ఒకప్పుడు హైదరాబాద్‌లో పిండివంటలంటే స్వగృహ ఫుడ్స్ మాత్రమే అనుకునేవాళ్లు. మన సర్వపిండి ఎక్కడో గానీ దొరికేది కాదు. మన అప్పాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా! నగరమంతా తిరిగినా, మక్కవడ ముక్కకూడా కనిపించేది కాదు! అలాంటి చోట కరకరలాడే సకినాలతో విందు చేశారామె. మరుగున పడుతున్న మన పిండివంటలకు ప్రాణం పోస్తూ…నగరవాసులకు సిసలైన రుచి చూపించారు. తెలంగాణ పిండి వంటలకు ఇమేజ్ తీసుకొచ్చారు 83 ఏండ్ల వంగపల్లి సావిత్రమ్మ. రెండు కిలోల పిండితో మొదలుపెట్టిన అమృత హస్తం నేడు 500 కిలోల పిండితో తీరొక్క వంటకం చేస్తూ.. ‘శ్రీదేవి తెలంగాణ పిండివంటలు’ బ్రాండ్‌ను సుస్థిరం చేశారు. మన పిండి వంటలను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న సకినాల సావిత్రమ్మను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
సామాజిక మాధ్యమాల్లో నా అప్పాల హవా కొనసాగుతుంది. నేను చేసిన వంటకాలను ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో పోస్టు చేస్తే వాటిని చూసిన వాళ్లంతా ఎక్కడెక్కడినుంచో ఫోన్లు చేసి మరీ ఆర్డర్లు పెడుతున్నరు. ఇన్‌స్టాలో అరలక్ష మంది ఫాలో అవుతున్నరు. యూట్యూబ్, ఎఫ్బీలో గిన నాకు ఫ్యాన్స్ ఉన్నరు.
మాది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని బీర్పూర్. అప్పట్లో నాకు బడంటే తెల్వదు. నా తొమ్మిదో ఏటనే పెళ్లిచేసిండ్రు. మా ఆయన సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేసేది. 30 ఏండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చినం. నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్లు అప్పాలు చేస్తుంటే అట్లనే చూసేదాన్ని. అట్లా మెల్లమెల్లగా నేను కూడా నేర్చుకున్న. నాచారంలోని హెచ్ఎంటీలో కాపురం పెట్టినంకా నాకు పొద్దుపోయేదు కాదు. నాకొచ్చిందల్లా అప్పాలు చేసుడొక్కటే. కానీ, మా ఇండ్లల్లో ఆడోళ్లు బయటికి పోయి పనిచేయడం ఉండకపోయేది. అందుకే వాళ్ల మాటకు ఎదురు చెప్పలేక ఇంట్లుండే అప్పాలు చేయాలని నిర్ణయించుకున్నా.
నా ఆలోచన మా ఇంట్లో చెబితే వాళ్లు మద్దతిచ్చిర్రు. కానీ, ఇరుగుపొరుగు వాళ్లే ‘పట్నమొచ్చి అప్పాలు అమ్ముకుంటరా’ అని ఎగతాళి చేసిర్రు. ఏదైతే అది అయ్యిందని నాకు ఇష్టమైన పని చేయాలనుకున్న. మేము ఉంటున్న ఇంట్లనే ఒక పిల్లగాన్ని చెయ్యి కింద పెట్టుకొని రెండు కిలోల పిండితో అప్పాలు చేసుడు మొదలుపెట్టినా. మొదట్ల సకినాలు, పల్లి గారెలు, నువ్వులుండలు, గరిజెలు, గారె అప్పాలు చేసేదాన్ని. నేను పిండివంటలు చేస్తున్న సంగతి తెలుసుకున్న మా బావ కొడుకు ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి హైదరాబాద్‌లో మహానాడు మీటింగ్ పెడుతుండ్రట ఆడ అప్పాల స్టాల్ పెడితే మంచి గిరాకొస్తదని చెప్పిండు. స్టాల్ పెట్టాల్నని రకరకాల పిండి వంటలు రెడీ చేసుకున్నం. కానీ ఆ రోజు జోరు వాన పడటంతో మీటింగ్ క్యాన్సిల్ అయింది. మా అప్పాలన్ని మిగిలిపోయినయ్. చేసేదేమిలేక అక్కడికొచ్చినోళ్లకు, పక్కపొంటున్న దుకాణాలకు రూపాయికో అప్ప అమ్ముకున్నా. వ్యాపారం అన్నాక లాభనష్టాలు ఉంటాయని తెలిసే ఇందులోకి దిగిన కాబట్టే ఏం బుగులు పడలేదు.

