పరీక్షల హోరు తగ్గింది… ఐపీఎల్ జోరు మొదలైంది.. దీనికి సినీ వినోదం కూడా జత కలిస్తే.. సమ్మర్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం. సినీజనాలు కూడా టైమింగ్‌ను గట్టిగా నమ్ముకుంటారు. డైలాగ్ డెలివరీలోనే కాదు.. సినిమా విడుదలలోనూ టైమింగ్ చాలా కీలకం. సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పించే టైమ్ ఏదైనా ఉందీ అంటే.. అది వేసవే! అందుకే, ఏప్రిల్, మే నెలల్లో ప్రతివారం పెద్దాచిన్నా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి క్యూ కడుతుంటాయి. ఈ సమ్మర్లో వెండితెరపై అలరించే సినిమాల జాబితా పెద్దదే! అందులో భారీ అంచనాలు నెలకొన్నవి కొన్నయితే, చడీ చప్పుడు కాకుండా.. ప్రేక్షకులకు వినోదాల చల్లదనాన్ని పంచేందుకు మరికొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
సమ్మర్లో అగ్ర హీరోల సినిమాలు విడుదల కావడం ఇండస్ట్రీలో రివాజు. అయితే గతేడాది వేసవి వినోదం కాస్త తక్కువనే చెప్పాలి. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా మేలైన సినిమాలే పలకరిస్తున్నాయి. డిఫరెంట్ సబ్జెక్టులతో ముస్తాబైన చిత్రాలు.. సమ్మర్‌ను క్యాష్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్నాయి. చిన్నాపెద్దా సినిమాలు డజను వరకు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.
బాక్సాఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ హీరో శర్వానంద్. కథను నమ్ముకొని సినిమాలు చేస్తుంటాడు. తాజాగా ప్రయోగాత్మకంగా రైడర్‌గా నటిస్తున్న చిత్రం ‘బైకర్’. సంక్రాంతి రేసులో ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ అందుకున్న శర్వానంద్ వేసవి వినోదాన్ని పంచడానికి ఈ నెల 3న ‘బైకర్’గా దూసుకొచ్చాడు. బైక్ రైడర్‌గా శర్వా అదిరిపోయే లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. హీరో తండ్రి పాత్రలో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. రేసింగ్‌తోపాటు భావోద్వేగాలూ పండటంతో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. యువతతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ‘బైకర్’ అలరిస్తున్నది. ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రంతో మనసును టచ్ చేసిన దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
కార్తికేయ సినిమాతో ఇండస్ట్రీలో హీరో నిఖిల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇక ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా విజయం తర్వాత మార్కెట్లో నిఖిల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే భారీ పాన్ ఇండియా మూవీ ఒప్పుకొన్నాడు. భరత్ కృష్ణమాచారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘స్వయంభు’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇందులో యోధుడి పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే భారీ సెట్టింగ్‌లు, యుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ జోనర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నిఖిల్ ఈ చిత్రంపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.
డిఫరెంట్ మూవీస్ ఎంచుకోవడంలో అడివి శేష్ ముందుంటాడు. గూఢచారి, హిట్ సినిమాలతో బాక్సాఫీస్‌ను తనవైపు తిప్పుకొన్న శేష్.. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ మూవీతో థ్రిల్ పంచుతానంటున్నాడు. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్.. నిజానికి గతేడాది డిసెంబర్లోనే విడుదల కావాలి. అనుకోని కారణాల వల్ల మార్చి 19వ తేదీకి వాయిదా పడింది. మళ్లీ విడుదల పోస్ట్‌పోన్ అయింది. చివరికి ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం సినిమా వస్తుందంటే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఆయన చేసిన సినిమాలు, మాటతీరు వల్ల.. ఇండస్ట్రీలో అలాంటి టాక్ ఏర్పడింది. నిర్మాతగా మారిన ఈ హీరో సాయితేజ, వేద జలంధర్ జంటగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమా తీశాడు. దర్శకుడు వి.మునిరాజు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా దీనిని తెరకెక్కించాడు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదల అవుతుందని ఇండస్ట్రీ టాక్.
‘ఉప్పెన’తో సుకుమార్ శిష్యుడు అనిపించుకున్న దర్శకుడు బుచ్చిబాబు. ఒక్కసినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అదే జోరులో రెండో సినిమా రామ్‌చరణ్‌తో అవకాశం కొట్టేశాడు. దాదాపు ఏడాదిన్నరగా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాపడి ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ లుక్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ఆయన అదరగొట్టిన స్టెప్పులు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అన్నిటికీ మించి హీరో క్రికెట్ ఆడుతూ బ్యాట్ హ్యాండిల్‌ను పిచ్ మీద కొట్టి.. బంతిని బాదే దృశ్యం సినిమా రేంజ్‌ని పదింతలు చేసేసింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా కావడంతో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దీనికితోడు ఇందులో జగపతిబాబు లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఇక రామ్‌చరణ్-జాన్వీకపూర్ జంట ఏ మాయ చేస్తుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలను మించి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం మరో విశేషం. ఇప్పటికే పాటలు బాగా హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా విజయవంతం అయితే.. దర్శకుడు బుచ్చిబాబు దశ తిరగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.
అందం, అభినయం రెండూ ఉన్న నటుడు అఖిల్. అక్కినేని కాంపౌండ్‌లో నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమా ‘హలో’, భారీ యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ ఇలా వరుసగా బాక్సాఫీస్ మీద దాడి చేసినా.. విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రేక్షకులనూ అలరించలేకపోయాడు. అన్నీ ఉన్నా.. ఏదో మిస్ అవుతున్నదని ఇండస్ట్రీ టాక్. ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటో కనిపెట్టినట్టున్నారు. అందుకే ఈసారి డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అఖిల్. ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో డిఫరెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మురళీ కిశోర్ అబ్బూరు కథకు ఓకే చెప్పాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ మూవీకి ప్లాన్ చేశారు. టైటిల్ ‘లెనిన్’ అని ఫిక్స్ చేసినప్పటి నుంచి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సంగీతం తమన్. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
మలయాళ చిత్రసీమలో ఇద్దరు అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్. వీరిద్దరూ స్క్రీన్ పంచుకొని ఏండ్లు గడిచిపోయాయి. ఇద్దరు మెగా హీరోలతో కలిసి ‘పేట్రియాట్’ మూవీ పాన్ ఇండియా సినిమాగా ముస్తాబైంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు మహేశ్ నారాయణన్. సమంత స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా ఈ వేసని బాక్సాఫీస్‌ను అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ఐపీఎల్ జోరును తట్టుకొని… ఈ చిత్రాలు విజయం సాధిస్తాయని నిర్మాతల ఆశ. అదే జరగాలని ప్రేక్షకుల అభిప్రాయం. ఎందుకంటే.. వేసవిలో సినిమాను మించిన వినోదం ఏముంటుందని వాళ్ల మాట!