కనిపించని ప్రపంచాన్ని కండ్ల ముందు ఆవిష్కరిస్తుంది వర్చువల్ రియాలిటీ. కనిపించే ప్రపంచాన్ని మనది కాదేమో అనిపించేలా చేసింది కొవిడ్. ఈ రెండూ ఆమె జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపించాయి. ఒకటి నిలబెడితే.. ఇంకోటి పడగొట్టింది. కష్టనష్టాల్లో తొణక్కపోవడం అమ్మ నుంచి నేర్చుకుందామె. అందుకే, ఓ పక్క కొవిడ్, మరో పక్క క్యాన్సర్ మూకుమ్మడిగా దాడిచేసినా ైస్థెర్యం సడలనివ్వలేదు. కరోనాకు
ముందూ తర్వాతా ఆంత్రప్రెన్యూర్‌గా తన జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే… ఇంటర్వెల్ సహా ఆమె జీవితం హిట్టే! కోల్‌కతాకు చెందిన డీసీ విజన్ వీఆర్ సంస్థ స్థాపకురాలు ధృతి ఛటర్జీ… ఒడుదొడుకులతో సాగిన తన జీవితం గురించి ‘జిందగీ’తో పంచుకున్నారిలా..
డ్రీమ్ హోమ్.. ఇన్ని గదులు, ఈ రంగుల గోడలు, ఇలాంటి ఇంటీరియర్… ఎన్నో ఊహలు. వాటికి నిజరూపం తీసుకొచ్చి మీరనుకున్నట్టే ఉందా… అని అడుగుతుంది వర్చువల్ రియాలిటీ. మనం ఉండబోయే ఇంటిని ఇలా చూపించడం బిల్డర్లకు, ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్లకూ ఎంత అవసరమో.. ఇంటి యజమానులకూ అంతే మంచిది. రంగులన్నీ వేసి, కర్టెన్లు జతచేశాక… అబ్బే కాంబినేషన్ బాలేదు… అనిపిస్తుంది. అప్పుడు మార్చాలంటే డబ్బు, శ్రమ, సమయం వృథా! అదే వర్చువల్ రియాలిటీ ద్వారా మనమే నేరుగా వెళ్లినట్టు అన్నీ చూడగలిగితే వీటన్నిటినీ ఆదా చేసుకోవచ్చు.
మా సంస్థ డీసీ విజన్ వీఆర్ చేసే పని ఇదే. ఒక్కమాటలో చెప్పాలంటే పునాదిరాయి వేయకముందే… గృహప్రవేశం అయిన ఇంట్లో వర్చువల్‌గా అడుగు పెట్టొచ్చన్నమాట! ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాదు, కాలేజీలు, ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్, ఫార్మా సంస్థలు… ఇలా ఎన్నిటికో మేం సేవలందిస్తున్నాం. గతేడాది 50కి పైగా ప్రాజెక్టులు పూర్తిచేసి, ఈ రంగంలో మాకంటూ పేరును సంపాదించుకున్నాం. నిజానికి దీనికి ముందు కూడా డిడాక్టిక్స్ ఐటీ సొల్యూషన్స్ పేరిట మరో సంస్థను ప్రారంభించి విజయవంతంగా నడిపాం. హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లోనూ మాకు క్లయింట్లు ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల్లోనూ… చాలా ప్రాజెక్టులు పూర్తిచేశాం. ఆంత్రప్రెన్యూర్‌గా నా ప్రయాణం చెప్పాలంటే ముందు నా నేపథ్యం గురించీ చెప్పాల్సిందే.
మధ్యతరగతి జీవితం విలువల్ని నేర్పింది. పద్ధతులు, చదువు, నాట్యం, సంగీతం… ఇవే చిన్నప్పుడు నా ప్రపంచం. డిగ్రీ అయిపోయాక పీజీ (ఆంథ్రపాలజీ) చదివాను. అయితే ఆ సమయానికి మంచి ఉద్యోగం రావాలంటే హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌లలో అవకాశాలు బాగున్నాయి… అన్నారు నాన్న. దీంతో డిప్లొమాలో చేరాను. నాన్న బ్యాంకర్. అమ్మకు సొంతంగా సెలూన్ ఉంది. అలా డిప్లొమాలో చేరినప్పుడు అక్కడ నేను తప్ప అంతా మగపిల్లలే. అయినా బెరుకు లేకుండా పూర్తిచేశాను. అదే ఇన్స్టిట్యూట్లో మొదటి లేడీ ఫ్యాకల్టీగా రెండేండ్లు పనిచేశా. తర్వాత కూడా కొన్ని ఉద్యోగాలు చేశా. అయిదేండ్లు గడిచేసరికి పెద్ద హోదా కలిగిన ఉద్యోగంలోనే ఉన్నా.. ఒకానొక సమయంలో నాకంటూ సొంతంగా కంపెనీ ఉంటే బాగుండు అనిపించింది.
అమ్మ కూడా సొంతంగా సెలూన్ ప్రారంభించి నడుపుతూ ఉండటం వల్ల కాస్త ధైర్యమూ వచ్చింది. అలా 2011లో ముగ్గురు మిత్రులం కలిసి ‘డిడాక్టిక్స్ ఐటీ సొల్యూషన్స్’ ప్రారంభించాం. వివిధ కంపెనీలకు ట్రైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం మా సంస్థ పని. అంటే, ఒక సంస్థకు సంబంధించిన ఉద్యోగులకు ఒక సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ కావాలి అంటే, మేమే నిపుణుల్ని మాట్లాడి, హాల్స్ బుక్ చేసి, భోజనం ఏర్పాటుచేసి… ఎన్నాళ్లు అవసరం అయితే అన్నాళ్ల శిక్షణ ఇచ్చేవాళ్లం.
