ఉద్యోగార్థుల జీవితాలతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆడుకుంటున్నాయి. లేని ఉద్యోగాలను సృష్టిస్తూ, నోటిఫికేషన్లు జారీచేస్తూ.. నిరుద్యోగుల్లో లేనిపోని ఆశలు కల్పిస్తున్నాయి. వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటూ.. లాభాలు కూడా గడిస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో ఈ ఘోస్ట్ హైరింగ్, ఘోస్ట్ జాబ్స్ ధోరణులు మితిమీరుతున్నాయి. ఈ కార్పొరేట్ కుతంత్రాలను ముందే పసిగడితే.. వీటి బారినుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని కార్పొరేట్ కంపెనీలు తమ అధికారిక వెబ్సైట్లు, జాబ్ సైట్లలో ఉద్యోగ ప్రకటనలు ఇస్తాయి. కానీ, ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశం ఆయా సంస్థలకు ఉండదు. కేవలం తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికే ఇలాంటి ఉనికిలో లేని, భర్తీ చేయని ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తుంటాయి. ఈ విపరీత ధోరణినే.. ఘోస్ట్ హైరింగ్, ఘోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు.
ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశం ఉండదు. అయినా, ఇలా ప్రకటనలు ఇవ్వడం వెనుక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉంటాయి.
వృద్ధిని చూపించడం: తమ కంపెనీ ఇంకా వృద్ధి చెందుతున్నదని చెప్పుకోవడానికి ఇలా ప్రకటనలు ఇస్తుంటాయి. అందుకే కొత్తవారిని తీసుకుంటున్నామని పెట్టుబడిదారులకు, క్లయింట్లకు నమ్మకం కలిగిస్తాయి.
పైప్‌లైన్ సిద్ధం: ఈ సందర్భంగా వచ్చే అభ్యర్థులతో ఓ పైప్‌లైన్‌ను సిద్ధం చేసుకుంటాయి. అప్పుడే ఉద్యోగంలోకి తీసుకోకపోయినా.. తమకు అవసరం వచ్చినప్పుడు వారికి కాల్ లెటర్స్ పంపిస్తాయి. భవిష్యత్తులో ఎవరైనా రాజీనామా చేసినా, కొత్త ప్రాజెక్ట్ వచ్చినా.. వెంటనే అందుబాటులో ఉన్నవారిని నియమించుకుంటాయి.
ఉద్యోగులపై ఒత్తిడి: ప్రస్తుతం ఆయా సంస్థల్లోని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడానికీ ఇలాంటి ఘోస్ట్ హైరింగ్స్ చేస్తుంటాయి కొన్ని సంస్థలు. ‘మీకు ప్రత్యామ్నాయంగా బయట చాలామంది సిద్ధంగా ఉన్నారు’ అని ఉద్యోగులను పరోక్షంగా హెచ్చరిస్తుంటాయి. ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి అడిగినప్పుడు.. ‘మేము కొత్త వారిని వెతుకుతున్నాం’ అని బెదిరిస్తుంటాయి.
నిరంతర అన్వేషణ: ఘోస్ట్ హైరింగ్‌లో భాగంగా కొన్నిసార్లు అద్భుతమైన ప్రతిభ ఉన్న అభ్యర్థులు తక్కువ జీతానికే దొరుకుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో వారిని రిక్రూట్ చేసుకుంటారు.
ఘోస్ట్ హైరింగ్ వల్ల నిరుద్యోగులు, ఉద్యోగ మార్పు కోరుకునే వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. వారి విలువైన సమయం వృథా అవుతుంది. ఎన్ని అప్లికేషన్లు నింపినా, ఇంటర్వ్యూలు జరిగి రోజులు నెలలు గడుస్తున్నా.. అటువైపు నుంచి ఎటువంటి స్పందనా రాదు. దాంతో, అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఇలాంటివే తరచుగా ఎదురవుతూ ఉంటే.. అభ్యర్థుల్లో మార్కెట్‌పై నమ్మకం పోతుంది. ‘అసలు ఉద్యోగాలు ఉన్నాయా?! లేదా?!’ అనే అనుమానం కలుగుతుంది.
కొన్ని లక్షణాల ద్వారా ఘోస్ట్ హైరింగ్స్ను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సదరు పోస్టింగ్స్ అసలైనవేనా? కాదా? అని అంచనా వేయవచ్చని అంటున్నారు.
అందుకే.. అభ్యర్థులు నెట్‌వర్కింగ్‌పై దృష్టి పెట్టాలి. కేవలం ఆన్లైన్ పోర్టల్స్‌పై ఆధారపడకుండా, ఆ కంపెనీలో పనిచేసే వారితో మాట్లాడాలి. నిజంగా ఖాళీ ఉందో లేదో తెలుసుకోవాలి. ఇక థర్డ్ పార్టీ సైట్ల కంటే.. కంపెనీ అధికారిక కెరీర్ పేజీని చెక్ చేయడం ఉత్తమం. ఆ కంపెనీ ఇటీవల ఎవరినైనా నియమించుకుందా? లే-ఆఫ్స్ ప్రకటించిందా? అనే విషయాలు గమనిస్తే.. ఘోస్ట్ జాబ్స్ బారిన పడకుండా ఉంటారు.