‘తొంగి తొంగి.. నక్కి నక్కి గాదే.. తొక్కుకుంటూ పోవాలే’ అని ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీయార్ తెలంగాణ భాషలో రౌద్రం ప్రదర్శించాడు. ‘పెండ్లాం మాట మొగుడింటే ఎట్టుంటదో పపంచకానికి చూపిస్త !!’ అని పుష్పలో సీమ మాటల్తో అల్లు అర్జున్ సీను పండించాడు.‘ఇప్పుడు ఏటంటావే.. బుజ్జితల్లీ!!’ అని ‘తండేల్’లో నాగచైతన్య.. సిక్కోలు యాసలో సిత్రం చేశాడు. ఇప్పుడు మన హీరోలు.. కథతోపాటు మాటలకూ, యాసకూ పట్టం కడుతున్నారు. డైలాగులకు మట్టి పరిమళాలు అద్దుతున్నారు. వేషంలోనే కాదు భాషలోనూ స్థానికతను పులుముకొని ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు.
Telugu Cinema | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే.. సినిమాల్లో తెలంగాణ భాష ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు వచ్చిన కొన్ని చిత్రాల్లో తెలంగాణ నేపథ్యం అరకొరగా కనిపించేది. తెలంగాణ వచ్చాక.. ఇక్కడి ప్రజల జీవనశైలి, సంస్కృతిని ప్రతిబింబించే కథలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరున్న శేఖర్ కమ్ముల ‘ఫిదా’ చిత్రంలో తెలంగాణ గ్రామీణ అందాలను పరిచయం చేశాడు. అక్కడి కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలను హైలైట్ చేశాడు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 2021లో వచ్చిన ‘లవ్‌స్టోరీ’లోనూ తెలంగాణ మాండలికం వినసొంపుగా అలరించింది.
సినిమా కథ ఎంత స్థానికంగా ఉంటే.. ప్రేక్షకుల మనసుకు అంతగా చేరుకుంటుంది అనడానికి ఇటీవల వచ్చిన చిత్రాలే నిదర్శనం. ప్రాంతీయ యాస, స్థానిక సంస్కృతిని తెరపై ఆవిష్కరించడం ద్వారా కొత్త అనుభూతి పంచే సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. గతంలో తెలుగు చిత్రాల్లో ప్రామాణిక భాషకే ప్రాధాన్యం ఉండేది. మాండలికాలు హాస్య పాత్రలకు, విలన్లకు పరిమితం చేసి అపహాస్యం చేసిన దాఖలాలు కోకొల్లలు. ‘పాతాళభైరవి’లో నేపాల మాంత్రికుడు చెప్పినట్టు.. ‘జనం అడిగింది మనం చేయవలె..’ అని సినీజనాలూ ఫిక్సయినట్టున్నారు. అందుకే ట్రెండ్ మార్చేసి కొన్నేళ్లుగా హీరోల నోట కూడా మాండలికం పలికిస్తున్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతోపాటు హీరోయిజానికి కొత్త సొగసులు అద్దుతున్నారు.
‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీయార్ తెలంగాణ యాసలో అదరగొట్టాడు. ఇచ్చిన పాత్రను అంతెత్తున నిలబెట్టే హీరోల్లో జూనియర్ నెంబర్ 1. భీం పాత్రలో తెలంగాణ భాషను హీరోచితంగా పలికించడంలోనూ ఎన్టీయార్ సక్సెస్ అయ్యాడు. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ తెలంగాణ మాండలికంతో మెప్పించాడు. ఆ సినిమాలో ఒకవైపు చిరంజీవి ఉత్తరాంధ్ర మాండలికంలో ‘అట్టాంటోడు నా పేట్లో ఉన్నాడంటే నేనే ఒగ్గా.. వాడి తల నరికేసి డేక్సాలో అట్టుకొచ్చెయ్ గలను!’ అంటూ ఇరగదీశాడు. మరోవైపు రవితేజ ‘ఏమ్ రా వారీ పిస పిస చేస్తున్నవ్’ అని నైజాం నైజాన్ని వినిపించాడు.
