పడిలేచిన కెరటం మరింత ఎత్తుకు ఎగిసిపడుతుంది. ఊహించని దెబ్బ తగిలినప్పుడే.. జీవితం వేగం అందుకుంటుంది. అట్లనే.. కాలేజీ లైఫ్‌లో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న అనుభవం అతని ఆలోచనల్ని మలుపు తిప్పింది. తనకు కష్టమైన చదువులు వద్దనుకుని ఇష్టమైన యానిమేషన్ వైపు అడుగులు
వేయించింది. సినిమా అనుభవం లేదు, అసిస్టెంట్‌గా పని చేసిందీ లేదు! అయినా ప్రతిభనే వెతుక్కుంటూ సినిమా అవకాశాలు వచ్చాయి. సొంతంగా తనను తాను దిద్దుకున్న ఈ వీణవంక బిడ్డ ఆర్ఎం విశ్వనాథ్ కూచనపల్లి ఇప్పుడు ఎడిటర్‌గా సినిమాలను తీర్చిదిద్దుతున్నాడు. గెలవడానికే జీవితం
ఉందనుకుంటే.. విజయం మన చిరునామా అవుతుందంటున్న ఈ యంగ్ ఎడిటర్ కట్స్, ఎడిట్స్ లేకుండా తన ప్రయాణాన్ని జిందగీతో పంచుకున్నారు.
మాది కరీంనగర్ జిల్లా వీణవంక. నాకు మొదటి నుంచి మల్టీ మీడియా అంటె ఇష్టం. ఇంటర్ తర్వాత మల్టీ మీడియా చేద్దామనుకున్న. కానీ, బీటెక్‌లో చేరిన. పెద్దపల్లిలో మదర్‌థెరిసా ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు విండోస్ మూవీ ఎడిటర్ వాడేవాడిని. మా కాలేజ్‌లో ఒక స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్స్ తీసిండు. నాకు ఎడిటింగ్ నాలెడ్జ్ ఉందని తెలిసి, ఆ పని నాకే ఇచ్చిండు. రెండు షార్ట్ ఫిల్మ్స్‌కి ఎడిటర్‌గా పని చేసిన. కాలేజ్‌లో దాన్ని స్క్రీనింగ్ చేస్తే.. అందరూ మెచ్చుకున్నరు. అంతకుముందు కాలేజ్‌కి పోతే నన్నెవరూ గుర్తుపట్టకపోతుండె. ఆ షార్ట్‌ఫిల్మ్ స్క్రీనింగ్ తర్వాత ప్రిన్సిపల్ సర్, లెక్చరర్లు నన్ను పేరు పెట్టి పిలవడం, పలకరించడం భళేగా అనిపించేది. ‘నీకు సినిమా కరెక్ట్. అందులోకే పో’ అని ఫ్రెండ్స్ చెప్పేది.
నా కాలేజ్ లైఫ్‌లో అన్నీ ఎదురుదెబ్బలే. లవ్ ఫెయిల్యూర్ పలకరించింది. ఆమె నా జీవితంలోకి రాకుంటే లవ్ అంటే ఏమిటో తెలిసేది కాదు. ఆమె నా లైఫ్ నుంచి వెళ్లిపోకుంటే లైఫ్ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. కొన్ని బ్యాక్ లాగ్స్ మిగిలిపోయాయి. లైఫ్‌లో టార్గెట్ లేదు. ఏం చేయాల్నో తెలిసేది కాదు. నలుగురూ నాలుగు రకాల మాటలు అంటుంటె డిప్రెషన్లోకి పోయిన. మూడు నెలలు బాధపడ్డ. లైఫ్‌లో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్న. యానిమేషన్ వర్క్ నేర్చుకోవాలని అనుకున్న. అప్పటి దాకా నాన్న, అన్నయ్య చెప్పింది చేసిన. ఇదొక్కటే నేను తీసుకున్న నిర్ణయం. ఎరెనా మల్టీ మీడియా ఇన్స్టిట్యూట్లో చేరిన. నాన్న, అన్నయ్య సపోర్ట్ చేసినరు. మల్టీ మీడియా నేర్చుకుంటనే షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసిన. డబ్బులు కూడా వచ్చేవి. మెల్లమెల్లగా పరిచయాలూ పెంచుకున్న. ఇంతల్నే నాకు పెండ్లయ్యింది. స్థిరమైన ఆదాయం అంటూ ఏం లేదు. షార్ట్‌ఫిల్మ్ ఎడిటింగ్‌కు ఇంత అడ్వాన్స్ ఇచ్చేది. బ్యాలెన్స్ ప్రాజెక్ట్ అయిపోయినాంక ఇస్తమనేది. ఆ పైసలు ఇక అటే! ఇంటి అద్దె కూడా కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డ. ఈ కష్టం వద్దని జాబ్ చేయాలని ఫిక్సయిన. సింగరేణిల కాలరీస్‌లో ఏదన్నా ప్రాజెక్ట్ ఇస్తరేమో అని పోతే.. వాళ్లు ‘యూట్యూబ్ చానెల్ పెడుతున్నమ’ని ఫుల్‌టైమ్ జాబ్ ఆఫర్ చేసినరు. ఇదేదో బాగుందని అక్కడ చేరిన. నెల నెలకూ జీతం వచ్చేది. ఇంట్లోనే షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసేది. నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘విద్యో రక్షతి రక్షితః’కి బెస్ట్ ఎడిటర్ అవార్డ్ వచ్చింది. పేరు పైసలు రావడం మొదలైంది.
