ప్రస్తుతం భార్యాభర్త.. ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు. ఓవైపు ఆఫీస్.. ఇంటి పనులంటూ ఉరుకులు పరుగులు. మరోవైపు పిల్లలు, వారి చదువులు. పెద్దవాళ్ల బాధ్యతలు! వెరసి.. క్షణం తీరికలేని జీవితాలు! దంపతులకు కాస్తంత సమయం దొరకడం కూడా గగనమే అవుతున్నది. ఒకవేళ దొరికినా.. ఇద్దరూ ఏకాంతంగా గడపడం కూడా కష్టంగా మారుతున్నది. ఫలితంగా.. భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతున్నది. ఈ సమస్యకు ‘పిల్లో టాక్’ ఓ పరిష్కారం చూపుతున్నది.
దంపతులు ఎంత సన్నిహితంగా ఉంటే.. వారి మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. మనసు విప్పి మాట్లాడుకుంటేనే.. సాన్నిహిత్యం పెరుగుతుంది. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి అలాంటి సమయం దొరకడం లేదు. దొరికినా.. కొంతమంది తమ భాగస్వామితో అన్ని విషయాల్నీ స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారట. తమ ఇష్టాయిష్టాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి పంచుకోవడానికీ ఆసక్తి చూపించడం లేదట. చెబితే భాగస్వామి ఎలా రియాక్ట్ అవుతారో.. తమ ఇష్టాయిష్టాలు, లక్ష్యాలను గౌరవిస్తారో లేదోనన్న సందిగ్ధమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాళ్లు ‘పిల్లో టాక్’తో ఒక్కటవ్వొచ్చని చెబుతున్నారు.
రాత్రిపూట పడకగదిలో భార్యాభర్తలు ఇద్దరూ ఏకాంతంగా, మనసు విప్పి మాట్లాడుకోవడమే.. పిల్లో టాక్! దీనివల్ల భార్యాభర్తల శరీరాల్లో ‘ఆక్సిటోసిన్’ అనే ప్రేమ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మానసిక సమస్యలను దూరం చేస్తుంది. మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. దంపతుల మధ్య దూరం తగ్గడంతోపాటు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం చిక్కుతుంది. భాగస్వామి మనసులో కోరికలు తెలుసుకోవడంతోపాటు వాటిని నెరవేర్చడానికీ అవకాశం ఉంటుంది. అందుకే.. భార్యాభర్తలు రోజంతా ఎంత బిజీగా ఉన్నా.. రాత్రిపూట కనీసం ఓ అరగంటైనా మనసు విప్పి, ఏకాంతంగా మాట్లాడుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, చాలామంది ‘పిల్లో టాక్’లో లేనిపోని సమస్యలను ముందేసుకుంటారు. దొరక్కదొరక్క దొరికిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఎప్పుడో జరిగిన గొడవలు, ఆఫీస్ సమస్యలు, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. ఇలాంటి చర్చలవల్ల సరదాగా సాగాల్సిన సమయం.. వృథాగా గడిచిపోతుంది.
ఒక్కోసారి పాతగొడవలు ముందుకొచ్చి.. దంపతుల మధ్య దూరం పెరిగే ప్రమాదమూ ఉంటుంది. వాటికి బదులుగా పెళ్లినాటి జ్ఞాపకాలు, హనీమూన్ మధురానుభూతులు, ఇచ్చిపుచ్చుకున్న కానుకలు, ఇద్దరి మధ్య జరిగిన సరదా సంఘటనలు.. ఇలాంటివి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. ఇలాంటి సంభాషణలతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢంగా మారుతుంది.