Smart Phone | నేటితరం ‘సెల్’లో చిక్కుకు పోతున్నది. రోజంతా స్మార్ట్‌ఫోన్‌తోనే సావాసం చేస్తున్నది. పగలూరాత్రీ తెరకే అంకితమైపోతున్నది. ఇలా అతిగా ఫోన్‌ను వాడటం.. పిల్లల కమ్యూనికేషన్ సామర్థ్యాలను దెబ్బతీస్తుందనీ, వారిలో మాట్లాడే నైపుణ్యంతోపాటు వినికిడి శక్తికి ఆటంకం కలిగిస్తుందని ఓ పరిశోధనలో తేలింది.
పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ఇంగ్లండ్‌లోని కమిషన్ ఫర్ ఒరాసీ ఎడ్యుకేషన్ ఇటీవల ఓ సర్వే చేసింది. 1,007 మందితో పోల్ నిర్వహించి.. పలు విస్తుగొలిపే విషయాలను వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వాడే పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గడం గుర్తించినట్లు సర్వేలో తేలింది.
బాల్యంలో పిల్లల మెదడు ఎక్కువ అభివృద్ధి చెందుతుందనీ, ఈ సమయంలో మొబైల్ వాడటం వారి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కొత్తగా మాటలు నేర్చుకునేవారితోపాటు ఇప్పటికే సమర్థంగా కమ్యూనికేట్ చేసే పిల్లల సామర్థ్యాన్ని కూడా స్మార్ట్ఫోన్లు దెబ్బతీస్తున్నాయని వారు వెల్లడించారు.
ఈ పరిణామాలు భవిష్యత్ యువతలో నైపుణ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా కాకుండా, ప్రారంభ దశలోనే అడ్డుకోవాలనీ, చదువు ప్రాధాన్యాన్ని వారికి తెలియజేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలు తమ ఆలోచనలను వ్యక్తీకరించడం, అర్థవంతమైన చర్చలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించాలని చెబుతున్నారు.