చేసింది కొన్ని సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటి ప్రియాగిల్. బాలీవుడ్లో సిర్ఫ్ తుమ్, జోష్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో.. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నది. ‘బాగున్నారా’, ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. అయితే.. తన సినీ కెరీర్లోనే షారుక్‌ను చెంపదెబ్బ కొట్టే సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డట్లు చెప్పుకొచ్చింది. 2000 సంవత్సరంలో షారుక్‌ఖాన్ హీరోగా వచ్చిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘జోష్’లో మెరిసింది ప్రియ.
ఈ సినిమాలోని ఒక సీన్లో ఆమె షారుక్‌ను చెంపదెబ్బ కొడుతుంది. ఆ షాట్ కోసం తానుపడ్డ ఇబ్బందులు, తదనంతర పరిణామాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నది. ‘గోవాలో జోష్ సినిమా షూటింగ్. అందులో ఓ సన్నివేశంలో నేను షారుక్‌ను చెంపదెబ్బ కొట్టాలి. అప్పటికే ఆయన పెద్దస్టార్. అలాంటి అగ్రస్థాయి నటుణ్ని చెంపదెబ్బ ఎలా కొట్టాలా? అని నేను ఎంతో టెన్షన్‌గా ఫీలయ్యా! డైరెక్టర్ మన్సూర్ మాత్రం.. ‘ఏం ఫర్వాలేదు కొట్టేయ్!’ అని అన్నారు.
షారుక్ కూడా ఫర్వాలేదని చెప్పారు. దాంతో.. బాద్షా చెంపపై ఒక్క దెబ్బవేశా!’ అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. ఆ షాట్ తర్వాత సెట్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయ్యిందట. ‘నాకింకా గుర్తు.. షారుక్‌ను కొంచెం గట్టిగానే కొట్టా. దానికి షారుక్ ఇచ్చిన రియాక్షన్ చూసి.. డైరెక్టర్ కట్ చెప్పడం కూడా మర్చిపోయారు. షాట్ పూర్తయినా కెమెరా తిరుగుతూనే ఉంది. ఆ సంఘటనను నేనెప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత షారుక్.. ‘నువ్వు నన్ను కొట్టావ్ కదా!’ అని కాసేపు ప్రియను ఏడిపించాడట. సినిమా కెమెరామెన్‌గా పనిచేసిన కేవీ.. ‘నువ్వు షారుక్‌ను కొట్టినందుకు అమ్మాయిలు నిన్ను ద్వేషిస్తారు’ అని తనతో అన్నట్లు గుర్తుచేసుకున్నది ప్రియా గిల్. 1995 మిస్ ఇండియా పోటీలలో మూడో స్థానంలో నిలిచిన ప్రియా గిల్.. ‘తేరే మేరే సప్నే’తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 1996 – 2006 మధ్యకాలంలో హిందీ, తెలుగు, మలయాళం, తమిళ, పంజాబీ చిత్రాలలో నటించింది.