Vinayaka Chavithi | హిందూ ధర్మంలో ప్రతి దేవుడూ స్త్రీ, పురుష రూపాల్లో ప్రస్తావనకు వస్తారు. అంతేకాదు స్త్రీ, పురుష శక్తుల కలయికే సృష్టికి కారణంగా కనిపిస్తుంది. పురుష రూపాన్ని ఆధ్యాత్మిక వాస్తవానికి, స్త్రీ రూపాన్ని ఇహలోక వాస్తవానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ క్రమంలోనే శివుడికి- శివాని, విష్ణువుకు- వైష్ణవి, బ్రహ్మదేవుడికి-బ్రాహ్మణి, ఇంద్రుడికి- ఇంద్రాణి తదితర స్త్రీ శక్తిరూపాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వినాయకుడి స్త్రీ శక్తి వినాయకి కూడా ఈ కోవలోనిదే.
పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు పార్వతీదేవిని మోహించాడు. ఆమెను ఎలాగైనా సరే తన భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. అమ్మవారిని బలవంతంగా చెరబట్టబోయాడు. ఇంతలో ఆమె తన భర్త పరమశివుణ్ని పిలిచింది. అప్పుడు శివుడు తన త్రిశూలంతో అంధకాసురుణ్ని చీల్చేస్తాడు. కానీ, అంధకాసురుడికి ఓ శక్తి ఉంటుంది. నేలను తాకిన ప్రతి రక్తపు బొట్టు నుంచి మరో అంధకాసురుడు పుట్టుకొస్తాడు.
అలా శివుడు ఆ అసురుణ్ని నరికినా లాభం లేకుండా పోయింది. ఒక్కొక్క రక్తం చుక్క నుంచి ఒక్కొక్క అంధకాసురుడు పుట్టుకొస్తుంటాడు. దీంతో పార్వతీదేవి సృష్టిలో ఉన్న అన్ని శక్తులనూ సంఘటితం కావాలని పిలుస్తుంది. అలా ఒక్కొక్క దేవుడి నుంచి ఒక్కో శక్తి రూపం బయటికి వస్తుంది. విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మణి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి ఇలా శక్తులు అంధకాసురుడితో పోరాటం చేశాయి. చివరికి అతణ్ని అంతం చేశాయి.
వీటిలో వినాయకుడి నుంచి వెలుపలికి వచ్చిన శక్తి రూపం వినాయకి. ఈమెనే గణేశ్వరి, విఘ్నేశ్వరి అని కూడా పిలుస్తారు. వినాయకుడికి సంబంధించి ఈ స్త్రీ శక్తి రూపం అవతరణ గురించిన వివరణ వనదుర్గ ఉపనిషత్తులో ఉంది. మధ్యప్రదేశ్లో నర్మద నదీతీరంలోని బేడాఘాట్ దగ్గర చౌసట్ యోగిని దేవాలయం ఉంది. ఈ ఆలయంలో 64 మంది యోగినుల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఏనుగు ముఖం కలిగిన వినాయకి విగ్రహం కూడా ఒకటి.