టీనేజీ ఓ రంగుల ప్రపంచం. అందులోని ఆకర్షణలు వేరు. దుస్తులు, ఫ్యాషన్లు, అవుటింగ్‌లు, చాటింగ్‌లు, సిరీస్‌లు, రీల్సు… ఇవన్నీ వాళ్లవైన ఆస్తులు, ఆసక్తులు. కానీ అదే టీనేజీలో ఉన్న ‘సంస్కృతి కొండూరు’ తన ప్రపంచంలో ఉంటూనే, తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగు గురించి ఆలోచిస్తున్నది. అలాంటి
దృక్పథమే ఆమెను టీసీఎస్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిపింది. అంతేకాదు, టీనేజీ పిల్లలు డ్రగ్స్‌కు బానిసవ్వకుండా, డిజిటల్ ప్రపంచంలో భద్రంగా ఉండేలా సర్టిఫికెట్ కోర్సులనూ రూపొందించింది. కౌమారుల్లో ఆర్థిక అక్షరాస్యతనూ పాదుకొల్పేలా మరో కోర్సునూ రూపొందించ నున్నట్టు చెబుతున్న పద్నాలుగేండ్ల సంస్కృతి తన గురించి పంచుకున్న ఆసక్తికరమైన ముచ్చట్లు..
నేను విను విలువల్ని ఎక్కువ ప్రేమిస్తాను. అంటే ఒక చెట్టుకు వేర్లు ఎలాగో, మనిషికి విలువలు అలా. మనం వాటి ఆధారంగానే నిలబడగలుగుతాం. అవెంత బలంగా ఉంటాయో మనం అంత గట్టిగా నిలబడగలం అని నమ్ముతాను. నేను మొన్న విజేతగా నిలిచిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) అయాన్ ఇంటెలిజెమ్ పోటీల్లో వీటికి సంబంధించే ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో సార్వజనీన విలువలు (యూనివర్సల్ వ్యాల్యూస్) అనే ప్రత్యేక అంశం ఉంది. అలాగే విశ్వ పౌరసత్వం (గ్లోబల్ సిటిజన్‌షిప్), కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకత-ఆవిష్కరణలు లాంటి అయిదు అంశాలు ఉంటాయి. నిజానికి అన్నీ గొప్పవే. అయితే ఆరో తరగతిలో మొదటిసారి ఈ పోటీల్లో పాల్గొన్నప్పుడు ఈ సార్వజనీన విలువలు అనే అంశం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఎవరి విలువలు వారికి ఉంటాయి. ఏ దేశమైనా ప్రాంతమైనా కానీ అందరికీ కలిపి ఉండేవే సార్వజనీన విలువలు. తొలిసారి ఇందులోనే నాకు విజేతగా బహుమతి వచ్చింది. ఇక, మనం ఎంత బాగా మన భావాలు వ్యక్తీకరించగలిగితే అంత బాగా ఎదుటి వాళ్లకు మనం అర్థం అవ్వగలం, అలాగే ఎదుటివాళ్లను అర్థం చేసుకోగలం. అదే కమ్యూనికేషన్ స్కిల్. ఈసారి నేను అందులోనే గెలిచాను. దేశంలోని పెద్ద స్కూళ్ల నుంచి రెండువేల మందిదాకా ఈ పోటీలకు వచ్చారు. ఇందులో నా బలం ఏంటి అంటే, సహానుభూతి(ఎంపథీ) అని చెబుతాను. అదే అన్ని విలువలకు అమ్మలాంటిది అనిపిస్తుంది నాకు.
ఏదైనా పోటీలో విజేతగా నిలవడం అన్నది ఎవరికైనా ఆనందాన్ని కలిగించే విషయమే. ఇంతకుముందు కూడా రకరకాల పోటీల్లో బహుమతులు వచ్చాయి. కానీ, నాకు బాగా ఇష్టంగా అనిపించింది మాత్రం ఈ టీసీఎస్ అయాన్ ఇంటెలిజెమ్యే. ఎందుకంటే అది నా ఆలోచనా విధానాన్ని విస్తృతం చేసింది. నా మనసుకు సరిపడే విషయాల్ని నలుగురితో పంచుకుని వాటి గురించి మరింత లోతైన అభిప్రాయాలు ఏర్పడేలా చేసింది. నిజానికి ఇవన్నీ నాకు అమ్మానాన్నల దగ్గరినుంచే వచ్చాయి. ‘ఇప్పుడు నీకు ఏముంది అని కాదు, వ్యక్తిగా నువ్వు ఎవరు అన్నదే ముఖ్యం’ అని చెబుతారు వాళ్లెప్పుడూ. మా అమ్మ పేరు సుమతి. తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదూ! నాన్న పేరు శ్రీనాథ్. ఆయన బిజినెస్మెన్. ప్రస్తుతం నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను.
