న్యూఢిల్లీ, ఆగస్టు 17: మొత్తం పరీక్షా విధానాన్ని సంస్కరించే చర్యల్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తన సిబ్బందిలో 50 మందికిపైగా సభ్యులను తొలగించి కీలక నాయకత్వ స్థానాల కోసం నిపుణులను నియమిస్తున్నదని విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ప్రశ్నపత్రాలలో తలెత్తిన అనేక లోపాల కారణంగా యూజీసీ-నెట్ పరీక్షలోని మూడు సబ్జెక్టులకు రీ-ఎగ్జామినేషన్ నిర్వహించాలని ఎన్టీఏ ఆదేశించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. అలాగే పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్-యూజీ 2026 పరీక్ష రద్దయిన కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్ర విద్యా శాఖ పలు చర్యలు ప్రకటించింది. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఆదేశించారు.
ఎన్టీఏను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో జోషి సోమవారం ఒక సమావేశాన్ని నిర్వహించారు. సంస్థను పునర్వ్యవస్థీకరించడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టినట్టు విద్యాశాఖ తెలిపింది. అంతేగాకుండా 10 ప్రత్యేక నాయకత్వ పదవులకు ప్రకటనలు జారీ చేశామని, వాటిని ప్రస్తుతం భర్తీ చేస్తున్నామని పేర్కొంది. వీటిలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, టెస్ట్ సెక్యూరిటీ-డెవలప్మెంట్-సైకోమెట్రిక్స్ జనరల్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ కొత్త ఉద్యోగాల ఉద్దేశం ఏజెన్సీకి మరింత వృత్తిపరమైన నైపుణ్యాన్ని చేయడమని విద్యా శాఖ పేర్కొంది.
ప్రైవేట్ రంగ నిపుణుల భాగస్వామ్యం
సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన వంటి ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి నిపుణులను కూడా తీసుకువస్తున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. పరీక్షా ప్రక్రియలోని కీలక దశలలో ప్రత్యేక నైపుణ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈచర్య ముఖ్య ఉద్దేశమని తెలిపింది. తన కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సమూలంగా ప్రక్షాళన చేయాలని విద్యా శాఖ మంత్రి ఎన్టీఏను ఆదేశించారు.