మారాం చేసే చిన్నపిల్లలకు లడ్డూ ఇచ్చి ఊరడించడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ, మార్కెట్లో దొరికే లడ్డూలను ఎలాంటి పదార్థాలతో తయారు చేస్తున్నారనే అనుమానం హైదరాబాద్‌కు చెందిన బి.శాంతిని కిడ్ ఫుడ్ మేకర్ని చేసింది. చక్కెర, బెల్లం లేకుండా తీపి లడ్డూలు తయారుచేసి రుచితోపాటు ఆరోగ్యాన్నీ పంచుతున్నది. వంటింట్లో మొదలైన ఆమె ఫుడ్ జర్నీ.. అపార్ట్మెంట్ కాంపౌండ్ దాటి, కాలనీ వాసులను పలకరించి వీ హబ్ వేదికగా కొత్తపుంతలు తొక్కింది. ‘మామ్స్ హోం మేడ్ స్పైసెస్ అండ్ ఫుడ్స్’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి లడ్డూలు, మసాలాలు, కారం పొడులు విక్రయిస్తూ స్టార్టప్ స్టార్ అయింది. ఆ విశేషాలు ఇవి..
శాంతి వాళ్లు ఉండేది హైదరాబాద్‌లోని చందానగర్‌లో. ఆమె భర్త ఐటీ ఉద్యోగి. పని ఒత్తిడితో సతమతమయ్యే భర్తకు ఆర్థికంగా అండగా నిలవాలనుకుంది. స్వతహాగా ఎదగాలనే సంకల్పంతో ఫుడ్ మేకింగ్ రంగంలోకి అడుగుపెట్టింది శాంతి. తల్లి నుంచి అబ్బిన మసాలా తయారీ నైపుణ్యాలకు మరింత పదును పెట్టింది. దీనికి కొనసాగింపుగా పిల్లల కోసం హోమ్ మేడ్ పుడ్ తయారుచేయడం ప్రారంభించింది. ఇంట్లో ప్రయోగాలతో చేసిన పదార్థాలు పిల్లలు ఇష్టంగా ఆరగించడంతో.. విపణిలోకి దూసుకొచ్చింది.
హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలు నగరవాసులకు ఓ నమ్మకం. ముఖ్యంగా స్వీట్లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. చక్కెరతో తయారయ్యే మిఠాయిలు ఎక్కువగా తీసుకుంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికితోడు జంక్‌ఫుడ్ ఉండనే ఉంది! తాను తయారుచేసే ఆహార ఉత్పత్తులు రుచితోపాటు ఆరోగ్యాన్నీ అందివ్వాలని ఆశించింది శాంతి. పోషకాలు నిండిన పదార్థాలు ఎలా తయారుచేయాలో పరిశోధన చేసింది. యూట్యూబ్ పాఠాలు విన్నది. సామాజిక మాధ్యమాల్లో చూసి కొత్త పదార్థాలు చేయడం నేర్చుకుంది. తర్వాత ఇంట్లో ప్రయోగాత్మకంగా లడ్డూలు చేయడం మొదలుపెట్టింది. తను చేసిన వాటిని ముందుగా తన పిల్లలకు మాత్రమే తినిపించి, వారిలో మార్పులను గమనించింది. కాలక్రమంలో మరింత వైవిధ్యంగా పుష్టినిచ్చే లడ్డూలను తయారుచేసింది. చక్కెర, బెల్లం వాడకుండా… కేవలం ఖర్జూరంతో లడ్డూలు చుట్టడం ఆమె ప్రత్యేకత. మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటికన్నా శాంతి చేసిన లడ్డూల్లో మెరుగైన పోషక విలువలు ఉన్నాయని ఆహార నాణ్యత పరీక్షల్లో కూడా వెల్లడైంది. చక్కెర లేకుండా తయారుచేసిన లడ్డూలను పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల వారికి రుచిని అందిస్తూనే, ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అంటున్నది శాంతి. ఈ సూత్రమే తన వ్యాపారం చక్కగా సాగేందుకు దోహదం చేసిందని చెబుతున్నది.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీ హబ్ అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంది శాంతి. భర్త సహకారంతో వీ హబ్ తలుపు తట్టింది. ఓరియెంటేషన్ తరగతుల ద్వారా ఆమెకు హెల్దీఫుడ్ ప్రాధాన్యం, మార్కెట్లో ఉన్న డిమాండ్, ప్యాకింగ్, తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఏర్పడింది. ఇంట్లోనే నాణ్యతతో రుచి, పుష్టికరమైన లడ్డూలు, స్నాక్స్ సిద్ధం చేసింది. వాటిని ఆహార భద్రత నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చేయడం వరకు అన్ని చకచకా నేర్చుకున్నది. తన ఉత్పత్తులు నేరుగా కస్టమర్లకు అందించేలా బీ2సీ (బిజినెస్ టు కన్స్యూమర్) విధానంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. లడ్డూలతోపాటు రకరకాల కారం పొడులు, మసాలాలు కూడా తయారుచేస్తున్నది. ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటుచేసి తన ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
సొంతంగా ఏదైనా చేయాలనుకునే గృహిణులు… ప్రారంభ దశలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్లు ఎన్ని ఎదురైనా శాంతి నిలబడింది. ప్రస్తుతం తన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడటంతో… విస్తరణపై దృష్టి పెట్టింది. తనలాంటి మరో 10 మంది మహిళలతో వ్యాపారాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నది. వీ హబ్ సహకారంతో శాంతికి వస్తున్న ఆర్డర్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భవిష్యత్తులో తక్కువ మొత్తంతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించడంపై దృష్టి పెట్టానని, తమ ఉత్పత్తులు మరింత మందికి చేరువయ్యేలా ప్రయత్నిస్తామని చెబుతున్న శాంతికి మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.
– కడార్ల కిరణ్