చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగమే అయినా… కొత్త రుచులను ఆస్వాదించడమంటే ఆమెకు ఇష్టం. చదువు, కెరీర్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రతిసారీ స్థానిక ఆహారాన్ని ఆరగించేది. ఆ అభిరుచే సాహిత్య రాజ్‌ను బేకరీ పరిశ్రమవైపు అడుగులు వేయించింది. ఆ తీయని ప్రయాణం ఆమె మాటల్లోనే..
ముందు బీటెక్, తర్వాత ఎంబీయే.. రెండూ పూర్తి చేసి ఐబీఎంలో జాబ్ చేస్తున్న రోజులవి. ఉద్యోగరీత్యా దేశమంతా తిరగాల్సి వచ్చేది. విదేశాల్లోనూ పర్యటించాను. ఎక్కడికెళ్లినా.. లోకల్ ఫ్లేవర్ ఉన్న ఫుడ్ ఆస్వాదించేదాన్ని. అదే అలవాటుగా మారింది. అదే వ్యాపారంగానూ మారుతుందని మాత్రం అనుకోలేదు.
ఫారిన్ టూర్లో ఉన్నప్పుడు.. అక్కడ దొరికే డెజర్ట్స్, పేస్ట్రీస్, స్వీట్స్ రుచి చూడటం దగ్గరే ఆగిపోయేదాన్ని కాదు. భారత్ వచ్చాక వాటిని ఇంట్లోనే తయారు చేయడమూ అలవాటైంది. ఇరుగు-పొరుగుతో పంచుకునేదాన్ని కూడా. వాళ్ల ప్రశంసలు స్వీట్స్ కంటే తీయగా అనిపించేవి. అప్పుడే, అవన్నీ హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ బిజినెస్ ఐడియా నన్ను స్థిమితంగా ఉండనివ్వలేదు. లక్షణమైన ఉద్యోగానికి రాజీనామా చేయించేదాకా వదిలిపెట్టలేదు. కాకపోతే, మరీ దూకుడుగా వెళ్లకుండా.. తొలి ప్రయత్నంగా హోం కిచెన్ మొదలు పెట్టాను. మంచి స్పందన లభించింది. ఒకసారి వచ్చిన కస్టమర్లు.. మళ్లీ మళ్లీ రావడం మొదలుపెట్టారు. మరొకరైతే అక్కడే ఆగిపోయే వారు. నేను మాత్రం ధైర్యంగా ఇంకో అడుగు వేశాను. ఇంకొంత అనుభవం కోసం ప్రముఖ స్టార్ హోటల్లో ఇంటర్న్‌షిప్ చేశాను.
అసలే హైదరాబాద్ రుచుల రాజధాని. బేకరీ పెట్టాం, బ్రెడ్లూ బన్నులూ అమ్ముకున్నాం అనుకుంటే.. కిక్కేం ఉంటుంది. జనానికి ఎందుకు నచ్చుతుంది. అందుకే సరికొత్త బేకరీ ఉత్పత్తులను అందించాలని భావించాను. హోం కిచెన్ నుంచి బేకరీ కిచెన్ ఏర్పాటు దిశగా అడుగులు వేశాను. ఊహించని ఆదరణ వచ్చింది. దీంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ పక్కనే ఉన్న పెద్ద కమర్షియల్ ఏరియాలోకి మారిపోయాను. నా ‘స్వీటూత్’ను ఇంకొంత విస్తరించాను.
తెలంగాణ ప్రభుత్వ ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగం వీహబ్ నా కలలకు కొత్త రూపాన్నిఇచ్చింది. హైదరాబాద్‌లో ఇలాంటి ప్రోగ్రాం ఒకటి ఉందని కూడా తెలియదు. ఎవరి ద్వారానో తెలుసుకున్నాను. నా ఆలోచనలు, వ్యాపార ప్రణాళికతో వీహబ్‌కు పంపిన మెయిల్ నా జీవితాన్నే మార్చింది. రెండ్రోజుల్లోనే స్పందన వచ్చింది. ఆఫీసుకు ఆహ్వానించారు. ఉత్సాహంగా వెళ్లాను. వెన్నుతట్టి ప్రోత్సహించారు. తనఖా లేకుండానే ఆర్థిక సాయం అందింది. కాబట్టే, స్వీటూత్కు అనుకున్న రూపాన్ని ఇవ్వగలిగాను.
అంతలోనే కరోనా ప్రవేశించింది. అన్ని విధాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు 250 ఉత్పత్తులను నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు సరఫరా చేసే స్థాయి నుంచి కిచెన్ మూసేయాల్సిన దుస్థితికి చేరుకున్నాను. అద్దెలు, జీతాలు భారమై పోయాయి. లాక్ డౌన్ దెబ్బకు బేకరీలు, కేఫ్లూ, రెస్టారెంట్లు, మాల్స్ మూతపడ్డాయి. వ్యాపారం కుప్పకూలింది. రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. అప్పటికే తయారైన ఉత్పత్తులు డెలివరీకి సిద్ధంగా ఉన్నా బయటికి పంపే పరిస్థితి లేదు. అప్పుడు కూడా వీహబ్ నేనున్నా అంటూ అండగా నిలిచింది. ఇ-ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం చేసింది. దీంతో ఆన్లైన్ వేదికగా వ్యాపారాన్ని తీర్చిదిద్దాను. ప్రతి సవాలునూ ఓ అవకాశంగా మార్చుకోగలిగితే.. ఏ వ్యాపారంలో అయినా తిరుగు ఉండదు. అన్నిటికీ మించి.. మనమీద మనకు నమ్మకం ఉండాలి. మన ఐడియాను మనం ప్రేమించ గలగాలి.
– కడార్ల కిరణ్