ఆలోచనే ఆమె ఆయుధం. ఏ విభాగంలో పనిచేసినా.. దానికి ప్రత్యేక గుర్తింపు ఎలా తీసుకురావాలో ఆమెకు తెలుసు! తన పర్యవేక్షణలో వేలాది మంది పోలీసులను తీర్చిదిద్దిన అభిలాష బిస్త్ జమానా పోలీసు అకాడమీలో చెరగని అధ్యాయం. ఇక్కడ కఠోర శిక్షణ తీసుకుంటూనే.. తమ బిడ్డలకు పాలిచ్చే బాలింతలు ఉన్నారంటే అందుకు కారణం ఆవిడే. తెలంగాణ పోలీసు అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా పేరు
గడించిన ఆమె తన సొంతకేడర్ అయిన ఏపీకి వెళ్లారు. పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా చివరి సంతకాలు చేసిన తర్వాత ‘జిందగీ’తో తెలంగాణలో పోగేసుకున్న తన అనుభవాలు పంచుకున్నారు.
‘ఆ హత్యాచారం కేసు సంగతేంటి? నివేదికలు వచ్చేది ఉందా? చార్జిషీట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు?’ అని న్యాయమూర్తి అడిగితే.. ‘ఫోరెన్సిక్ విభాగం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి మై లార్డ్’ అని సింపుల్‌గా చెప్పేవారు కొందరు పోలీసులు. ఇలా ఎన్నో కేసుల ఫైళ్లు ఫోరెన్సిక్ విభాగంలో పేరుకుపోయేవి. దీంతో బాధితులకు న్యాయం సత్వరం అందేది కాదు. అలాంటి సమయంలో తెలంగాణ ఫోరెన్సిక్ విభాగానికి హెడ్‌గా ఒక సమర్థులైన ఆఫీసర్ అవసరమని గుర్తించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. డీజీపీతో మాట్లాడి అప్పటికే తన సమర్థతను నిరూపించుకున్న అభిలాష బిస్త్‌ను ఫోరెన్సిక్ విభాగానికి డీజీగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన రోజు ఆమె చెప్పిన విధంగా నెల రోజుల్లోనే వ్యవస్థను చక్కదిద్దారు. నిర్దేశించిన గడువులోగా నివేదికలు సిద్ధం చేసేలా తన టీమ్‌తో పని చేయించారు. బెటాలియన్స్ డీజీగా, తెలంగాణ పోలీసు అకాడమీ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా ఆమె ఆలోచనలు, చేసిన పనులు అభిలాషకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
అభిలాషది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్. చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనుకున్నారు. ఐపీఎస్ సాధించి తన కల నిజం చేసుకున్నారు. శిక్షణ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నారాయణపేట, బోధన్ పట్టణాల్లో ఏఎస్పీగా చేశారు. అనంతపురం, కడప తదితర జిల్లాల్లో అదనపు ఎస్పీగా, ఎస్పీగా సేవలు అందించారు. కొన్నాళ్లు భారత శాంతి పరిరక్షక దళంలో భాగంగా కొసోవోలోని శాంతి పరిరక్షక మిషన్ యూఎన్ఎంఐకేలో పనిచేశారు.
ఆమె సేవలకు గానూ 2004లో ‘యూఎన్పీఎం’ మెడల్ పొందారు. తర్వాత డిప్యుటేషన్‌పై ఉత్తరాఖండ్ వెళ్లి లా అండ్ ఆర్డర్ డీఐజీగా పనిచేశారు. మళ్లీ 2010 నుంచి 2015 వరకు లైబీరియా, సూడాన్ దేశాల్లో భద్రతా సలహాదారుగా యూనిసెఫ్‌లో పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఆనర్స్ డిగ్రీ పొందారు. అంతర్జాతీయ అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీ, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ రాజకీయాలు, సంస్థ, నిరాయుధీకరణ అధ్యయనాలలో ఎం.ఫిల్ పూర్తిచేశారు. తర్వాతి కాలంలో అడిషనల్ డీజీగా తెలంగాణలో టీజీఎస్పీ బెటాలియన్స్కు, ఫోరెన్సిక్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. పోలీసు సంక్షేమం, క్రీడల విభాగం ఏడీజీగానూ సేవలు అందించారు. 2023 డిసెంబర్ 22 నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా డీజీ హోదాలో ఉన్నారు.
