స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతుంటాయి. అవతార్లు చెప్పే విశేషాలు విని లైక్ కొట్టడమే కాదు, అవసరం అనుకున్న వాళ్లకు షేర్ చేస్తుంటాం. ఏఐ అవతార్లను సృష్టించడం, ఆడించడం, మాట్లాడించడం ఎంతో కష్టం అనుకుంటున్నారా? ‘అదంతా అబద్ధం’ అంటున్నది కరీంనగర్ జిల్లాకు చెందిన కవితా గణగోని. గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియంలో చదివిన ఆమె ఇంటి దగ్గరే ఏఐ నేర్చుకుని, అవతార్లతో అవలీలగా వీడియోలు క్రియేట్ చేస్తున్నది. పేదరికం, ఆకలి, అవమానాలు లేని జీవితం కోసం డాటా ఎంట్రీ చేస్తూ, మగ్గం వర్క్ చేస్తూ ఓడిపోయిన ఆమెను ఏఐ గెలిపించింది. సక్సెస్ఫుల్ ఆంత్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది! ఇప్పుడు ఆమెకో బ్రాండ్ ఉంది. ఆమెతో ఓ నెట్వర్క్ ఉంది. అందుకే ఆమె పేరు కవితా బ్రాండ్ నెట్వర్క్.
‘డబ్బులు ఊరికే రావు’ అంటూ ఓ పెద్దాయన ఇంటింటికీ వచ్చి బంగారు మాట చెప్పారు. కష్టపడి సంపాదించిన డబ్బు తెలియని వాళ్లు పంపిన మెసేజ్‌లో లింక్‌ని క్లిక్ చేయగానే దొంగలపాలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. తమవాళ్లకు ఇలా జరగకుండా ఉండాలని కొంతమంది తెలియని వాళ్ల మెసేజ్‌లు వస్తే స్పందించవద్దని సూచనలు పంపుతున్నారు. అలా సోషల్ మీడియాలో నేను కూడా అవతార్‌తో అందరికీ సైబర్ సెక్యూరిటీ టిప్స్ చెబుతున్నాను. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అందరికీ సైబర్ మోసాలపట్ల అవగాహన కల్పిస్తున్నాను. సైబర్ ఫ్రాడ్ జరిగిన ఒక గంట పాటు గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ సమయంలో 1930కి ఫోన్ చేసి జరిగిన మోసం చెబితే.. అకౌంట్లోకి డబ్బులు తిరిగొస్తాయని ఈ అవతార్‌తో చెప్పించి అవగాహన కల్పిస్తున్నా! ఈ వీడియో చేయడానికి నాకూ ఓ కారణం ఉంది. డబ్బులు పోగొట్టుకున్న అనుభవం నాకు లేదు. ఎందుకంటే పోగొట్టుకోవడానికి నా దగ్గర ఉంటేగా? నేను పేదరికంలో పుట్టి, పెరిగాను. డబ్బుల్లేని బాధని అనుభవించాను. డబ్బులు పోగొట్టుకున్నవాళ్లూ అదే బాధ పొందుతారు. అందుకే సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను. ఆదాయం లేకపోయినా నలుగురి మేలు ఆశించి, నా సమయం వెచ్చించి అవతార్‌తో ఎన్నో మాటలు చెప్పిస్తున్నా. నలుగురికి మేలు చేయాలంటే నాకు డబ్బు లేదు. ఉన్నదల్లా ఏఐ కంటెంట్ క్రియేట్ చేసే నైపుణ్యమే. దీనికి సమయం తప్ప డబ్బుతో పనిలేదు. కాబట్టి తేలికగా సమాజం కోసం పని చేయగలిగాను. ఏఐతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు కదా.. అందులో ఇదీ ఒకటి అనుకోండి.