ఇక బాలకృష్ణ ‘ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది’ అంటూ ‘భగవంత్ కేసరి’లో కుమ్మేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తెలంగాణ యాస ఎంత పర్ఫెక్ట్గా సూటవుతుందో రుచి చూపించాడు. ‘దసరా’ చిత్రంలో నాని, కీర్తి సురేశ్ తెలంగాణ యాసలో మాట్లాడి, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయన’,‘బంగార్రాజు’, ‘నా సామిరంగా’ చిత్రాల్లో నాగార్జున కోనసీమ యాసలో అదరగొట్టాడు.
ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస తర్వాత డిమాండ్ ఉన్నది చిత్తూరు మాండలికానికే! ఎప్పుడో ఏడేళ్ల క్రితం తీసిన ‘అరవింద సమేత’లో ఎన్టీయార్ పలికిన డైలాగులు గుర్తుండే ఉంటాయి. ‘ఒక మగాడు ఇంకొక మగాడ్ని చెరిస్తే యట్టుంటాదో చూపిస్తాను.. ’ అంటూ గంభీరంగా చెప్పి చిత్తూరు మాండలికానికి టార్చ్ బేరర్లా నిలిచిపోయాడు. పుష్ప సిరీస్‌లో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడి మెప్పించడమే కాదు.. ఆ యాసకు బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు!’, ‘తగ్గేదే లే’ లాంటి డైలాగులు పపంచకాన్నే ఊపేశాయి.
ఒకప్పుడు హాస్య పాత్రలకు లేదా ప్రతినాయక పాత్రలకే పరిమితం అయిన తెలంగాణ యాస ప్రస్తుతం టాలీవుడ్లో హవా కొనసాగిస్తున్నది! మొన్నటి ‘మల్లేశం’, నిన్నటి ‘బలగం’ సినిమాలు పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకుల మనసులు దోచుకున్నాయి. తెలంగాణ మాండలికం మాత్రమే కాదు… జీవనశైలిని నమ్ముకొని కూడా చిత్రాలు నిర్మించి సక్సెస్ సాధిస్తున్నారు సినీ నిర్దేశకులు. విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే… ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకులు తెగ సంబురపడిపోతున్నారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల్లో విజయ్ దేవరకొండ తెలంగాణ స్లాంగ్‌లో డైలాగులు చెప్పి ఇండస్ట్రీలో సెటిలయ్యాడు. ‘మల్లేశం’తో ప్రియదర్శి, ‘డీజే టిల్లు’తో సిద్ధు ప్రేక్షకుల మెప్పు పొందారు. సాయిపల్లవి, నాగచైతన్య కలిసి నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాలోనూ తెలంగాణం పల్లవించింది. ఇలా తెలంగాణ యాసను నమ్ముకుని అమ్ముకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి. ప్రేక్షకుల మనసులకు దగ్గరైన భాషలో మాట్లాడితే.. పెట్టుబడికి తిరుగుండదని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి.
ప్రాంతీయతను సినీ ప్రేమికులకు చేరువ చేయడంలో జానపద గీతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ‘సారంగదరియా’ నుంచి ‘పల్సర్ బైకు’, ‘చమ్కీల అంగీలేసి’ లాంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘బలగం’ లాంటి కథలు మన జీవితానికి ఎంతో దగ్గరగా ఉండటంతో, వాటికి ప్రేక్షకాదరణ పెరుగుతున్నది. ఇది బాలీవుడ్‌ను కూడా ప్రభావితం చేసింది. తాజాగా వచ్చిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో ‘బతుకమ్మ’ పాటను జోడించడమే ఇందుకు నిదర్శనం. లోకల్‌ను నమ్ముకున్న తెలుగు సినిమాలు గ్లోబల్ విజయాలు సాధిస్తున్నాయని చెప్పొచ్చు.