ఐబీఎం, క్యాప్‌జెమిని, టీసీఎస్, యాక్సెంచర్… ఇలా ఎన్నో పేరెన్నికగన్న ఐటీ సంస్థలకు మా సేవలందించాం. ఒకరకంగా చెప్పాలంటే, అసలు మా రంగంలో తిరుగులేకుండా దూసుకెళ్లాం. అదే సమయంలో నాకు ఏఆర్ వీఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ) టెక్నాలజీ గురించి ఒక ప్రొఫెసర్ ద్వారా తెలిసింది. బాగా ఆసక్తిగా అనిపించడంతో దాని గురించి సింగపూర్, మలేషియాలాంటి దేశాల్లోని ఎగ్జిబిషన్లకు వెళ్లి మరీ తెలుసుకున్నా. లండన్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు కూడా చేశా. కొవిడ్ సమయంలో దీని అవసరం మరింత ఉందనిపించి 2020 డిసెంబరులో డీసీ విజన్ వీఆర్ సంస్థ ప్రారంభించా. 250 మందికి పైగా విద్యార్థులకు దీని ద్వారా ట్రైనింగ్ కూడా ఇచ్చా. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఏముంటుంది. ఒడుదొడుకులూ ఎదురుదెబ్బలూ మనమేంటో పరీక్షిస్తాయిగా…
కొవిడ్ దెబ్బకు మా శిక్షణ సంస్థ అతలాకుతలం అయింది. అందులోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైన పరిస్థితి ఏర్పడింది. నాకు అంతకుముందు నుంచీ ఎండోమెట్రియాసిస్ అనే నెలసరి సంబంధిత సమస్య ఉండేది. నెలలో 20 రోజులపాటు సమస్య ఎదుర్కొనేదాన్ని. కొన్నేండ్లపాటు దాంతో సహజీవనం చేశా. కానీ, నాకు సెకండ్ వేవ్‌లో కొవిడ్ వచ్చాక ఇది తట్టుకోలేని సమస్యగా మారిపోయింది. నొప్పి తీవ్రంగా వేధించింది. లాక్డౌన్ వేళ ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో నరకం అనుభవించా. చివరికి ఫ్యామిలీ డాక్టర్ సాయంతో కొన్ని పరీక్షలు చేసుకున్నాక, డాక్టర్ని కలిశా. గర్భాశయ క్యాన్సర్ తొలిదశలో ఉందన్నారు. ఆపరేషన్ చేశారు. వ్యాపారాలు, ఆరోగ్యం అన్నీ ఒకేసారి కుదేలయ్యాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఓ మెంటార్‌ని కలిశా. ఆర్థికంగానే కాదు, మానసికంగానూ ఆమె నాకు దన్నుగా నిలిచారు. అలాగే, ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు తొణక్కుండా పనిచేయడం అమ్మ నుంచి నేర్చుకున్నా. అమ్మా, నాన్న, మావారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నారు. అలా కోలుకుని, ఏడాది విరామం తర్వాత నా కొత్త సంస్థ మీద దృష్టి పెట్టా. అది విజయవంతంగా నడుస్తున్నది. తొలి సంస్థ డిడాక్టిక్స్కూ పునరుత్తేజం తీసుకొచ్చాం. వర్చువల్ రియాలిటీ రంగానికి సంబంధించి నా అనుభవాన్నీ, ఆలోచనలనూ పంచుకోమంటూ చైనా ప్రభుత్వం పిలిచింది. సొంతకాళ్లపై నిలబడాలన్న ఆశ ఉన్న నాలాంటి 250 మందికిపైగా మహిళా ఆంత్రప్రెన్యూర్లకు మెలకువలు నేర్పించాను.
తొలి నుంచీ నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకునేదాన్ని. నేను చేసే పనులకు కూడా పరంపర కొనసాగాలనుకుంటా. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. కష్టపడటం ఆపకపోవడానికి అదే స్ఫూర్తి. ఆ పరంపరను ఏర్పాటు చేయడమే నా లక్ష్యం కూడా. అలాగని నా పిల్లలు ఇదే వ్యాపారం చేయాలని నేను ఒత్తిడి చేయను. నాకు కవల పిల్లలు. వయసు పదహారేండ్లు. మా పాప నన్ను అనుసరిస్తుంది. తను ఇప్పటికే యూట్యూబర్. బాబు టీం ఇండియాకు ఆడాలన్న లక్ష్యంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఇలా, ఎవరికి నచ్చిన రంగంలోకి వాళ్లు వెళ్లే వసతి అందరి పిల్లలకూ ఉండదు. అలాంటి పిల్లల కోసం ‘స్కూల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ థాట్’ పేరిట ఒక శిక్షణాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నా. అక్కడ వాళ్లు తమకు నచ్చిన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. మనం జీవించడానికి పుస్తకాల్లోని చదువుకన్నా, మనం నేర్చుకున్న నైపుణ్యాలే ఎక్కువ ఉపయోగపడతాయని నమ్ముతాను. ఇకమీదట దీని కోసమూ కష్టపడతాను!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి