శ్రావణమాసపు తొలివారపు వాన జల్లులతో తడిసిన మట్టివాసనతో ‘ఎకోస్ ఆఫ్ ఫోక్ సోల్’ పేరుతో కాపు రాజయ్య పెయింటింగ్ ప్రదర్శనలో ఆడబిడ్డలు అడవి నెమైళ్లె కనిపిస్తున్నారు. ఈ చిత్ర ప్రదర్శన మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఐఏఎస్ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రదర్శనలో
రాజయ్య బతుకమ్మ, బోనాల పెయింటింగులు చూసి భావోద్వేగానికి గురైన మిట్టపల్లి సురేందర్.. ‘ఎంతటి అందాల మహరాణివే నీ చుట్టూ పూలన్ని చెలికత్తలే’ అంటూ తన పాటను రాజయ్యకు అంకితమిస్తూ, ‘ముందుగా వచ్చిన పువ్వుల దీపావళి ఈ రాజయ్య పెయింటింగులు’ అంటూ ముగించాడు.
రాష్ర్టానికి రాజముద్ర వలె తెలంగాణ సంస్కృతికి రాజయ్య ముద్ర ఈ పెయింటింగ్‌లు అనడంలో అతిశయోక్తిలేదు. ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ వచ్చింది. బ్లౌజ్, చీరెల బార్డర్‌కు కాపు రాజయ్య బొమ్మలు.. ఆశ్చర్యపడ్డా! రాజయ్య గీసిన రంగురంగుల డిజైన్లతో రవికెలు, చీరెల డిజైన్లతో పల్లె మహిళల బొమ్మలు ఆధునిక స్త్రీల దుస్తులపై వాలి ఆశ్చర్యగొలిపాయి. అప్పటి-ఇప్పటి మహిళల మధ్య కాపు రాజయ్య ఒక వారధిగా ఉన్నట్లు తోచింది. వారి స్వస్థలం సిద్దిపేట. తెలుగురాష్ర్టాల్లో ఎములాడ రాజన్నను చిత్రించిన సిద్దిపేట రాజన్నను దైవ సమానంగా కొలిచే శిష్యులున్నారు. సిద్దిపేటలోని గ్రామీణ వృత్తికారులైన కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చేనేత పనివారల్లోని హస్తకళా రూపాలను, జానపద వారసత్వంలోని గాఢతను అధ్యయనం చేసి బొమ్మలు గీసే రాజయ్యను.. ఎంతోమంది పట్టణానికి వచ్చి డబ్బు సంపాదించమని చెప్పినా రానని తిరస్కరించి సొంత ఊరిలోనే ఉండిపోయిన మహా మనిషి ఆయన.
నాలుగేళ్ల క్రితం ప్రముఖ డైరెక్టర్ శ్యాంబెనగల్ని ఇంటర్యూ చేసినప్పుడు తెలంగాణ పల్లెల గురించి చెబుతూ.. సిద్దిపేటను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో సిద్దిపేట ప్రాంతంలోని అందమైన లాండ్స్కేప్ ఒక్క మైసూర్లో తప్ప ఎక్కడా లేదన్నాడు. రాజయ్య సిద్దిపేటను విడిచిరాకపోవడం ప్రకృతితో మమేకమైన ఒక దివ్యమైన అనుబంధం ఏదో ఉండి ఉంటుంది. సిద్దిపేటలోని మార్వాడీ ఇళ్ల గోడలపై ఉండే ‘నకాషీ’ చిత్రాల ప్రేరణతో రాజయ్య తన చుట్టూ నివసిస్తున్న జానపదుల అమాయకత్వానికి, ఆచార వ్యవహారాలకు ముగ్ధులై వాటినే తన చిత్రాలకు వస్తువులుగా చేసుకున్నారు.
ఫోక్స్టైల్ విధానాన్ని ఆకళింపు చేసుకొని ‘టెంపోరా’ పద్ధతిలో 15 ఏండ్లపాటు వందలాది సీరిస్‌లు గీశారు. గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి కల్లు గీసే ‘రిస్కీలైఫ్’ చిత్రానికిగాను రాజయ్యకు జాతీయ అవార్డు లభించింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రకళా సామ్రాజ్యానికి రారాజు అయిన రాజయ్య ఆధ్యాత్మిక చిత్రాలను సైతం గీశారు. ‘నల్లమల కొండలు’ అనే చిత్రంలో శేషుని నల్లమల కొండలాగ, తలపై తిరుమల క్షేత్రాన్ని, నడుముపై ఆహోబిల క్షేత్రాన్ని, తోకపై శ్రీశైలాన్ని చిత్రించారు. ఆ చిత్రాన్ని చూస్తే పరమ నాస్తికులు సైతం అప్రయత్నంగా ‘నమో వేంకటేశాయ’ అనక మానరు.
రాజయ్య చిత్రకళా ధర్మం ఆధునికం, ఆబ్స్ట్రాక్ట్, సంప్రదాయం, జానపదం అనే నాలుగు పాదాలపై నడిచింది. మొదట ‘వాష్’ పద్ధతిలో ఆ తరువాత ‘నకాషీ’ స్టైల్లో అనంతరం ‘టెంపరీ’ తరహాలో చిత్రాలు గీసిన రాజయ్య బొమ్మలు ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్. వీటికి సొంత పదకోశం, వాక్య నిర్మాణం ఉంది. కళాకారుడు కర్తాభావన లేకుండా తానే కళగా మారితే తప్ప బొమ్మల్లో ఇంత గాఢత, గంభీరాన్ని సాధించడం అసంభవం. వేములవాడ, కొమురవెళ్లి, కోణార్క్, తిరుమల గుడులు, బుద్ధుని మహాభినిష్క్రమణ, తాంత్రిక, మార్మిక గీతల్లో గీసిన బొమ్మలు చూసి తరించాల్సిందే. అరుదైన కళామూర్తుల వరుసలోని వారు, అచ్చమైన తెలుగు జానపద సృష్టి కాపు రాజయ్య. బతుకమ్మ, బోనాలు, మొహర్రం, ఎల్లమ్మ జోగి లాంటి అచ్చమైన తెలంగాణ పండుగలే కాదు వీధి నాటకం, బుర్రకథ, శారదగాండ్లు లాంటి మరెన్నో తెలుగు కళా వారసత్వ సంపదలను భారతీయ కళా సీమకు మొదటగా పరిచయం చేశారు. అంతేకాదు సబ్బండ వర్ణాల కులవృత్తుల్లో జీవిత సౌందర్యాలను, ఆటుపోట్లను భారతీయ కళా చరిత్రలో దృశ్యబద్ధం చేసిందీ రాజయ్యే.
వీరు చేసిన కళా జీవన కృషికి తెలుగుజాతి చేతులెత్తి నమస్కరించాల్సిదే. సిద్దిపేట కళాభవన్ నుంచి సిటీ నడిబొడ్డుకు వచ్చిన ఈ ప్రదర్శనలో ఒక్కో పెయింటింగ్ ఒక్కో పువ్వువలే ఉండి మొత్తంగా ఈ ఎగ్జిబిషన్ కావురి హిల్స్ మీద నిండుగా పేర్చిన బతుకమ్మలా ఉంది. ఈ రోజే ఆఖరు. అద్భుతమైన, అరుదైన చిత్రాలను చూసి తరించే భాగ్యం కోల్పోకుండా వెళ్లి చూసిరండి. రంగుల్లో రంగరించిన జానపదుల జీవన మాధుర్యాన్ని ఒకసారి ఆస్వాదించి రండి..!
-మృత్యుంజయ, కార్టూనిస్ట్