సూర్యకిరణాలు శరీరాన్ని స్పర్శించడం వల్ల దేహం విటమిన్-డిని తయారు చేసుకుంటుంది. విటమిన్- డి కోసం శరీరాన్ని ఎండకు ఉంచేందుకు శీతాకాలం అనువైనది. ఈ కాలంలో ఎండ వేడి తక్కువగా ఉంటుంది. చల్లదనం వల్ల శరీరం బిగుసుకుపోయి, చర్మం పగుళ్లతో ఉంటుంది. ఉదయాన్నే ఎండకు ఉండటం వల్ల కండరాల కదలిక తేలిక అవుతుంది. శరీరానికి కావాల్సినంత విటమిన్-డి తయారు కావాలంటే రోజులో కనీసం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. చర్మం ఎర్రగా ఉండేవాళ్లు ఎండకు తక్కువ సమయం ఉండాలి. నల్లని చర్మం ఉండేవాళ్లు ఎక్కువ సమయం ఎండలో గడపాలి. విటమిన్-డి వల్ల ఎముకలు క్యాల్షియాన్ని ఎక్కువగా శోషించుకోగలుగుతాయి. కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయి. ఆస్టియోపొరోసిస్ సమస్య రాదు. ఎండలో ఉన్నప్పుడు మానసికోల్లాసం కలుగుతుంది. అలాగే రుతువులు మారినప్పుడు కలిగే మానసిక సమస్యలు తొందరగా తొలగిపోతాయి. గుండె పనితీరుని విటమిన్-డి మెరుగుపరుస్తుంది. హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. సో, చలికాలంలో బారెడు పొద్దెక్కే వరకూ పడుకోకుండా.. ఉదయం ఎండలో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయడం చాలా అవసరం అని గుర్తించండి.