వాళ్లు కామెడీగా చూస్తే ఓన్లీ నవ్వుల్స్! సీరియస్‌గా చూస్తే పొట్ట చెక్కలే!! స్క్రీన్ మీద కనిపిస్తే చాలు… ఈలలు, గోలలు!! కథ భారంగా ఉన్నప్పుడు రిలీఫ్ ఇచ్చేవాడు, రిలాక్స్డ్గా సాగిపోతున్న కథ వేగం పెంచేవాడు కమెడియన్. కథకేమో గానీ, కథనానికి మాత్రం కింగ్లాంటోడు. మిగతా భాషల సంగతేమో కానీ, తెలుగు చిత్రసీమ మాత్రం ఆదినుంచీ కమెడియన్లతో కళకళలాడింది. వీరిలో కొందరు హీరోలయ్యారు, నిర్మాతలయ్యారు, దర్శకులుగా రాణించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వాళ్లందరూ కామెడీ కింగ్స్!
సినిమా బాగుండాలంటే.. కథ చక్కగా కుదరాలి. కానీ, కథనం ముదిరి పాకాన పడాలంటే, పక్కన పకపక నవ్వించేవాడు ఉండాలి. ప్రేక్షకులు పక్క చూపులు చూడకుండా తెరకు అంకితమయ్యేలా హాస్యం పండాలి. మంచి బిగువు ఉన్న కథ, స్క్రిప్ట్‌కు ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ అవసరం లేదు కానీ, అన్ని సినిమాలకూ అది వర్కవుట్ కాదు. ఒక్కోసారి ఎంత గొప్ప కథకైనా కథనంలో కుదుపులు తప్పవు. ఎప్పుడైతే స్క్రీన్‌ప్లే డౌన్ అవుతుందో థియేటర్ తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. ఆడియన్స్‌లో ఒక్కొక్కరూ లేచీ బయటికి నడుస్తూ ఉంటారు.
ఇది సినిమాకు ప్రమాద ఘంటిక. అలాంటి సమయంలో డౌన్ అవుతున్న సినిమాని భుజం పట్టి పైకి లేపడానికి ఓ క్యారెక్టర్ కావాలి. అక్కడ ఏదో మాయ జరగాలి. మళ్లీ సినిమా ట్రాక్ ఎక్కాలి. వాడే ‘కమెడియన్’. తోలుబొమ్మలాట, బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు.. మొదలైన జానపద కళారూపాల్లోనూ జనం ఆవులిస్తున్నప్పుడల్లా వాళ్ల నిద్రమత్తు వదిలించేందుకు ఓ విదూషకుడుండేవాడు. అలాగే సినిమాకు కమెడియన్. ఓ విధంగా కథను బతికించడానికీ.. సమాంతరంగా నడిపించి, రక్తికట్టించడానికీ.. రచయితల మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చిన సినిమా రక్షకుడు ‘కమెడియన్’. అసలు తెలుగు సినిమాలో కామెడీ శకం ఎప్పుడు మొదలైంది? ఎన్ని మలుపులు తిరిగింది? అది ఇంతింతై వటుడింతై అన్న చందాన సినిమాను ఎలా ఆక్రమించింది? ఎలా శాసించింది? ఈ అంశాల గురించి కాసేపు గుర్తుచేసుకుందాం.
Telugu Cinema | తెలుగు తెరపై తొలి కమెడియన్ కస్తూరి శివరావ్. తొలి స్టార్ కమెడియన్ కూడా ఆయనే. తొలినాళ్లలో టెంటుహాళ్ల బయట టిక్కెట్లు చింపిన శివరావ్, తర్వాత ప్రొజెక్టర్ బాయ్‌గా ప్రమోటయ్యారు. ఆ తర్వాత నటుడై, స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. స్వర్గసీమ, బాలరాజు, ముగ్గురు మరాఠీలు, మాయలమారి, రక్షరేఖ, లైలామజ్ను, మనదేశం.. ఇలా 40ల్లో వచ్చిన ప్రతి సినిమాలో కమెడియన్ అంటే శివరావే. విచిత్రమైన ఆకారం, విభిన్నమైన డైలాగ్ డెలివరీ.. వీటికి తోడు చక్కటి సంగీతజ్ఞానం. ఈ మూడూ శివరావ్ని తిరుగులేని కమెడియన్‌గా నిలబెట్టాయి. ‘గుణసుందరికథ’ చిత్రంతో ఆయన హీరోగా కూడా మారారు. ‘పరమానందయ్య శిష్యులు’(1950) అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ‘నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు సినిమా తీయడమే’ అని పలు వేదికల్లో చెప్పేవారు శివరావ్.
అయితే శివరావ్ ప్రభ తెలుగుతెరపై ఎక్కువకాలం వెలగలేదు. తన సమకాలీన కమెడియన్ రేలంగి వెంకటరామయ్యకు ‘పాతాళభైరవి’ (1951) రూపంలో పెద్ద బ్రేక్ రావడంతో శివరావ్ కెరీర్ మసకబారింది. రేలంగి కామెడీ సూపర్‌స్టార్‌గా అవతరించారు. తెలుగు సినిమా హాస్యానికి స్వర్ణయుగం మొదలైంది. రేలంగి దశాబ్దాలపాటు సినీహాస్యాన్ని శాసించారు. అంతేకాదు, ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న తొలి హాస్యనటుడిగా రికార్డు సృష్టించారు. ఆయన ఉధృతంగా ఉన్నప్పుడే పద్మనాభం కూడా దీటుగా సినిమాలు చేస్తూ సత్తా చాటారు.
