పెద్దయ్యక నాన్నతో మాట్లాడింది చాలా తక్కువ. అమ్మతోనే ఎక్కువ ఉండేదాన్ని. సినిమా చూసిన తరువాత ఆయన ఆనందం కండ్లలో కనిపించింది. ఆయనంటే ఇష్టం కాబట్టే నా పేరు చివరన జలంధర్ అని నాన్న పేరు పెట్టుకున్నా. ‘నీ బిడ్డ మంచిగ చేసింది జలంధర్’ అంటూ చాలామంది ఫోన్లు చేస్తున్నరట. రొటీన్ ఉద్యోగం వద్దనుకునే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. బయట ప్రపంచం కంటే నాకు కెమెరా ప్రపంచం అంటేనే ఇష్టం. కెమెరా ముందే నేను ఎక్కువ ఆనందంగా ఉంటాను.
టీవీకి అతుక్కుపోతుందని ఆ బిడ్డను హాస్టళ్లో చేర్చారు తల్లిదండ్రులు. ఆమె మాత్రం తనను తాను ఒక్కసారైనా ఆ టీవీలో చూసుకోవాలని కలలు కన్నది. వెండితెర మీద వెలిగిపోవాలని నిశ్చయించుకుంది. ఇంట్లోవాళ్లు మాత్రం ఉద్యోగం చూసుకో అని సలహా ఇచ్చారు. కానీ, ఆమె మాత్రం కెమెరా ముందు ఉంటేనే తనకు సంతోషమని భావించింది. సినిమాల్లో అవకాశాల కోసం ఏడేండ్లు నిరీక్షించింది. అవకాశాలు అలా వచ్చి ఇలా చేజారినా పట్టు వదలకుండా ప్రయత్నించింది. ఇటీవల విడుదలైన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాలో శారదగా నటించి, మెప్పించిన నల్ల వేద జలంధర్ తొలి గెలుపు ఇది. తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని చెబుతున్న వేద ‘జిందగీ’తో పంచకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
నటనలో రాణించాలనే ఆసక్తితో చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా వదులుకున్నాను. భవిష్యత్తులో అవకాశం రాకపోతుందా అని భావించి ఓ ప్రొడక్షన్ కంపెనీలో మేనెజ్మెంట్ విభాగంలో ఏడాది కాలం పాటు పనిచేశాను. కానీ అందులో ఎలాంటి అవకాశాలు రావని తెలిసి ఆ ఉద్యోగం మానేశాను. నాలాగే సినిమా పిచ్చోళ్లు కొంతమంది గ్రూప్‌గా ఉన్నారని తెలిసి వాళ్లను కలిశాను. వాళ్ల దగ్గర మంచి కథ ఉండటంతో అందులో నటించేందుకు నాకు అవకాశం ఇచ్చారు. అంతా కొత్తవాళ్లమే. తక్కువ బడ్జెట్ సినిమా. ఆ సినిమాకోసం వర్క్‌షాప్‌నకు వెళ్తున్న సమయంలోనే ఆ క్యారెక్టర్ నేను సెట్ కానని భావించి ఓ పెద్ద యాక్టర్‌ను తీసుకున్నారు. నేను బయటకొచ్చాక బడ్జెట్ కారణంతో ఆ సినిమా తీయలేకపోయారు. మళ్లీ కొన్నిరోజులకు మరో కథతో అదే డైరెక్టర్ మళ్లీ సంప్రదించారు. సరే అని ఒప్పుకొన్నాను. ఆ కథలో ముప్పై ఏండ్ల మహిళగా నటించాలని, ఆ పాత్రకు నేను సరితూగనని అందరూ భావించినా డైరెక్టర్ మాత్రం నా మీద నమ్మకంతో ప్రోత్సహించారు. అలా 2022లో ‘బృందా ప్రయాణం’ సినిమాతో కెమెరా ముందుకొచ్చాను. మొదట్లో వద్దని చెప్పినవారే.. అద్భుతంగా నటించావని చివర్లో మెచ్చుకున్నారు. కానీ ఆ సినిమా వివిధ కారణాలతో విడుదల కాలేదు. దాని తరువాత 2023లో ‘నీ పయనం ఎక్కడికో’ సినిమాలో నటించాను. అది కూడా విడుదల కాలేదు.
నటించిన సినిమాలు విడుదల కాకపోవడంతో ఎంతో నిరాశ చెందాను. నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకునేందుకు, నటనలో మెలకువలు నేర్చుకునేందుకు థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను. అందుకోసం చాలామందిని సంప్రదించాను. ఆత్మీయుల సూచనల మేరకు బషీర్ మాస్టర్ ‘బీ స్టూడియో’లో చేరాను. ఇతర స్టూడియోల్లో నటించడం చెబుతారు, కానీ బషీర్ మాస్టర్ మాత్రం నటించి చూపిస్తారు. రెండున్నర నెలల శిక్షణ పూర్తయిన తరువాత రంగస్థల నటిగా షేక్స్పియర్, పరాయి లాంటి నాటికల్లో వివిధ పాత్రలు ప్రదర్శించాను. ఒకరోజు రవీంద్రభారతిలో ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అసోసియేట్ డైరెక్టర్ వంశీ నా నటన చూశారు. మర్నాడు డైరెక్టర్‌ను వెంటబెట్టుకొని వచ్చి వాళ్లు తీసే సినిమాలో ఓ క్యారెక్టర్ ఖాళీగా ఉందని అందులో అవకాశమిస్తామని ఆడిషన్‌కు రమ్మని చెప్పారు. అదే సమయంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. అంతకుముందు ఓ సినిమా చేసేందుకు రెమ్యునరేషన్ కూడా మాట్లాడుకున్నాం. చివర్లో నాకు సోషల్‌మీడియాలో ఫాలోయింగ్ లేదని చెప్పి నా స్థానంలో వేరొకరిని తీసుకున్నారు. ఆ విషయం తిమ్మరాజుపల్లి టీవీ ఆడిషన్‌కు వెళ్లే సమయంలోనే ఫోన్ చేసి చెప్పారు. చాలా బాధలో ఉండి నేను ఆడిషన్‌కు రావడంలేదని నేరుగా డైరెక్టర్‌తోనే ఫోన్లో చెప్పేశాను. ఆయనకు కోపమొచ్చి నా నెంబర్ బ్లాక్ చేసేశారు.
ఆ తరువాత వంశీ మళ్లీ ఫోన్ చేసి ఆడిషన్‌కు రమ్మని చెప్పాడు. సరే అని వెళ్లాను. అప్పటికే ఆ పాత్రకోసం చాలామందిని రిజెక్ట్ చేశారట. నాకంటే ముందు వచ్చినవాళ్లలో డైలాగ్ చెబుతున్నారు కానీ, యాసలో చెప్పలేకపోయారు. మరికొందరు యాసలో మాట్లాడినా డైలాగ్ మరిచిపోతున్నారు. నేను చిత్తూరు యాసలో డైలాగ్ చెప్పాను. ఆ పాత్ర గురించి చెప్పి మర్నాడు గెటప్‌లో వచ్చి ఇదే డైలాగ్ చెప్పమని అడిగారు. సరే అని నా పాత లంగావోణి వేసుకొని వెళ్లి యాసలో డైలాగులు చెప్పడంతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాలో శారద పాత్రకు ఖరారు చేశారు. వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని ఆశపడ్డాను. కానీ, షూటింగ్ ఏరియాలో వాతావరణం అనుకులంగా లేనికారణంగా పోస్ట్‌పోన్ చేశారు. చివరికి 2025 జనవరి చివర్లో నాతోనే కొబ్బరికాయ కొట్టించి సినిమా షూటింగ్ ప్రారంభించారు. మార్చికల్లా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని తిరిగి హైదరాబాద్‌కి వచ్చేశాం.
