ప్రపంచంలో మేకవన్నె పులులు పెరుగుతున్నారు. ‘మంచితనం’ అనే మాస్క్ వేసుకొని.. మన పక్కనే తిరుగుతున్నారు. వీళ్లు ఆకర్షణీయమైన మాటలతో స్నేహపూర్వకంగా మెదులుతూ.. సహోద్యోగులను సులభంగా మోసపుచ్చుతుంటారు. అయితే, అలాంటి నకిలీ వ్యక్తులు తరచుగా సూక్ష్మమైన ఆధారాలను వదిలివేస్తారు. వారి ప్రవర్తన మొదట్లో బాగానే అనిపిస్తుంది. నిశితంగా గమనించినట్లయితే.. వారికి స్థిరత్వం, ప్రామాణికత లేదని గుర్తించొచ్చు. నిజమైన వ్యక్తులు రక్షణాత్మక ధోరణిలో ప్రవర్తిస్తారు. ఇతరులతో పరిచయాలను పెంచుకోవడానికి సమయం తీసుకుంటారు. ఒకరి గురించి అంతా తెలుసుకున్నాకే, పూర్తిగా నమ్మిన తర్వాతే.. వారికి దగ్గరవుతారు.
అందుకు భిన్నంగా, కొందరు పరిచయమైన కొత్తలోనే చాలా క్లోజ్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. అతి చనువుగా మెదులుతుంటారు. మీ నమ్మకాన్ని అతి త్వరగా పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వ్యక్తులు.. ముసుగు మనుషులు కావొచ్చు. వారి చర్యలను జాగ్రత్తగా గమనించాలి! నకిలీ వ్యక్తుల మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు. వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేకపోతారు. తమ భావోద్వేగాలను, అభిప్రాయాలను కూడా సరిగ్గా వ్యక్తీకరించలేకపోతారు. సొంతంగా ఆలోచించలేక.. ఇతరులను అనుసరిస్తూ ఉంటారు.
సాధారణ వ్యకులకు వేరేలా నటించడం తెలియదు. సందర్భాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తుంటారు. అయితే, నకిలీ వ్యక్తులు.. వారు ఉన్న ప్రతి సమూహానికి అనుగుణంగా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. వినయంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి ఊసరవెల్లి ప్రవర్తన.. వారిలోని అభద్రతను, స్వీయ గుర్తింపు లేకపోవడాన్ని చూపిస్తుంది. ఎవరైనా ఇతరుల మెప్పు, ఆమోదం పొందడానికి తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నట్లు గమనించినట్లయితే.. వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
నకిలీ వ్యక్తుల అతిముఖ్యమైన సంకేతం.. నకిలీ వార్తలను వ్యాప్తిచేయడం. వాళ్లెప్పుడూ గాసిప్స్నే ఇష్టపడుతుంటారు. ఇతరుల రహస్యాలను మీతో పంచుకుంటూ.. మీ పర్సనల్ విషయాలను ఇతరులకు చెబుతుంటారు. ఇతరుల గురించి వెనక మాటలు మాట్లాడేవారిని అస్సలు నమ్మొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా మీతో ఎప్పుడూ ఇతరుల గురించి మాట్లాడుతుంటే.. మీ గురించి కూడా వేరేవారి దగ్గర అలాగే చేస్తారని గుర్తుంచుకోవాలి.