బెటాలియన్స్ ఏడీజీగా ఉన్నప్పుడు అభిలాష బిస్త్ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఫోరెన్సిక్ విభాగానికి ప్రత్యేక భవనం తీసుకురావడంలో చొరవ చూపారు. తన నాయకత్వంలో నాలుగు కొత్త బెటాలియన్స్‌ను తెప్పించి ఔరా అనిపించుకున్నారు. ఇక పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ కూడా తన మార్క్ చూపించారు. ఎస్ఐలకు శిక్షణ ఎలా ఉండాలి? ఏ అంశాలపై అవగాహన కల్పించాలి? తదితర అంశాలలో పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ అయిన 13,000 కానిస్టేబుళ్లకు తన ఆధ్వర్యంలో విజయవంతంగా ఒకేసారి శిక్షణ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. చివరి దశలో వచ్చిన మరో 200 మందికి కూడా ఇబ్బంది లేకుండా శిక్షణ ఇప్పించారు. కొత్త క్రిమినల్ చట్టాలపై రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ నుంచి ఐజీ స్థాయి అధికారుల వరకూ పోలీసు అకాడమీలో శిక్షణ ఇప్పించారు. సుమారు 70వేల మంది పోలీసులు విడతల వారీగా, విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త చట్టాల నిర్వహణపై శిక్షణ తీసుకున్నారంటే అది ముమ్మాటికీ అభిలాష బిస్త్ ఘనతే. పోలీసులతోపాటుగా, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఎన్జీఓలకు సైతం పోలీసు అకాడమీలో కొత్త క్రిమినల్ చట్టాలపై శిక్షణ ఇప్పించారు. అందరికీ కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండేలా.. వివిధ భాషల్లో మూడు కొత్త చట్టాలు, మారిన సెక్షన్లపై ప్రత్యేకంగా పుస్తకాలు ప్రచురించారు.
సాంకేతికంగా లోతైన అవగాహన ఉంటేగానీ, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయలేం. శిక్షణ దశలోనే పోలీసులను డిజిటల్ డేర్ డెవిల్స్‌గా మార్చడానికి అభిలాష ఎంతో కృషిచేశారు. ప్రభుత్వ సహకారం, సైబర్ సెక్యూరిటీ ప్రోత్సాహంతో సైబర్ల్యాబ్లు, సైబర్ షీల్డ్ ల్యాబ్‌లు శిక్షణా కేంద్రాల్లో ప్రవేశపెట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పోలీస్ అకాడమీ, మేడ్చల్, వరంగల్, కరీంనగర్ శిక్షణ కేంద్రాల్లో ఆధునిక సైబర్ ల్యాబ్‌లు నెలకొల్పారు. అంతేకాదు పోలీసు ట్రైనింగ్‌కు వచ్చిన తల్లులు, బాలింతల కోసం అకాడమీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేలా వసతి కల్పించి తల్లి మనసు చాటుకున్నారు. శిక్షణ తీసుకుంటూనే తమ పిల్లలతో గడిపేలా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు. ట్రైనింగ్‌లో జుంబా డ్యాన్స్, యోగా, ఏరోబిక్స్, ఆత్మ రక్షణకు శిక్షణ లాంటి సెషన్స్ ప్రవేశపెట్టి సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకున్నారు. ఏ విభాగంలో పనిచేసినా ‘అభిలాష ద బెస్ట్’ అనిపించుకున్నారు. తర్వాతి అధికారులకు ఒక బెంచ్ మార్క్‌ను సెట్ చేశారు.
– రవికుమార్ తోటపల్లి