలో.. 42 శాతం మంది తమ ఆహార వ్యర్థాలను రీసైకిల్ చేశారు. 39 శాతం మంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించారు.
ప్రకృతిని దృష్టిలో ఉంచుకుని: భారతీయ యాత్రికులు ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. వన్యప్రాణులు, వాటి సహజ ఆవాసాలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. 42 శాతం మంది భారతీయ పర్యాటకులు.. వన్యప్రాణులను వాటి సహజ వాతావరణంలో వీక్షించేందుకే ఇష్టపడుతున్నారు. 37 శాతం మంది జంతువులకు హాని కలిగించే కార్యకలాపాలను నివారించారు. 28 శాతం మంది తక్కువ రద్దీ ఉండే గమ్యస్థానాలను ఎంచుకున్నారు.
సంస్కృతికి మద్దతు: భిన్నత్వంలో ఏకత్వం.. భారతదేశ ప్రత్యేకత. ఇక్కడ ప్రతి 50-60 కిలోమీటర్లకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. పర్యాటకులు కూడా.. ఆ సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 40 శాతం మంది.. తాము సందర్శించబోయే ప్రాంతానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాల గురించి ముందే తెలుసుకున్నారు. అదనంగా, 33 శాతం మంది ఆయా ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 31 శాతం మంది స్థానిక ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చారు. 42 శాతం మంది స్థానిక చిన్నచిన్న, స్వతంత్ర దుకాణాలలో షాపింగ్ చేశారు. ఇలాంటి అలవాట్లు.. సమాజ జీవనోపాధిని పెంచుతాయనీ, సంప్రదాయాలను కాపాడతాయనీ అధ్యయనకారులు చెబుతున్నారు.