కస్తూరి శివరావు, రేలంగి, పద్మనాభం, రాజబాబు, సుత్తివేలు ఆ తర్వాత బ్రహ్మానందం.. వీళ్లని హీరోయిజంతో కూడిన హాస్యనటులు అనాలి. సినిమాల్లో ఈ స్టార్ కమెడియన్లకు ఓ సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఓ హీరోయిన్ ఉంటుంది. డ్యూయెట్లూ ఉంటాయి. ఇంకా మాట్లాడితే ఫైట్లు కూడా చేస్తారు. ఇదంతా ఓ రకం. వీరిలో సుత్తివేలు మినహా అందరూ సోలో హీరోలుగా నటించినవారే. రేలంగి.. పెద్దమనుషులు, పక్కయింటి అమ్మాయి చిత్రాల్లో హీరోగా చేశారు. రాజు-పేద, శభాష్‌రాజా చిత్రాల్లో హీరోతో సమానమైన పాత్రలు పోషించారు. కమెడియన్ పద్మనాభం హీరోగా సత్తాచాటాడు.
రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు.. ఈ ముగ్గురి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరికి జనరేషన్‌తో ప్రమేయం ఉండదు. స్టార్ కమెడియన్ ఎవరైనా.. వారికి దీటుగా సమాధానమిచ్చే హాస్యనటులుఈ ముగ్గురు.
‘రేఖ-మురళీ ప్రొడక్షన్స్’ పతాకంపై ఎన్టీఆర్ అంతటి సూపర్‌స్టార్‌తో ‘దేవత’ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మించాడు. శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న, జాతకరత్న మిడతంభొట్లు, పొట్టి ప్లీడర్ లాంటి చిత్రాలను నిర్మించి, తానే హీరోగా నటించాడు. ‘కథానాయిక మొల్ల’ సినిమాతో దర్శకుడిగా కూడా సత్తా చాటాడు. అలాగే రాజబాబు కూడా తాతామనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, ఎవరికివారే యమునాతీరే, మనిషి రోడ్డునపడ్డాడు చిత్రాల్లో హీరోగా అలరించాడు. ‘బాబాయ్ హోటల్’తో బ్రహ్మానందం కూడా హీరోగా అదరహో అనిపించాడు.
ఇదంతా ఒక చరిత్ర అయితే.. అసలు కామెడీ నుంచి హీరోయిజాన్ని ఆవిష్కరించిన చరిత్ర ఆంధ్రా దిలీప్‌గా ప్రఖ్యాతి గాంచిన ‘చలం’ది. ఇప్పటివరకూ మనం చెప్పుకొన్న కమెడియన్లందరూ హీరోలుగా అలా అప్పుడప్పుడు మెరిసి మాయమైన వారే. కానీ చలం మాత్రం కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి నటుడిగా ఎదిగాడు. హీరోగా మారాడు. ‘రమణచిత్ర’ అనే సంస్థను స్థాపించి అద్భుతమైన చిత్రాలను నిర్మించాడు. హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తెలుగు చిత్ర సీమలో చలం కమెడియన్స్‌కి ఓ టార్చ్‌బేరర్. ఎందుకంటే.. కమెడియన్లు కూడా స్టార్ హీరోలు కావొచ్చని నిరూపించిన తొలి నటుడు చలం.
మట్టిలోమాణిక్యం, సత్తెకాలపు సత్తెయ్య, సంబరాల రాంబాబు, బొమ్మా-బొరుసా, బుల్లెమ్మ బుల్లోడు, తోటరాముడు, లంబాడోళ్ల రాందాసు.. ఇలా హీరోగా ఎన్నో అద్భుతాలు సృష్టించాడు చలం. ఆయన సినిమాల్లో పాటలకు ఇప్పటికీ అభిమానులున్నారు. మాస్ హీరోలు రాజ్యమేలుతున్న తరుణంలో నరేశ్, రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్లు చలం దారిలో పయనించే హీరోలుగా నిలబడ్డారు. అదే దారిలో పయనించి అలీ హీరోగా దాదాపు యాభై చిత్రాల్లో నవ్వులు పంచాడు. అల్లరి నరేశ్, సునీల్ లాంటి వాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. ఇదంతా మన తెలుగు సినిమా నవ్వుల నక్షత్రాల జ్ఞాపకాల దొంతర. ఒక చిన్ననవ్వుతో ప్రపంచయుద్ధాలు ఆపొచ్చంటారు. అదే నవ్వుతో చెరగని చరిత్రనే సృష్టించవచ్చని రుజువుచేసిన మన కామెడీ స్టార్లకు ప్రేక్షకుడెప్పుడూ రుణగ్రస్తుడే.
– బుర్రా నరసింహ