పదుల ఎకరాలు ఉన్న సంపన్న రైతు కుటుంబం. ఇంటి నిండా వచ్చేపోయే జనం. సందడి వాతావరణం. కాలం చేసిన గాయం.. ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ఒడుదొడుకుల్లో ప్రస్థానం మొదలుపెట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్ ఇప్పుడు ఓ శక్తిగా ఎదిగారు. డాక్టర్ కావాలనుకున్న వ్యక్తి.. పరిస్థితులు తారుమారు కావడంతో బస్సు కండక్టర్ కొలువులో చేరారు. తర్వాత ఎల్ఐసీ అధికారిగా మారారు. ఆపై వ్యాపారిగా ఎదిగారు. తన ప్రతిభకు పట్టుదల జోడించి.. రియల్ రంగంలో ఎదిగారు. సుమధుర గ్రూప్ స్థాపించి.. దక్షిణాదిలోనే అత్యుత్తమ నిర్మాణ సంస్థగా దానిని నిలబెట్టారు. కోరుకున్న లక్ష్యాన్ని అందుకున్న తర్వాత.. సొంత ఊరు అభివృద్ధికి మధుసూదన్ పాటుపడుతున్న వైనం ఎందరికో ఆదర్శం.
Gunda Madhusudhan | నాలుగు పైసలు సంపాదిస్తే చాలు కన్నవారిని మర్చిపోతుంటారు చాలామంది. ఇక సొంత ఊరి చిరునామా గుర్తుంటుంది అంటే ఆశ్చర్యమే! ఇలాంటి రోజుల్లో కన్నవారి ఆశలను నెరవేర్చిన మధుసూదన్ సొంతూరు రుణం తీర్చుకుంటున్నారు. స్వగ్రామం బాగుకు సుమధుర ఫౌండేషన్ స్థాపించి కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జీవితంలో పైకి ఎదగాలన్న పట్టుదలే ఆయనను కండక్టర్ నుంచి కన్స్ట్రక్షన్ సామ్రాజ్యానికి అధినేతగా మార్చింది. చదువుకునే రోజుల్లో ట్యూషన్లు చెప్పేవారు. డాక్టర్ కావాలని కలలు కన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించిన తండ్రి మరణంతో.. ఆ కల నెరవేరలేదు. కుటుంబం బాగోగులు చూసుకుంటూనే డిగ్రీ చేశారు. అవే బాధ్యతలు అతణ్ని బస్సు కండక్టర్ ఉద్యోగంలో చేరేలా చేశాయి. ‘ఇంకేం రైట్ రైట్..’ అనుకుంటే ఆయన టికెట్లు ఇవ్వడం దగ్గరే ఆగిపోయేవారు. ఉన్నతంగా ఎదగాలన్న పట్టుదలతో ఎల్ఐసీలో ఉద్యోగం సంపాదించారు. పదోన్నతిపై సికింద్రాబాద్ డివిజన్ ఆఫీస్‌కు వచ్చారు. అలా మారుమూల ప్రాంతం నుంచి మహానగరం చేరుకున్న ఆయన ఆకాశమే హద్దుగా తన ఆలోచనలకు పదునుపెట్టారు.
ఎల్ఐసీ ఉద్యోగం చేస్తూనే సోదరునితో కలిసి మధుసూదన్ కొన్నాళ్లు కిరాణం షాపును నిర్వహించారు. అక్కాచెల్లెళ్ల పెండ్లిళ్లు చేశారు. ఆ సమయంలోనే తమకు ఉన్న 38 ఎకరాల వ్యవసాయ భూమిని, ఎకరా రూ.4వేల చొప్పున మొత్తం రూ.1.20 లక్షలకు విక్రయించాల్సి వచ్చింది. అప్పుడే మధుసూదన్ రియల్ రంగంలోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఓ స్థానం సాధించుకున్నారు. ఎంతో భద్రత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆయన ఆలోచనకు ప్రతి రూపంగా నేడు సుమధుర సంస్థ నిలిచింది.
తనను ఆర్థికంగా ఉన్నతంగా నిలిపిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనుకున్నారు మధుసూదన్. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తాను పుట్టిపెరిగిన, తన తల్లితండ్రులు రాజమణి, సత్తయ్యను అక్కున చేర్చుకున్న సొంతూరు ఇస్కిళ్ల అభివృద్ధిపై దృష్టిసారించారు. సుమధుర ఫౌండేషన్ ద్వారా గ్రామానికి మెరుగులు దిద్దుతున్నారు. సుమారు రూ.2కోట్లు వెచ్చించి ఊళ్లో నూతన పాఠశాల భవనం కట్టించారు. 11వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, సకల సౌకర్యాలతో, ఆధునిక హంగులతో కార్పొరేట్ స్కూల్‌ను తలదన్నేలా బడిని నిర్మింపజేశారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ కేంద్రాన్ని కట్టించారు. బడిలో ముగ్గురు వలంటీర్లను, ముగ్గురు హౌస్కీపర్స్ను ఏర్పాటుచేసి ఫౌండేషన్ ద్వారా వారికి జీతభత్యాలు అందిస్తున్నారు.
ఇస్కిళ్లతోపాటు చుట్టుపక్కల పల్లెల్లోని మహిళల సాధికారత కోసం సుమధుర ఫౌండేషన్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నది. ఇక్కడి మహిళలకు కంప్యూటర్, కుట్టుమిషిన్, మగ్గం వర్క్‌లో శిక్షణ ఇస్తున్నది. 40 మంది సభ్యులు రెండు బ్యాచ్‌లుగా ఆరు కోర్సుల్లో ట్రైనింగ్ పొందారు. వారికి వివిధ సంస్థల నుంచి ఆర్డర్లు ఇప్పించి.. ఉపాధి కూడా కల్పిస్తున్నారు మధుసూదన్. అంతేకాదు ఫౌండేషన్ ద్వారా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఫ్లోరైడ్ బాధ ఉండకూడదని వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. నేరాల నియంత్రణకు గ్రామంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు పెట్టించారు. గ్రామంలో సభలు, సమావేశాలు జరుపుకొనేందుకు మీటింగ్ హాల్‌ను కట్టించారు. హైస్కూల్ చదువు కోసం ఇతర గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించడంలో సుమధుర ఫౌండేషన్ కీలకంగా పనిచేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నది. ఇలా.. సొంతూరు బాగుకోసం అహరహం కృషి చేస్తున్న సుమధుర గ్రూప్ చైర్మన్ గుండా మధుసూదన్ అచ్చంగా రియల్ శ్రీమంతుడే!