షూటింగ్ మొత్తం కుప్పంలోనే నిర్వహించడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. దానికి తోడు నేను ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లడం అదే తొలిసారి. అందులో నాకిష్టమైన లంగావోణి వేసుకొని నటించడం ఆ సంతోషం మాటల్లో చెప్పలేను. రంగస్థల కళాకారిణిగా రాణించడం వల్ల ఒకటి రెండు టేకుల్లోనే డైలాగ్‌లు చెప్పేదాన్ని. ఈ సినిమాలో అందరూ కొత్తవారే. ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారనే ఆలోచన లేకుండా మేము గొప్పగా నటించాలనే ఆలోచనతో అందరం పనిచేశాం. ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం మీద నమ్మకం ఉండేది. గతంలో నేను చేసిన సినిమాల్లా కాకుండా ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుందనే విశ్వాసంతో పనిచేశాను. మా సినిమాను చాలామంది తమ కథగా చెప్పుకొంటుంటే సంతోషం కలుగుతున్నది. థియేటర్లకు వెళ్లినప్పుడు ‘నువ్వేసుకున్న లంగావోణి నా దగ్గర కూడా ఉంది. అప్పట్లో నేను కూడా నీలాగే ఉండేదాన్ని’ అంటూ వాళ్ల ప్రేమతో ముంచెత్తుతున్నారు.

మాది జగిత్యాల పక్కన మోతె గ్రామం. మా అమ్మానాన్నలకు ఒక్క బిడ్డనే కావడంతో గారాబంగా పెంచారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. అమ్మ ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తుండగా నాన్న వ్యవసాయంతో పాటు చిన్నపాటి బిల్డర్. చిన్నప్పటినుంచి చదువులో ముందుండే నాకు సినిమాలు అంటే పిచ్చి. ఇంట్లో టీవీకి అతుక్కుపోతున్నానని, నా చదువు పాడైతున్నదని తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే హాస్టళ్లో వేశారు. అమ్మకు జానపదాలంటే ఎంతో ఇష్టం. అవి నాకు నేర్పించడంతో నేను స్కూళ్లో పాడి బహుమతులు గెలుచుకునేదాన్ని. మొదట్లో ఎయిర్‌ఫోర్స్ కోర్స్ చేద్దామని అనుకున్నా! కానీ, ఆడపిల్లలకు అలాంటివి ఎందుకుని ఒద్దన్నారు. తరువాత విదేశాల్లో ఎంఎస్ చేస్తానని ఇంట్లో ఒప్పించి మరీ బీటెక్ చేస్తున్న సమయంలోనే కోచింగ్ తీసుకున్నాను. తీరా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయానికి నా పాన్‌కార్డ్ దాచిపెట్టారు. విదేశాల్లో ఇబ్బంది పడతానని నా ఆశలపై నీళ్లు చల్లారు. అప్పటికే నేను సంగీతం నేర్చుకున్నాను. ఎప్పటికైనా ఓ పెద్ద సింగర్ కావాలని, స్క్రీన్ మీద కనిపించాలని కలలు కనేదాన్ని. నా టాలెంట్‌ను యూట్యూబ్‌లో పెడదామంటే అది కూడా వద్దని గట్టిగా చెప్పారు. సుమారు ఏడేండ్లుగా నిరాశతో ఉన్న నాకు ఈ సినిమాతో ఉపశమనం లభించింది. డెక్కన్ హైదరాబాద్ కల్చర్‌ను చూపిస్తూ, నలుగురు స్నేహితుల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా మరో సినిమాలో నటించాను. ఆ సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. సీనియర్ నటి రమ్యకృష్ణగారి లాగా అన్ని పాత్రల్లో ఒదిగిపోయి, సాయి పల్లవిలాగా సహజ నటనతో భవిష్యత్తులో రాణించాలన్నదే కోరిక.
– రాజు పిల్లనగోయిన