పెద్దవాళ్లను అనుకరిస్తూనే చిన్నపిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. బిడ్డకు సులువుగా అర్థమయ్యేలా లాల, బిక్కి, చాకి, ఆచ్చి.. అంటూ రకరకాల శబ్దాలు, పదాలతో చిన్నచిన్న మాటలు నేర్పిస్తారు కన్నవారు. ఓ వయసు వచ్చేదాక చిన్నపిల్లలకు ఓ ప్రత్యేక భాషంటూ ఉంటుంది. పిల్లలు కూడా తమకు అర్థమయ్యేలా మాట్లాడేవారినే ఎక్కువగా ఇష్టపడతారని తాజా అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆధునిక సమాజంలో పెరుగుతున్న పిల్లల భాషపై అధ్యయనం చేశారు. ఒక భాష మాట్లాడగలిగే పిల్లలు అందులోని పదాలను తమలాగే పలికే వారిని బాగా ఇష్టపడుతారని, రెండు మూడు భాషలు మాట్లాడే పిల్లలు మాతృభాషలో తమను అనుకరించేవారిని ఇష్టపడుతారని ఈ పరిశోధనలో వెల్లడైంది.