Everest Fraud : ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతిగాంచిన మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest) పర్వతారోహకులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పర్వాతారోహకులు (Treckers) ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు తీసుకొనే ఆహారాన్ని రహస్యంగా ఫుడ్ పాయిజన్ చేస్తున్నారని తేలింది. కొంతమంది ఒక నెట్వర్క్లా ఏర్పడి ఈ కుట్రకు పాల్పడుతున్నారని, అత్యవసర పరిస్థితిని సృష్టించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని నేపాల్ పోలీసులు (Nepal Police) అభియోగాలు మోపారు.
దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎవరెస్ట్ పర్వతారోహకులు (Everest Trekkers) తీసుకునే ఆహారంలో బేకింగ్ సోడా మోతాదును పెంచుతున్నారు. దాంతో వారు జీర్ణకోశ సమస్యలకు గురవుతున్నారు. అయితే ఎత్తు కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయని ట్రెక్కర్లను వారు నమ్మిస్తుంటారు. అప్పుడే వారి భయాన్ని సొమ్ము చేసుకోవడం మొదలవుతుంది. వారిని అత్యవసరంగా ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లను రప్పిస్తారు. ఎంత డబ్బయినా చెల్లించేలా అప్పటికే బాధితులను ఒప్పిస్తారు.
పక్కాగా జరుగుతున్న ఈ కుట్రలో కొందరు షెర్పాలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. తర్వాత నకిలీ వైద్యం, ఫ్లైట్ పత్రాలు చూపించి బీమా సంస్థల నుంచి డబ్బులు పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. తర్వాత బీమా సొమ్మును షెర్పాలు, హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, నకిలీ పత్రాలు ఇచ్చిన ఆసుపత్రులు పంచుకుంటున్నాయని వెల్లడించారు. ఈ మోసం విలువ 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.186 కోట్లు) అని అంచనా వేశారు.
పర్వతాల్లో సహాయక చర్యలు చేపట్టే సంస్థలకు చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లను ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేసిన తర్వాత ఈ స్కామ్ గురించి వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 32 మందిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ పర్యాటకంలో ఎంతో కీలకమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్ట్ ట్రెక్కింగ్ విషయంలో జరుగుతున్న మోసాన్ని అక్కడి న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగమైన వారికి భారీ స్థాయిలో జరిమానా విధించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
కాగా పర్యాటకుల విషయంలో ఇలాంటి స్కామ్‌లు వెలుగుచూడటం ఇది తొలిసారి కాదు. అందుకే ఈ మోసాల కారణంగా పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ఎవరెస్ట్ విజిటర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం నిలిపివేశాయి. ఈ ఘటనలపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కఠిన శిక్షలు లేకపోవడమే నేరాలు పెరగడానికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.