సాధారణంగా నిరసనలు, ధర్నాలు, హర్తాళ్లు జరిగినప్పుడు పోలీసులు అడ్డుకుంటారు. వారిని కట్టడిచేసే ప్రయత్నం చేస్తారు. మగవాళ్లు ఉంటే మగ పోలీసులు, మహిళలు ఉంటే ఆడ పోలీసులు అక్కడ డ్యూటీ చేస్తారు. అది చట్టం. కానీ కొత్త ప్రభుత్వంలో ఈ రెండూ రివర్స్ గేర్ తీసుకున్నాయి. పురుష శాసన సభ్యులను లోపలికి వెళ్లనివ్వకుండా ఆపేందుకు ప్రత్యేక బృందాలను పిలిపించి మరీ మహిళా పోలీసుల్ని కంచెలా ఏర్పాటు చేసిందీ ప్రభుత్వం. ఈ విషయం ఇద్దరికీ ఇబ్బంది కలిగించేదే అయినా అటు శాసన సభ్యులు, ఇటు మహిళా పోలీసులు ఎవరి డ్యూటీ వారు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సంగతి అటుంచితే, ఇటు మహిళా శాసన సభ్యుల విషయంలోనూ అదే పోకడ. వారిని ఆపింది మగ పోలీసులు! కేవలం ఆపడంతో అక్కడ వారి పని పూర్తయితే ఒక రకంగా ఉండేది. అంతకు మించి అతి చేశారు.
సగటు మహిళలతో చూపినట్టే, తమ సహజ దురుసు అహంకార ప్రవర్తనను రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో పనిచేసిన సీనియర్ శాసన సభ్యుల పట్లా ప్రదర్శించారు. ఏకంగా హోమ్ శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డినే జుట్టు పట్టుకుని ఈడ్చారు. సునీతమ్మలాంటి సీనియర్ నేతను చీరలాగి చిన్న బుద్ధిని చూపించుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులు ఎప్పుడూ యాక్టర్లు మాత్రమే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం… అంతా ఆ శాఖా మాత్యులదే అన్న విషయం అందరికీ తెలిసిందే! మహిళకు గౌరవాన్ని తెచ్చిపెట్టే అసలైన చట్టాన్ని తుంగలో తొక్కి, ఈ కొత్త సంప్రదాయాలకు తెరలేపిన ఘనత ఈ ముఖ్యమంత్రికే సాధ్యం. ఆ రకంగా అయినా తెలంగాణలో తనది తొలి ముద్ర కావచ్చన్న ఆశ ఉండి ఉండొచ్చు… అదీ చెప్పలేం. ఇంతకీ, ఈ ఆలోచన ఎలా వచ్చిందనేదే తెలియాల్సిన విషయం. ముందు రోజు జంబలకిడి పంబ సినిమా చూసి, పొరుగు రాష్ట్రపు బాసిజాన్ని కాపీ కొట్టినట్టే… ఈ సినిమానీ తన పరిధి మేరకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తున్నది. లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక!