Tirumala | బ్రహ్మాండ నాయకుడి గరుడోత్సవం
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తలమానికమైంది. ఉత్సవాల ఆరంభంలో గరుడధ్వజాన్ని ఎగురవేయటం, అయిదో రోజు గరుడవాహనంపై ఆ గజరాజరక్షకుడిని ఊరేగించటం, పరిసమాప్తి రోజున గరుడధ్వజం అవరోహణ చేయడం ఆనవాయితీ. ఇలా ఆ కోనేటిరాయడిది, ఖగరాజుది అవినాభావ సంబంధం.
- ఈ నెల 22న తిరుమల శ్రీవారి గరుడోత్సవం
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తలమానికమైంది. ఉత్సవాల ఆరంభంలో గరుడధ్వజాన్ని ఎగురవేయటం, అయిదో రోజు గరుడవాహనంపై ఆ గజరాజరక్షకుడిని ఊరేగించటం, పరిసమాప్తి రోజున గరుడధ్వజం అవరోహణ చేయడం ఆనవాయితీ. ఇలా ఆ కోనేటిరాయడిది, ఖగరాజుది అవినాభావ సంబంధం.
శ్రీమహావిష్ణువు జరిపిన శిష్టరక్షణ, దుష్టశిక్షణలో గరుత్మంతుడి సహకారం అనన్యసామాన్యమైంది. జ్ఞాన, బల, మేధాశక్తులు కలిగిన గరుడుడు వేదస్వరూపుడని శాస్త్ర వచనం. భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ‘వైనతేయశ్చ పక్షిణామ్- పక్షులలో విష్ణువాహనమైన గరుత్మంతుడిని నేనేన’ని విస్పష్టం చేశాడు. అందుకే శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీనివాసుడి వేడుకల్లో ఈ పక్షీంద్రుడికి ఇంత ప్రాధాన్యం. ఆ నాగాంతకుడిని భక్తకవి యామునాచార్యులు ‘దాస స్సఖా వాహన మాసనం ధ్వజో య స్తే వితానం వ్యజనం త్రయీమయః’ అని కీర్తించారు. గరుడుడు విష్ణుమూర్తికి దాసుడుగా, సఖుడుగా, వాహనంగా, ఆసనంగా, ధ్వజంగా, ఛత్రంగా, విసనకర్రగా సేవలందిస్తాడని కొనియాడారు. గరుడుని రెక్కలు జ్ఞానవైరాగ్యాలకీ ప్రతీకలని తత్వవేత్తలు నిర్వచిస్తారు. ఆయన ప్రాశస్తికి దర్పణం ‘గరుడపురాణం’.
త్యాగానికి ప్రతీక…
మాతృభక్తికి నిదర్శనం గరుత్మంతుడు. తల్లి దాస్యవిమోచనం కోసం తన రెక్కల శక్తితో ఆకాశానికెగిరాడు. స్వర్గలోకం చేరి దేవతాశ్రేష్ఠులైన మహావీరులతో పోరాడాడు. అమృతాన్ని తీసుకువచ్చి తల్లికి దాస్య విముక్తి చేశాడు. తను మాత్రం ఒక్క అమృతబిందువు కూడా సేవించలేదు. ఈ ఉదంతంతో సాక్షాత్తూ విష్ణుమూర్తే అచ్చెరువొందాడు. ఆ పక్షిరాజును తన వాహనంగా, కేతనంగా చేసుకున్నాడు. అలా వైకుంఠవాసుడి వాత్సల్యానికి నోచుకున్న భక్తాగ్రగణ్యుడు గరుత్మంతుడు. త్యాగ గుణం కలిగిన వారిని భగవంతుడు తన ఆత్మీయభక్తుడిగా భావిస్తాడనటానికి గరుడ గాథ తార్కాణం. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, నిస్వార్థం, నిష్కళంకం తదితర ఉత్తమగుణాలకు పరమాత్మ ప్రసన్నుడై ఇచ్చిన వరాలెన్నో! అంతేకాదు…
‘కుంకుమాంకిత వర్ణాయ, కుందేందు ధవళాయచ
విష్ణువాహన నమస్తుభ్యం, పక్షిరాజాయతే నమః’.. అని గరుడపురాణంలో స్వయంగా విష్ణుమూర్తే ఈ గరుడపరావిద్యా మంత్రాన్ని ఉపదేశించాడంటే, స్వామి ఆ సుపర్ణుడికి తన హృదయంలో ఇచ్చిన స్థానాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆ సేవ అపురూపం…
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడుకొండలవాడికి అయిదో రోజు జరిగే గరుడవాహన సేవ అపురూపం. ఆపదమొక్కులవాడికి ఆ రోజు జరిగే అలంకారాల్లో, నివేదనల్లో, ప్రబంధ పారాయణాల్లో ఎన్నో విశేషాలుంటాయి. ఆనాడు శ్రీనివాసుడు గరుడునిపై వైకుంఠమూర్తిగా (విష్ణువుగా) దర్శనమిస్తాడు. ఆ విశేష వాహన సేవ జరిగే రోజున తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి బహూకరించిన తులసిహారాలు శ్రీవారికి అలంకరిస్తారు. ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వర మూలవిరాట్టుకు సదా అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలల్ని గరుడవాహన సేవ రోజున మలయప్ప స్వామికి సమర్పిస్తారు. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి నూతనంగా తయారుచేసిన తొమ్మిది గొడుగులను భక్తులు పాదచారులై తిరుమలకు తెచ్చి సమర్పించటం సంప్రదాయం. అత్యంత వైభవంగా సాగే గరుడోత్సవం చూసిన వారిదే అదృష్టం. ఆ సందర్భాన్ని తలుచుకోవడం పూర్వజన్మ పుణ్యఫలం.v
-మనోజ్ఞ
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