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. అడుగు తీసి అడుగు వేయాలంటే బాధగా ఉండేది. ఆరు నెలలు కదలకుండానే ఉండిపోయా. ఆ టైమ్‌లో అందరిలా నేనూ కాలక్షేపం కోసం వాట్సాప్ చూస్తున్నప్పుడు ఓ గ్రూప్‌లో ఓ ఆసక్తికరమైన వీడియో చూశా. ఇరవై ఒక్క రోజుల్లో ఏఐ నేర్పిస్తామని, ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవచ్చని అందులో ఉంది. మా ఊళ్లో ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవచ్చు అనుకున్నా. కానీ, మాది పల్లెటూరు. గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తెలుగు మీడియం చదువు. ఇంగ్లిష్ రాదు. నేను కూడా ఏఐ నేర్చుకోవచ్చా అని ఏఐ ట్రైనర్ నిఖిల్ సర్ని అడిగితే.. ఎవరైనా నేర్చుకోవచ్చని ఎంకరేజ్ చేశాడు. కానీ, దరఖాస్తు చేసుకోవడానికి అదే లాస్ట్ డే. మా మేనమామ కొడుకు దగ్గర అప్పు చేసి, అయిదు వేలు ఫీజు కట్టాను. ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ ఇంటి దగ్గరే నేర్చుకున్నా. అప్పుడు నా దగ్గర ల్యాప్‌టాప్ కూడా లేదు. ఫోన్లోనే క్లాసులు వింటూ నేర్చుకున్నా. ఎటూ పోలేక, ఏ పనీ చేయలేక, కుటుంబ భారం, బాధని మోస్తున్న నాకు.. భగవంతుడు ఏఐని పరిచయం చేశాడేమో!
ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో… 2జీ ఫోన్లో చిన్న చిన్న బ్లాక్స్తోని బొమ్మలు చేయడం, లెటర్స్, సింబల్స్తోని బొమ్మలా మెసేజ్ రాసేదాన్ని. అలా ఆగిపోయిన నా క్రియేటివిటీ ఏఐ టూల్స్‌తో మళ్లీ ముందుకు వచ్చింది. ఏఐ టూల్స్ వినియోగించడం నేర్చుకున్న తర్వాత నాకు నేనే కొన్ని వీడియోలు తయారు చేశాను. నా ఫొటోతో అవతార్ క్రియేట్ చేశాను. సైబర్ సెక్యూరిటీతోపాటు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కోసం మరో వీడియో రూపొందించా. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అవి చూసి.. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్లు వచ్చి.. ‘మాకు ఓ యాడ్ వీడియో చేసివ్వమ’ని అడిగారు. నా ఫొటో ఇచ్చి.. పదేళ్ల వయసు తగ్గించి.. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లు, ఫ్లాట్స్ గురించి చక్కగా అవతార్‌తో చెప్పించాను. ఆ వీడియోతో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు వీడియో కంటెంట్ కావాలని అడిగారు. ఇళ్లల్లో ఉండి సొంత ఉత్పత్తులు అమ్ముకునే వాళ్ల నుంచి చిన్న పట్టణాల్లో వ్యాపారాలు చేసుకునేవాళ్ల వరకు ప్రమోషన్ కోరుకుంటున్నారు. చిన్న వ్యాపారులకు ఏఐతో తక్కువ ఖర్చుతోనే యాడ్స్ చేస్తూ ఉపాధి పొందాను. కొందరి డిమాండ్ మేరకు వాళ్ల ఫొటోలతోనే అవతార్లు క్రియేట్ చేసి యాడ్స్ రూపొందించాను. ఫిట్నెస్ స్టూడియోలు, విద్యాసంస్థలు, హాస్పిటల్ ఇలా.. ఏది ప్రమోట్ చేయాలని అడిగితే ఆ వీడియోలు చేసిచ్చాను. కొంతమంది వెబ్సైట్ డిజైన్ చేసివ్వమన్నారు. అలా వెబ్ హోస్టింగ్లోకీ అడుగుపెట్టాను. అలా ఇంట్లో ఉంటూనే చిన్న ల్యాప్‌టాప్‌తో ‘కవిత బ్రాండ్ నెట్వర్క్’ స్థాపించాను.
