వేసవి ఉక్కపోతకు చెమట ఎక్కువ పడుతుంది. సాయంత్రానికి శరీరమంతా తడిసి ముద్దవుతుంది. కాటన్ బట్టలు వేసుకున్నా.. కంపు వాసన కొడతాయి. ఫలితంగా దురద, దానివెంటే దద్దుర్లు ఇబ్బంది పెడతాయి. ఇక ఏవైనా చర్మ సమస్యలు ఉంటే.. అవి మరింతగా విజృంభిస్తాయి. వీటినుంచి ఉపశమనం పొందడానికి వేలకు వేలు పోసి.. రకరకాల క్రీములు కొనాల్సిన పనిలేదు. అవి వాడినా.. సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. సహజ సిద్ధంగా, వీధుల్లో దొరికే ‘వేపాకు’తోనే వీటికి చెక్ పెట్టొచ్చు. వేసవి సమస్యలను నివారించవచ్చు.
మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, లోషన్లు అందరికీ ఉపశమనం కలిగించలేవు. సహజసిద్ధమైన దివ్యౌషధంగా పేరున్న వేపాకులు.. వేసవిలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. రూపాయి ఖర్చులేకుండా.. పూర్తిగా నిర్మూలిస్తాయి.
ఒక కుండలో రెండు లీటర్ల నీటిని తీసుకొని, అందులో 15 నుంచి 20 తాజా వేపాకులు వేయాలి. ఈ నీటిని 10 నుంచి 15 నిమిషాలపాటు మరిగించాలి. నీరు వెచ్చగా ఉన్నప్పుడే.. స్నానపు నీటిలో కలపాలి. ఆ నీటితో స్నానం చేయడం వల్ల.. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేపాకులకు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నాశనంచేసే సామర్థ్యం ఉంటుంది. వేపాకులు యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దురద నుంచి ఉపశమనాన్ని కలిగించడంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ప్రతిరోజూ వేపనీటితో స్నానం చేయడం వల్ల చెమట కారణంగా శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. దురదతోపాటు దద్దుర్ల బాధ తప్పుతుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా నశించిపోతుంది. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.
చర్మ సమస్యలు కూడా ఉన్నట్టయితే.. వేసవిలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటివారు వేపాకులకు పసుపును కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 8 నుంచి 10 వేపాకులను మెత్తగా గ్రైండ్ చేసి.. అందులో అర టీస్పూన్ పసుపు కలపండి. ఈ పేస్ట్‌ను దురద ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అప్లయి చేయాలి. 20 నిమిషాలపాటు అలాగే ఆరనిచ్చి.. గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పసుపులో యాంటి సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి వేపతో కలిసి.. చర్మపు చికాకును తగ్గిస్తాయి. దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా తామర, సోరియాసిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.