మా టీనేజర్లకు ఎలాన్ మస్క్ కన్నా ఎక్కువ యాటిట్యూడ్ ఉంటుంది. అందుట్లోనూ ఇప్పుడు ప్రపంచమంతా అరచేయంత తెరమీద అందుబాటులోకి రావడంతో అన్నీ మాకు తెలుసు అన్న భావనలోనే ఉంటున్నారు. దానికి తోడు చుట్టూ ఉండే స్నేహితులు, అందుబాటులో ఆకర్షించే మద్యపానం, సిగరెట్లు, డ్రగ్స్… ఇలా అన్నీ వీళ్ల మీద విపరీతంగా ప్రభావం చూపుతుంటాయి. ఎక్కడిదాకో ఎందుకు, ఉదాహరణకు సినిమాలు చూడండి. ఓ పక్క అందులోని వ్యక్తి మందు తాగుతూ జోకులేస్తూ ఉంటాడు. దాన్ని చూసి అందరూ నవ్వుతుంటారు. మరోచోట కొందరు ఫ్రెండ్స్ కలిసి పంచ్‌లు వేసుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది సిగరెట్ కాలుస్తుంటే, మరి కొందరి చేతుల్లో గ్లాసులుంటాయి. కింద మాత్రం మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. అది ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లు… విషయం ఏదైనా ఫన్ను మద్యంతోనో, సిగరెట్తోనో లేదా డ్రగ్స్తోనో కలిపి చూపిస్తారు. అది ఫన్ కాదు సరికదా.. ప్రమాదం. కానీ టీనేజర్లు ఇవి చూస్తారు, ఫర్వాలేదు అనుకుంటారు. మొదట ఫన్, తర్వాత అడిక్షన్, మళ్లీ ఫన్.. ఇలా ఒక చక్రంలాగా ఉంటుంది. దాన్నుంచి వాళ్లు బయటపడలేక పోతున్నారు. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి నా తోటివాళ్లను బయటికి ఎలా తీసుకురాగలను అన్న ఆలోచన ఫలితమే ‘డ్రగ్ ఫ్రీ వెల్నెస్’ ప్రోగ్రామ్. అలాగే మనం రోజులో చాలా గంటలు ఆన్లైన్లో ఉంటున్నాం. అదో లోకం అయిపోయింది. మరి ఆ లోకంలో మనం ఎంత భద్రంగా ఉండాలి, ఎంత ఉంటున్నాం అన్నది తెలుసుకునేలా మోడల్ చేసిందే ‘డిజిటల్ సేఫ్టీ వెల్నెస్’ ప్రోగ్రాం. ఇందుకోసం టీనేజర్లకు సంబంధించి చాలా అధ్యయనం చేశా. వెబ్సైట్లు చదవడం, సర్వేలు చేయడం, మానసిక నిపుణులు, సామాజికవేత్తలు, ప్రొఫెసర్లు, టీచర్లతో మాట్లాడటం.. మొత్తంగా ఏడాదిపాటు దీనిమీద పనిచేశా. మా అక్క ప్రకృతి కూడా సైకాలజీ చదివింది. దాంతో ప్రాజెక్టుకు సాయపడింది. కొంతమంది సాంకేతిక నిపుణుల సాయంతో ‘క్రియేట్ ఎడ్యుకేట్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి దాని ద్వారా ఈ కోర్సులను అందిస్తున్నాం.
స్కూళ్లు ఇందులో రిజిస్టర్ చేసుకుంటే, దాని ద్వారా పిల్లలు లాగిన్ అయి ఈ కోర్సులను పూర్తి చేయొచ్చు. చాట్‌బాట్ తరహాలో ఇది పనిచేస్తుంది. ఒక టీనేజర్ మరో టీనేజర్‌తో మాట్లాడినట్టు ఉంటుంది. అంటే అందులో వాడే పదాలు, భాష అన్నీ మా వయసు వాళ్లు వాడేవే అన్నమాట. కాబట్టి ఎదుటి వాళ్లు సులభంగా కనెక్ట్ అవుతారు. కోర్సు పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటిదాకా రెండు రాష్ర్టాల్లోని ఎనిమిది స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించాం. ఇక, టీనేజర్లకు పొదుపు మదుపుల మీద అవగాహన కలిగించేలా ఆర్థిక అక్షరాస్యత మీద మరో కోర్సు తీసుకురాబోతున్నాను. జీవితంలో ఎంతమందికి వీలైతే అంత మందికి సాయం చేయి అని మా తాతయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నా ఆలోచనా అదే. నా పని ఎంతమంది మీద ప్రభావం చూపుతుంది అని. ఎందుకంటే నా ఫోన్లో ఎన్ని ఫొటోలు ఉన్నాయి అన్నదానికన్నా నా మెదడులో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అన్నదే నాకు ఆనందాన్ని ఇస్తుంది!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– ఎం.గోపీకృష్ణ