నెల రోజులు నేర్చుకున్న ఏఐ నా కాళ్ల మీద నేను నిలబడేలా చేసింది. ఇప్పుడు చేతినిండా పని ఉంది. వీడియో కంటెంట్ క్రియేట్ చేయడంతోపాటు వెబ్ హోస్టింగ్‌తో నిలదొక్కుకున్నా. నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలని ఆన్లైన్లో ఏఐ క్లాసులూ చెబుతున్నా. ఇప్పటి వరకు రెండు వందల మందికి ఏఐ నేర్పాను. సోషల్ మీడియా, గ్రోక్, చాట్ జీపీటీ, ఏజెన్ టూల్స్‌ని ఎలా వాడాలో అవగాహన కల్పించాను. ఏఐ ఉద్యోగాన్ని, పనిని తేలిక చేస్తుంది. నెల రోజుల్లో చేసే ప్రాజెక్ట్‌ని వారం రోజుల్లో పూర్తి చేయొచ్చు. మోటివేషనల్ స్పీకర్ కావాలనే కోరిక ఉండేది. ఆ కోరికతో గంప నాగేశ్వరరావు గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గురించి అవగాహన కల్పిస్తున్నాను. పరిస్థితులు ఎటు నెడితే అటు పయనం చేసే సాధారణ జీవితమే నాది. కానీ, నేను పరిస్థితుల్ని నాకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అనేకసార్లు ఓడిపోయాను.
కానీ, ఏనాడూ ప్రయత్నించడం మానలేదు. అదే నన్ను ఇప్పుడు నిలబెట్టింది, ఇలా గెలిపించింది.
నాకు తొమ్మిదేండ్లు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అమ్మమ్మ చేరదీసింది. నాకు ఆటలంటే బాగా ఇష్టం. ఏది ఆడినా ఫస్ట్ లేకుంటే సెకండ్ వచ్చేదాన్ని. పల్లెటూరి నేపథ్యం వల్ల కెరీర్ గురించి అవగాహన లేకుండా పెరిగాను. ఇంటర్మీడియెట్‌లో సీఈసీ చదివాను. సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగానే పెండ్లయింది. ఇద్దరు ఆడపిల్లలు. పేదరికంలో పెట్టి, పేదరికంలో పెరిగిన నాకు పెండ్లి తర్వాత కూడా పేదరికం నుంచి విముక్తి కలగలేదు. బతుకుపోరులో గెలవాలనే ఆశయాలేవీ లేవు. బతకడమే కష్టమైంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరాను. పిల్లల వల్ల డిస్ కంటిన్యూ అయ్యాను. బతకాలంటే సంపాదించాలి. అందుకోసం ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నా. కంప్యూటర్స్ డిప్లొమా చేశాను. మ్యాట్రిమెనీ కోసం డాటా ఎంట్రీ జాబ్ వర్క్ చేశాను. మరోవైపు మగ్గం వర్క్ నేర్చుకుని ఇంటి దగ్గర రెండు పనులూ చేసేదాన్ని. పది సంవత్సరాలు అలా గడిచిపోయాయి. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అవసరాలు పెరిగినట్టే అప్పులు పెరిగాయి. అమ్మమ్మ నా పెండ్లికి ఇచ్చిన బంగారం తప్ప నాకు మరే ఆస్తులూ లేవు. దాన్నీ అమ్మేశా. ఇక మిగిలిందేమీ లేదు. నాకాళ్ల మీద నేను నిలబడాలని అనుకున్నప్పుడు కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. అప్పుడు నాకు భగవంతుడు ఏఐ రూపంలో వరమిచ్చాడు.
– నాగవర్ధన్ రాయల
– ఎం.గోపీకృష్ణ