షార్ట్ ఫిల్మ్స్‌కి ఎడిటింగ్ చేసేప్పుడు చాలామంది డైరెక్టర్లు ‘నేను సినిమా చేస్తే నువ్వే ఎడిటర్’ అనేది. వాళ్లకు సినిమాలు రాలే. నేను సినిమా ఎడిటర్ కాలే. ఆ మాట వేణు ముల్కల ఎప్పుడూ అనలే. కానీ, తనకు సినిమా చాన్స్ రాంగనె నన్నే ఎడిటర్‌గా పెట్టుకుంట అన్నడు. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్‌గా పని చేయలె. సినిమా ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. వచ్చిన అవకాశం కాదనలె. సినిమాలోకి పోదామని జాబ్‌కి రిజైన్ చేస్తనన్న. మొదాలు ఇంట్లో భయపడ్డరు. జాబ్ పోతే రాదు. కానీ, నాకు ఎడిటింగ్ అంటే ప్రాణమని వాళ్లకు తెలుసు. అందుకే నా ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకొన్నరు.
సినిమా ఎడిటింగ్‌కి సపోర్ట్ చేసే కంప్యూటర్ లేదు. స్టూడియో లేదు. పీఎఫ్ డబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకున్న. సినిమాకు అడ్వాన్స్ ఇస్తుంటె.. ‘సిస్టమ్స్ కొనాలె. సింగిల్ పేమెంట్’ ఇయ్యమన్న. సరే అన్నరు. రెండున్నర లక్షలు పెట్టి సిస్టమ్ కొన్న. బెడ్ రూమ్‌నే ఆఫీస్ చేసుకున్న. సినిమా ఎడిటింగ్ కొత్త. ఇన్స్టిట్యూట్లో టూల్స్ మాత్రమే నేర్పిస్తరు. సినిమా ప్రాసెస్ తెలియదు. థియేటర్ సాఫ్ట్వేర్, మ్యూజిక్, మిక్సింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుంట, నేర్చుకుంట స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకున్న. మొత్తానికి సినిమా ఎడిటింగ్ చేసిన. ఇంతల్నే కరోనా వచ్చింది. మూడేండ్లు బ్రేక్ పడింది. 2022లో ‘విశ్వక్’ సినిమా విడుదలైంది. స్క్రీన్ మీద నా పేరు పడ్డది. అనుకున్నది అచీవ్ అయిన అనిపించింది. విశ్వక్ సినిమా చేస్తుండగనె మూడు సినిమాలకు ఆఫర్లు వచ్చినయ్. ఇంకో మూడు కంప్యూటర్ సిస్టమ్స్ కొన్న. బెడ్ రూమ్‌లోనే వాటన్నిటినీ పెట్టిన. చేసిన సినిమాలు విడుదల కాలె. ఆ తర్వాత ప్రవీణ్ ఐపీఎస్, మార్కెట్ మహాలక్ష్మి, ఆర్టిస్ట్ విడుదలైనయ్. ‘ఆర్టిస్ట్’ సినిమాతో సినిమా ఎడిటర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. పెద్ద బడ్జెట్ సినిమాలకు దారి దొరికింది. ఇండస్ట్రీలో ఎక్కువ మందికి నా పేరు తెలిసింది.
ఇప్పుడు చేతినిండా సినిమాలున్నయ్. తీరిక లేకుండా పని ఉంది. అయితే పెద్ద సినిమాలు చేయలేదన్న అసంతృప్తి ఉండె. పెద్ద సినిమాలు చేయాలంటే సొంత స్టూడియో ఉండాలె. అందుకోసమని పది సిస్టమ్స్ కొన్న. స్టూడియో పెట్టిన. ఆరుగురు అసిస్టెంట్లను పెట్టుకున్న. అద్దె, జీతాల, మెయింటనెన్స్ కష్టమైంది. స్టూడియో నడపడం కోసం ఎడిటింగ్ అడ్డా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టిన. ఏ ఎడిటర్.. ట్రైనింగ్ ఇచ్చే పని పెట్టుకోరు. నేను ఎవరి దగ్గరా నేర్చుకోలె. కానీ, నలుగురికీ పని నేర్పాలనుకున్న. మూడు నెలల కోర్స్, బ్యాచ్‌కి అయిదుగురికి నేర్పిస్తున్న. ఇప్పటి వరకు పదహారు బ్యాచ్‌లకు ట్రైనింగ్ ఇచ్చిన. ట్రైనింగ్ ఇస్తూనే ఎడిటింగ్ చేస్తున్న. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాలకు ఎడిటింగ్ చేస్తున్న. నేను పనిచేసిన సినిమాలకు నేనే ట్రైలర్స్ చేసిన. వాటికి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అదే స్ఫూర్తితో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ‘పిక్సెల్ ప్యారెట్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ పెట్టిన. ఇప్పుడు ఒక సినిమాకు అవసరమైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చేయగలం. రెండు వందల దాకా షార్ట్ ఫిల్మ్స్, పది సినిమాలకు ఎడిటింగ్ చేసిన. నేను నడిచిన దారిలో ఇప్పుడు పదిమందినీ నడిపిస్తున్న. ఇంతకన్నా తృప్తేం ఉంటది.
– నాగవర్ధన్ రాయల
– చిన్న యాదగిరి గౌడ్