ఫుడ్ సైన్స్
హలో జిందగీ. ఇటీవల వినిపిస్తున్న సీడ్ సైక్లింగ్ అంటే ఏమిటి? దీనివల్ల గర్భాశయ ఆరోగ్యానికి కలిగే మేలేంటి? ఇందుకోసం ఏం తినాలి? ఎంతెంత తినాలి? తెలియజేయండి.
రుతుక్రమం అన్నది పూర్తిగా మహిళ శరీరంలోని హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. వాటి స్థాయులు ఎలా ఉన్నాయన్నదే… రుతుక్రమాన్నీ, గర్భధారణనూ ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్లను సమతుల్యం చేసి, మహిళల్లో గర్భధారణ ఫలవంతం అయ్యేందుకు సహకరించే ఆహార పద్ధతినే సీడ్ సైక్లింగ్ అని పిలుస్తారు.
రుతుక్రమాన్ని రెండు విభాగాలుగా విడగొట్టొచ్చు. మొదటిది నెలసరి ప్రారంభం అయినప్పటినుంచి అండం విడుదల అయ్యేరోజు వరకూ… రెండోది అండం విడుదల అయినప్పటి నుంచి నెలసరి వచ్చేవరకు. ఈ సమయాల్లో కొన్ని రకాల గింజలు తీసుకోవడం ద్వారా పిల్లలు పుట్టే అవకాశాన్ని పెంచవచ్చు.
ఇందులో తొలిదశలో అంటే.. నెలసరి ప్రారంభం అయినప్పటినుంచి అండం విడుదల అయ్యేరోజు వరకూ లేదా 1-14 రోజుల వరకూ… రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తినాలి.
రెండో దశలో అంటే.. అండం విడుదల అయినప్పటినుంచి నెలసరి వచ్చేవరకు లేదా 15- 28 రోజుల వరకూ… రోజూ ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తినాలి.
ఇలా చేయడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల స్థితిలో ఉంటాయి. ఒక్క గర్భధారణ కోసమనే కాదు, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్ వల్ల రుతుక్రమం దెబ్బతిన్నప్పుడు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. పిల్లలు పుట్టాక వచ్చే పిగ్మెంటేషన్ సమస్యలు, మెనోపాజ్ సమయంలోనూ ఇది మంచిదే. అయితే కనీసం మూడు నెలలు క్రమం తప్పకుండా ఇలా చేస్తే దీని ఫలితాలు కనిపించడం ప్రారంభం అవుతాయి. తొలి దశలో గుమ్మడి, అవిసె గింజలు… ఈస్ట్రోజెన్ స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. అవిసెల్లో ఉండే లిగ్నన్లుగా పిలిచే పాలీఫినాల్స్ అధిక ఈస్ట్రోజెన్‌ను పట్టి ఉంచుతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ ప్రొజెస్టిరాన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు కూడా ప్రొజెస్టిరాన్ ఉత్పత్తిని పెంచేవే. అయితే నువ్వుల్లో ఉండే లిగ్నన్లు ప్రొజెస్టిరాన్ స్థాయులను అదుపులో ఉంచుతాయి. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్- ఇ ప్రొజెస్టిరాన్ ఉత్పత్తికి సహకరిస్తే… ఇందులోని సెలీనియం కాలేయంలో ఉండే అధిక ఈస్ట్రోజెన్‌ను తొలగిస్తుంది.