చెత్తకుప్పలో శిశువును చూసి జోలపాట పాడింది. అనాథ ఆడపిల్లలు ఏడుస్తుంటే లాలిపాట పాడింది. పాడటమే కాదు.. ఆ పాట పరమార్థాన్ని అందించేందుకు వారిని దత్తత తీసుకున్నది. కళతోపాటు కనికరాన్నీ చాటుతున్న వెంకటాపురం అర్చన పాటల ముచ్చట!
మాది వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట్. అమ్మ లక్ష్మి, నాన్న రఘు. తెలంగాణలో మా ఊరే ఆఖరు. మిశ్రమ సంస్కృతి, భిన్నమైన జీవన విధానం మాది. కనుచూపు మేరలో షాబాదీ బండలతో, పసుపు, వాము, కంది పంటలతో నిత్యం కొత్తగా కనిపిస్తుంటది. మా అమ్మమ్మ వాళ్లది కర్ణాటక. అక్కడికి వెళ్లినప్పుడల్లా నాకు కొత్తగా అనిపించేది. కన్నడ నాటకాలు, నృత్యాలు, పాటలు, సంగీతం నాలోని కళాసక్తిని తట్టిలేపినయి. నేను ముద్దుముద్దుగా పాడుతుంటే అమ్మ మురిసిపోయేది. ‘చాలా మంచిగ పాడుతున్నవ్ బిడ్డా. ఇట్లనే పాడు. మంచి సింగర్వి కావాలె’ అంటుండె. అమ్మ మాటలు నా మనసులో పాతుకుపోయినయి. టీచర్లకు నా ప్రతిభ తెలిసి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాడించేటోళ్లు. తత్తరపాటు లేకుండా పాడేదాన్ని.
కళతో పాటు సేవ
సింగర్‌గా పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడే తెలంగాణ ఉద్యమం స్వాగతం పలికింది. ఉద్యమ గాయని విమలక్క బృందంలో చేరి అరుణోదయలో చురుగ్గా పనిచేసిన. మేం ఎక్కని వేదిక లేదు. పాడని పాటలేదు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూనే, నాన్న కోరిక మేరకు బీఎడ్ చేసిన. పీజీ చదివిన. సమాజంపై అవగాహన ఏర్పరచుకున్న. మానవత్వం మంటగలుపుతూ.. పసిబిడ్డలను చెత్తకుప్పల్లో పడేస్తున్న సంఘటనలు, ఆడబిడ్డ పుడితే అరిష్టంగా భావించే దురదృష్టకర సంప్రదాయాలు.. చాలానే చూసిన. అలాంటి బిడ్డలను చేరదీయాలని అనుకున్న. తల్లిదండ్రులు లేని నలుగురు ఆడపిల్లల్ని దత్తత తీసుకున్న. జహీరాబాద్‌లో వారిని చదివిస్తున్న. ఒకవైపు కళను, మరోవైపు సమాజ సేవను బాధ్యతగా తీసుకున్న.
పాట గొప్పదనం
నేను హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో.. జెండా వందన కార్యక్రమానికి అంతా సిద్ధం చేసినం. అప్పటిదాకా ప్రాక్టీస్ చేసిన నాకు హఠాత్తుగా జ్వరం వచ్చింది. నా మనసు మాత్రం జెండా పండుగపైనే ఉంది. కానీ, బడికెళ్లడానికి చేతకాలేదు. స్కూల్లో ప్రోగ్రామ్ మొదలైందని తెలిసింది. మైక్‌లో పాటలు వినిపిస్తున్నయి. పాటలతో పాటు ఉపన్యాసాలు కూడా వినిపిస్తున్నయి. రెండూ మిస్సయ్యాయని బాధపడుతూ ఇంట్లనే కూర్చున్నా. స్టేజ్‌పై నేను కనిపించకపోయేసరికి మా సైన్స్ సార్ కిషన్‌రావుకు అనుమానం వచ్చింది. ‘అర్చన ఎక్కడా?’ అన్నరంట. ‘జ్వరమొచ్చింది. రాలేదు’ అని మా ఫ్రెండ్స్ చెప్పిండ్రంట. ‘పాట పాడితే జ్వరం ఉండదు, ఏమి ఉండదు. ఇంటికెళ్లి తీసుకురండ్రీ’ అని పిల్లల్ని పంపించిండ్రు. వెళ్లకపోతే సార్ తిడతారని వెళ్లిన. చేతగాకున్నా స్టేజెక్కి పాడిన. నిజంగానే నీరసం పోయి హుషారొచ్చింది. నా పాటతో అందరిలో జోష్ తీసుకొచ్చిన. కిషన్‌రావు సార్ నా మొఖంలోకి చూస్తూ ‘చూసినవా పాట గొప్పదనం’ అన్నరు. ఇలాంటి అనుభవాలు చానా ఉన్నయి. ఇంటర్లో పండరి సార్ కూడా బాగా ఎంకరేజ్ చేసిండ్రు.
