మనిషి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించేదే థైరాయిడ్ గ్రంథి. ఇది సక్రమంగా పనిచేయకపోతే హార్మోన్లన్నీ అసమతుల్యంగా మారిపోతాయి. దీంతో శరీర భాగాలు సక్రమంగా పనిచేయవు. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల థైరాయిడ్… పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతం అధిక రక్తపోటు (బీపీ), డయాబెటిస్ వ్యాధుల్లానే థైరాయిడ్ సమస్య కూడా సాధారణంగా మారిపోయింది. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు లేవు. ఒక్కసారి థైరాయిడ్ సమస్య తలెత్తిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే. వివిధ అనారోగ్యాలకు దారితీసే థైరాయిడ్ సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రతి ఏటా మే 25న ‘ప్రపంచ థైరాయిడ్ దినం’గా పాటిస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని థైరాయిడ్ సమస్యలు ఎన్ని రకాలు, అవి రావడానికి కారణాలు, వాటి లక్షణాలు, థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
థైరాయిడ్ గ్రంథి మనిషి శరీర జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి మానవ జీవక్రియల్లో… అంటే, మనిషి పుట్టిన దగ్గరనుంచి మెదడు అభివృద్ధి, ఎత్తు పెరుగుదల, బాలికల్లో రజస్వల కావడానికి, స్త్రీలలో నెలసరి, గర్భం దాల్చడం వంటి వాటిలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, థైరాయిడ్ సమస్యలు పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే అధికంగా కనిపిస్తాయి. అందువల్లే మహిళలు గర్భధారణకు ముందు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే తల్లికి థైరాయిడ్ సమస్య ఉంటే పుట్టబోయే బిడ్డలో మెదడు వృద్ధి చెందకపోవచ్చు. సాధారణంగా గర్భం దాల్చిన 11-12 వారాల తర్వాతనే కడుపులో ఉన్న శిశువులో థైరాయిడ్ గ్రంథి ఏర్పడుతుంది. అంటే అప్పటివరకు పిండం అభివృద్ధి తల్లి థైరాయిడ్ గ్రంథిపైనే ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో తల్లి తీవ్రమైన థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటే దాని ప్రభావం కడుపులో శిశువు మెదడుపై పడుతుంది. వైద్యులను సంప్రదించాలి థైరాయిడ్ ఉన్న మహిళలు గర్భం దాల్చినప్పుడు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలి. వాళ్లు సూచించిన ప్రకారం థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భం దాల్చిన థైరాయిడ్ బాధిత గర్భిణులకు థైరాయిడ్ డోస్ వారి ఆరోగ్యస్థితి ఆధారంగా మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారిని వైద్యులు సాధారణ గర్భిణుల కంటే జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ప్రధానంగా థైరాయిడ్‌లో మూడు రకాల రుగ్మతలు ఉంటాయి. 1. హైపో థైరాయిడ్, 2. హైపర్ థైరాయిడ్, 3. థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే రుగ్మతను నియంత్రణలో ఉంచవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎలాంటి పథ్యం అవసరం ఉండదు. ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన పనిలేదు. అన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.
థైరాయిడ్ గ్రంథి నుంచి వెలువడే హార్మోన్ల స్థాయులు రక్తంలో సాధారణం కంటే తక్కువగా ఉండే పరిస్థితి హైపో థైరాయిడ్ లేదా లో థైరాయిడ్. ఈ సమస్యను రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.
రక్తంలో ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లు ఉండటమే హైపర్ థైరాయిడ్. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే శరీరంలో జీవక్రియలు దెబ్బతిని తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఆటో ఇమ్యూనిటీ అనేది సర్వసాధారణ కారణంగా చెప్పవచ్చు. అంటే మన శరీరం మన కణజాలానికి వ్యతిరేకంగా యాంటిబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. దానినుంచి విడుదలయ్యే హార్మోన్లలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. వీటివల్ల హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలుంటాయి. అయితే ఈ ఆటో ఇమ్యూనిటీ సమస్య వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అదికాకుండా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరంలో అయోడిన్ స్థాయులు తగ్గితే కూడా థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్యలకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారికైనా రావచ్చు. కడుపులో ఉన్నప్పుడు శిశువుకు థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పరిపక్వత చెందకపోతే ఆ శిశువుకు పుట్టుకతోనే థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. నవజాత శిశువుల్లో థైరాయిడ్ లక్షణాలు కనిపించవు. కాబట్టి, పుట్టిన వెంటనే శిశువుకు కచ్చితంగా థైరాయిడ్ పరీక్షలు కూడా చేస్తారు.
థైరాయిడ్ సమస్యను రక్తపరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లను టీ3, టీ4, టీఎస్‌హెచ్ (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్)గా పిలుస్తారు. థైరాయిడ్ టెస్టులు చేసినప్పుడు టీ3, టీ4, టీఎస్‌హెచ్ విలువల ఆధారంగానే రోగికి ఏరకమైన థైరాయిడ్ ఉందో నిర్ధారిస్తారు. టీ3, టీ4 తక్కువగా ఉండి, టీఎస్‌హెచ్ ఎక్కువగా ఉంటే వారికి లో థైరాయిడ్ లేదా హైపో థైరాయిడ్ ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. అదే హైపర్ థైరాయిడ్ రోగుల్లో అయితే టీ3, టీ4 ఎక్కువగా ఉండి, టీఎస్‌హెచ్ తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారిస్తారు.
థైరాయిడ్ స్థాయిలు, వాటికి సంబంధించిన యాంటిబాడీస్ ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. సాధారణంగా థైరాయిడ్ లక్షణాలు ఉండి, టీఎస్‌హెచ్ స్థాయులు ఎక్కువగా ఉంటే వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఒక్కసారి థైరాయిడ్ చికిత్స ప్రారంభిస్తే ఇక జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రోగులకు చికిత్సా విధానం వేర్వేరుగా ఉంటుంది. లో థైరాయిడ్ రోగులకు ‘థైరాక్సిన్’ అనే థైరాయిడ్ హార్మోన్ మాత్రలు ఇస్తారు. రోగి రక్తంలోని థైరాయిడ్ విలువల ఆధారంగా మాత్రల డోసు సూచిస్తారు. ఇక హైపర్ థైరాయిడ్ రోగులకు మూడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి థైరాయిడ్ మాత్రలు ఇవ్వడం. రెండోది ‘రేడియో అయోడిన్ అబ్లేషన్’ ఇస్తారు. ఇది చుక్కల మందు రూపంలో ఉంటుంది. ఈ మందు వేయడం వల్ల అధిక పరిమాణంలో ఉన్న థైరాయిడ్ హార్మోన్లు సాధారణ స్థాయికి వస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో వాపు వచ్చి పరిమాణం పెరిగినప్పుడు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే గ్రంథి పరిమాణం పెద్దగా ఉన్న ప్రతి ఒక్కరికీ సర్జరీ అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.