పెండ్లి, పిల్లలు, ఆరోగ్యం.. మహిళ ఏ కారణంతో బ్రేక్ తీసుకున్నా ఆమె కెరీర్‌కు అది ముగింపే. ఇంకో ఉద్యోగం సంపాదించడం మహాకష్టం. ఇంటర్వ్యూకు వెళ్లినా రకరకాల ప్రశ్నలు ఎదుర్కోవాలి. అనేకానేక వివరణలు ఇచ్చుకోవాలి. అయినా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదు. ‘ఆ నాలుగైదేండ్ల కాలంలో సాంకేతికంగా అనేక మార్పులు వచ్చేస్తాయి. వాటి గురించి మహిళలకు అవగాహన లేకపోతే కష్టమే. అందుకే మేము..’ అంటూ వివరణ ఇచ్చుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఆ ఇబ్బందిని తనూ అనుభవించింది నేహా బగారియా.
అందుకే, ఈ పరిమితిని సరిచేయడానికి ‘జాబ్స్ ఫర్ హర్’ అనే సంస్థను స్థాపించింది. బ్రేక్ తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకునేవారికి ఆమె శిక్షణ ఇస్తారు. సమకాలీన టెక్నాలజీని పరిచయం చేస్తారు. దాదాపు పదివేల కంపెనీలలో ఉద్యోగ ప్రయత్నాలకు అవకాశం కల్పిస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు, పని వేళలలో సడలింపులు, ఆకర్షణీయమైన జీతభత్యాలు.. మహిళల రీ ఎంట్రీకి ప్రధాన కారణాలని చెబుతారామె.