జానపదాన్ని వదలను
ఉద్యోగం కోసం అన్ని పోటీ పరీక్షలూ రాసిన. ఒకేసారి మూడు ఉద్యోగాలు వచ్చినయి. మూడూ సర్కారు కొలువులే. జీతమే ముఖ్యం, సంపాదనే లక్ష్యం అనుకుంటే రెవెన్యూ శాఖకు వెళ్లేదాన్ని. కానీ నాకు కళపై మక్కువ. చిన్నప్పటి నుంచీ జానపదాలే సంపాదనగా భావించిన. కాబట్టే తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేరిన. ఆ ఆనందం పూర్తిగా అనుభవించక ముందే నాన్న దూరమయిండు. ఇప్పుడు ఇంటికి నేనే పెద్దదిక్కు. తమ్ముడు, చెల్లె, దత్తత తీసుకున్న నలుగురు పిల్లలు.. వీళ్లను చూసుకుంటూ జానపదాన్ని బతికించేందుకు ప్రతి నిత్యం తపిస్తున్న. ‘సందమామ సందామామా జోడు ముద్దుటుంగురాలే సందామామా’, ‘నడువు నడువర బావా నడుంకట్టర బావా’, ‘బాయిల్ల బచ్చెల్లీకూర అంజయ్యా’, ‘వీడేమి మొగడే నెర్రె నీల్గుతున్నడే’.. నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాటలు. చదువుకునే రోజుల్లోనే నాకు డైరీ రాసే అలవాటు ఉండేది. ఏ రోజు ఏ పాట నేర్చుకున్నా, ఏ పాట ఎక్కడ సేకరించినా అందులో రాయాల్సిందే. ఆ పాటలను పదిమందిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న.
నాన్న పాట నుంచి..
నాన్న జానపద పాటలు, భజన పాటలు పాడేవాడు. ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఆయన గొంతు వినిపిస్తుండె. ఆ పాటలను, కీర్తనలను వింటూ సాధన చేస్తుండేదాన్ని. అది చూసి నాన్న ‘బాగా పాడుతున్నవ్రా’ అని ప్రోత్సహించేవాడు. అయితే నేను సింగర్ కావడం ఆయనకు ఇష్టం లేకుండె. నన్ను టీచర్‌గా చూడాలన్నది నాన్న కోరిక. అమ్మ మాత్రం నన్ను సింగర్‌గానే చూడాలనుకునేది. నేను పాటపై పట్టు సంపాదించి పెద్ద ప్రోగ్రామ్స్ చేసేనాటికి అమ్మ మాకు దూరమైంది. తోడపుట్టిన తమ్ముడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రెండు సంఘటనలూ నన్ను మానసికంగా బలహీనం చేసినయి. మనసంతా భయం ఆవహించింది. ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టలేదు. నాన్న నన్నట్లా చూడలేకపోయిండు. ధైర్యం చెప్పి నన్ను మామూలు స్థితికి తీసుకొచ్చిండు. అప్పుడు మళ్లీ పాట అందుకున్న.
– దాయి శ్రీశైలం