పదేండ్లదాక ఇంట్లనే పిండివంటలన్నీ చేసిన నేను.. అప్పాల కోసం చిన్న ఫ్యాక్టరీని నిర్మించి అందులోకి సెటప్ అంత మార్చిన. మిగతా వాటితో పోల్చినప్పుడు మేము చేసే అప్పాలు బాగుంటయని రుచి చూసినోళ్లంతా అంటుంటరు. మా దగ్గర ఏ వంటకు ఆ కడాయి పెడుతం. కాల్చిన నూనెను తిరిగి మళ్లీ వాడం. పైస కన్నా మనిషి ఆరోగ్యం ముఖ్యం కదా! తిన్న రెండు అప్పాలైనా తృప్తిగా తినాలన్నది నా కాన్సెప్ట్.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ నిజాం గ్రౌండ్లో తెలంగాణ సంబురాలు నిర్వహించిర్రు. అప్పుడు మీటింగ్ కొచ్చిన వాళ్లకు తెలంగాణ పిండివంటల రుచి చూపియ్యాలని అనుకొని కేసీఆర్ నన్ను తెలంగాణ భవన్‌కు పిలిపించుకున్నరు. ఆయనతో మాట్లాడేటప్పుడు ‘మీరు పిండివంటలు చేస్తరని తెలిసిందమ్మా. ఏం ఏం వంటకాలు చేస్తరు. ఎట్ల చేస్తరు?’ అని మీటింగ్‌కు ఎంత మందొస్తరో కూడా చెప్పిర్రు. నేను వెంటనే ‘సరే చేస్తాను. కానీ, నా స్టాల్ ఒక్కటే అక్కడ పెట్టుకుంటా. మిగతావాళ్ల స్టాల్స్ పెడితే.. వాళ్ల వంటలు బాగలేకపోతే మా వంటలు కూడా బాగలేవని దూరం పెడతరు’ అని చెప్పిన. ఆయన నా మీద నమ్మకంతో సరే అన్నరు. ఇంటికాడి నుంచి 50 మందిని పిలిపించిన. ప్రజ్ఞాపూర్‌లో ఒక మక్క చేను గుత్త పట్టినా, మీటింగ్ కొచ్చినందరికి అంబలి, గట్క, అప్పాలు, గుడాలు వంటకాలు చేసి పెట్టిన. తెలంగాణ అప్పాలనుకుంటా మీటింగొచ్చినొళ్లంతా మురుసుకుంట తిన్నరు. అప్పటినుంచి నా అప్పాల రుచి చాలా దూరం పోయింది. కేసీఆర్ మీటింగ్‌కు ముందు కొంతమందికే తెలిసిన ‘శ్రీదేవి తెలంగాణ పిండివంటలు’ ఆ తర్వాత రాష్ట్రమంతా ఎరుకైంది.
సకినాల సావిత్రమ్మగా ఈ రోజు మీ ముందున్నానంటే ఈ గొప్పతనం నా ఒక్కదానిది మాత్రమే కాదు. నా కొడుకు, కోడలు, మనుమడు నా వెన్నంటే ఉన్నరు. ఒక్క పిలగాన్ని సాయంగా పెట్టుకొని ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేను ఇప్పుడు 100 మందికి ఉపాధినిస్తున్నాను. చదువు రాకున్నా సంకల్పబలంతో అనుకున్నది సాధించిన. నా అదృష్టం ఏందంటే ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరూ కష్టపడే స్వభావం ఉన్నోళ్లే. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలదాక పనిచేస్తనే ఉంటరు. పండుగలప్పుడైతే ఎక్కువ సేపు కష్టపడుతరు. ఇంట్లో ప్రారంభించిన పిండివంటలను నేడు ఫ్యాక్టరీ దాక తెచ్చిన. హఫీజ్‌పేట, హెచ్ఎంటీలలో దుకాణాలు కూడా పెట్టినం. వాటితో పాటు కస్టమర్లకు వ్యాన్లలో సరఫరా చేస్తున్నం.

మా చిన్నతనంలో స్నాక్స్ అంటే మురుకులు, సకినాలు, అప్పాలు. ఎన్ని తిన్నా కూడా ఏ రోగం లేకుండా బతికినం. కానీ, ఇప్పటి మనుషులకు ఎంతసేపు పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్ల మీదే సోకంతా. వాటిని తినడం రోగాలను తెచ్చుకోవడమే. ఇంటి వంటలకు దూరమై కల్తీ తిండికి అలవాటు పడుతున్నరు. ఇప్పటి పిల్లలకు నా సలహా ఒక్కటే మీ తిండి మీరే చేసుక తినుర్రి. నాణ్యమైన నూనెతో చేసిన చిరుతిండ్లను తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఒకప్పుడు పిండివంటలంటే కేరాఫ్ అడ్రస్ ఆంధ్రాగా పిలిచేవాళ్లు. కేసీఆర్ సభతో చాలా మందికి తెలంగాణ పిండివంటల రుచి తెలిసింది. ప్రస్తుతం 56 రకాల పిండివంటకాలు, పచ్చళ్లు, పొడులు తయారు చేస్తున్నం. విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నం. కేవలం నాతోనే ఈ వంటలు అంతరించిపోకుండా ఆ రుచి పదిమందికి పంచాలనుకొని నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలనే ప్రతి ఒక్కరికీ భోజనం పెట్టి మరీ నేర్పిస్తున్న. ఒకప్పుడు నా దగ్గరికొచ్చి నేర్చుకున్నవాళ్లంతా ఇప్పుడు పెద్ద పెద్ద దుకాణాలు పెట్టుకున్నరు. ఇండ్లు కట్టుకున్నరు. కార్లు కొనుక్కున్నరు. తెల్లారిలేస్తే నా పేరు తలుచుకుంటున్నరు. వాళ్లు మంచిగ బతుకుతున్నరంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి.
– రాజు పిల్లనగోయిన