సంగీతం.. మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. రోజువారీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. విసుగు పుట్టించే ప్రయాణాల్లో తోడుగా ఉంటుంది. అయితే, అదే పనిగా హెడ్ఫోన్లు పెట్టుకొని పాటలు వింటుంటే.. చెవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
కొందరు ఎప్పుడు చూసినా హెడ్‌ఫోన్స్ పెట్టుకొనే కనిపిస్తారు. పాటలు వింటూనో, ఫోన్ మాట్లాడుతూనో ఉంటారు. కొంతమంది సంగీత ప్రియులు తెలియకుండానే ఎక్కువ సమయంపాటు పాటలు వింటుంటారు. అది కూడా 100 శాతం వాల్యూమ్‌తో సంగీతాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటివారిలో వినికిడి లోపం ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా కావొద్దంటే.. 60/60 నియమాన్ని పాటించాలని సూచిస్తున్నారు.
హెడ్సెట్లో గరిష్ట వాల్యూమ్ 60 శాతానికి మించకుండా ఉండటం. రోజువారీ సెషన్లను 60 నిమిషాలకు పరిమితం చేయడమే 60/60 నియమం. ఇది లోపలి చెవి నిరంతరం ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. కాలక్రమేణా వినికిడి దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిజానికి వినికిడి శక్తి తగ్గుతున్నదని సూచించే సంకేతాలు మొదట్లో చాలా స్వల్పంగానే ఉంటాయి. అందుకే చాలామంది వీటిని గమనించరు. ఎదుటివారి మాటలు అస్పష్టంగా, గందరగోళంగా అనిపిస్తున్నాయంటే.. మీ వినికిడి శక్తి తగ్గుతున్నట్లు గుర్తించాలి. ఇక రద్దీ ప్రదేశాలలో పక్కనున్నవారి మాటలు అర్థం కాకపోయినా, మీరు టీవీ చూస్తున్నప్పుడు ఇంట్లోవారు ‘వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది’ అని ఫిర్యాదు చేస్తున్నా.. అది వినికిడి లోపానికి ఒక స్పష్టమైన సంకేతంగా భావించాలి. చెవిలో నిరంతరం ఈల వేసినట్లు, రింగుమనే శబ్దం వస్తున్నా.. వినికిడి దెబ్బతింటున్నదని అనడానికి ప్రాథమిక హెచ్చరికే! కాబట్టి, హెడ్ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్న హెడ్ఫోన్లు వాడాలని అంటున్నారు. దీనివల్ల బయట శబ్దాలు వినిపించవు. కాబట్టి, వాల్యూమ్ తక్కువలో పెట్టుకుని స్పష్టంగా వినవచ్చు.