ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన పానీయంగా ప్రజాదారణ పొందిన కొబ్బరి నీళ్లు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని తెలిసిందే! కానీ, కొన్నిసార్లు అవే కొబ్బరినీళ్లు కీడునూ తలపెడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2021లో డెన్మార్క్‌కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి.. పైకి తాజాగా కనిపించే కొబ్బరి నీళ్లు తాగాడు. అప్పటిదాకా ఆరోగ్యకరంగా కనిపించిన వ్యక్తి కొద్ది సమయంలోనే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడట. తాను తాగిన కొబ్బరి నీళ్లలో 3-నైట్రోప్రొపియోనిక్ యాసిడ్ అనే ప్రాణాంతక టాక్సిన్ ఉత్పతై కొద్ది గంటల్లోనే అతనికి వికారం, వాంతులతో పాటు శరీరమంతా చెమటలు పట్టడం మొదలయ్యాయి.
మల్టీ ఆర్గాన్స్ పాడైపోయి చివరకు ఆ వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, అన్ని కొబ్బరి బోండాలూ సురక్షితం కాదన్న విషయం గుర్తించాలి. వెచ్చదనం, తేమతో కూడిన పరిస్థితుల్లో కొబ్బరిబొండాలను నిల్వ చేసినప్పుడు టెంకపై ఉండే చిన్న పగుళ్లద్వారా శిలీంద్రాలు కాయలోకి చొచ్చుకుపోతాయట. అయితే, పైకి మాత్రం ఆ బోండం తాజాగానే కనిపిస్తుంటుంది. లోపల మాత్రం విషపదార్థాలు ఉత్పత్తవుతాయి. ఇలాంటి బోండాల్లోని నీళ్లు నాడీ వ్యవస్థ, మెదడు, ముఖ్య అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.