కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పట్టా సాధించాడు. హైదరాబాద్ నగరం వదిలి మారుమూల పల్లెలో చట్టాల్ని అమలు చేసే ప్రయోగాలు మొదలుపెట్టాడు. తన కార్యచరణకు పెట్రోల్ బంక్‌ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు. పెట్రోల్ బంక్‌ని రూల్స్ ప్రకారం ఎలా నిర్వహించాలో జనానికి ఎరుక చేస్తున్నాడు డాక్టర్ బాలాజీ మన్నెం. చట్టాలు అమలైతే ప్రజలకు ఎంత మేలో తెలియజేసే ప్రీతి ఫిల్లింగ్ స్టేషన్ ఓసారి చూసిరావాల్సిందే. పెట్రోల్ పోయించుకోవాల్సిందే. బహుమతి గెలుచుకోవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం. చలో గజ్వేల్!
సమస్యలే ఆవిష్కరణలకు దారి చూపిస్తాయి కదా. అలాగే నాకూ ఓ సమస్య కొత్తదారి చూపింది. కల్తీ ఇంధనం పోయించడంతో కారు ఇంజిన్ కొద్ది రోజులకే పాడైపోయింది. దానిని షెడ్డులో వదిలేసి, కాలి నడకన తిరగాల్సి వచ్చింది. పెట్రోలియం ఫిల్లింగ్ సెంటర్లు స్వచ్ఛమైన ఇంధనం అమ్మకపోవడమే నా సమస్యకు కారణం. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పెట్రోల్, డీజిల్ అమ్మేవాళ్లే లేరని అర్థమైంది. పెట్రోల్ బంక్ అంటే ఇలా ఉండాలని కస్టమర్లకు తెలిసేటట్టుగా ఒక పెట్రోల్ బంక్ నడపాలని నిర్ణయించుకున్నా. గజ్వేల్ నుంచి తుప్రాన్ వెళ్లే దారిలో కోమటిబండ గ్రామం దగ్గర మూత పడిన ‘ప్రీతి పెట్రోల్ బంక్’లో వాటాదారుగా చేరాను. బంక్ మళ్లీ తెరుచుకుంది. ఈసారి మామూలుగా కాదు. ‘రాస్తా మే సవాల్’ అంటూ వ్యాపారం మొదలుపెట్టిన. ఇది లాభం కోసం ప్రారంభించలేదు. ప్రయోగాల కోసం చేపట్టాను. యజమానినే అయినా పెట్రోల్ బాయ్ యూనిఫామ్ వేసుకుని పని చేస్తున్నాను. పంప్ బాయ్‌గా శిక్షణ తీసుకున్నాను. పెట్రోల్ బంక్‌ని ఇష్టంగా నడపాలని, బాధ్యతతో నిర్వహించాలనే ఇదంతా…
పెట్రోల్, డీజిల్‌ని జనం నమ్మకంతో కొంటున్నారు. ఫిల్లింగ్ మెషిన్ రీడింగ్ చూస్తున్నారు. కానీ, నిజంగా రీడింగ్ చూపినంత పరిమాణంలో ఇంధనం ఉందో, లేదో వాళ్లకు తెలియదు. అది స్వచ్ఛమైనదో, కల్తీ జరిగిందో తెలుసుకోలేరు. ‘గన్’ తీయగానే ఎక్సలరేషన్ పెంచి స్పీడందుకుంటున్నారు. వాహనం కొనేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. కానీ, దానిలో ఇంధనం పోయించేటప్పుడు ఆలోచించట్లేదు, ప్రశ్నించట్లేదు. ఇదే జనం జేబుకు చిల్లు పెడుతున్నది. అంతేకాదు ఇంజిన్‌కు నష్టం చేస్తున్నది. ఈ రెండు సమస్యలూ ఉండకూడదంటే నమ్మకంతో కాకుండా నిజంపై ఆధారపడే కొనాలి. అందుకు ప్రతీ కస్టమర్ తనిఖీ చేసుకునే కొనమని చెబుతూ ఆగస్టు 9న పెట్రోల్, డీజిల్ అమ్మకం మొదలుపెట్టాను. కస్టమర్లు పెట్రోల్, డీజిల్ స్వచ్ఛత, నాణ్యత తనిఖీ చేసుకునేందుకు టెస్టింగ్ కిట్ పంపు దగ్గరే పెట్టాను. ఇదే ‘మా ఛాలెంజ్.. మా ఇంధనాన్ని ధ్రువీకరించండి. మా స్వచ్ఛత, నాణ్యత, పరిమాణం, సాంద్రతను తనిఖీ చేసుకోండి. తనిఖీ చేసుకున్న తర్వాతే మీ వాహనంంలో పెట్రోల్/డీజిల్ నింపుకోండి’ అంటూ ప్రకటించాం. ఎల్ఈడీ స్క్రీన్‌లో ఇంధన నాణ్యతను ఎలా పరీక్షించాలో వీడియో రూపంలో చూపిస్తున్నాం. పెట్రోల్, డీజిల్ నాణ్యత పరీక్షించే కిట్ అక్కడే ఉంటుంది. ఆ వీడియోని అనుసరిస్తూ వాహన యజమానులు ఇంధనాన్ని పరీక్షించే కొంటున్నారు. మాలాగా ఛాలెంజ్ చేసి, కస్టమర్లు పరీక్షించుకునే అవకాశం కల్పించిన పెట్రోల్ పంప్ తెలుగు రాష్ర్టాల్లో మరొకటి లేదు. కస్టమర్లు మా సవాల్‌ను సంతోషంగా స్వీకరించారు. క్వాలిటీ, క్వాంటిటీ పరీక్షలో పాసయ్యాం. ఆ సంతోషాన్ని మా కస్టమర్లతో పంచుకునేందుకు వంద రూపాయల విలువైన కొనుగోలుకు ఒక రూపాయి కాయిన్ రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తున్నాను. అలాగే కొనుగోలు చేసిన ప్రతిసారీ ఒక లక్కీలాటరీ కూపన్ ఇస్తున్నాం. నెలనెలా లక్కీ డ్రా తీసి విజేతకు మూడు వేల రూపాయల బహుమతి ఇస్తున్నాం. ‘మా ఛాలెంజ్’కు ఎంత మంచి స్పందన వచ్చిందో, మా కానుకలకూ అంత బాగా స్పందన వచ్చింది.

రైతు క్షేత్రంలో కాయకష్టం చేస్తుంటాడు. పెట్రోల్ కోసం పొలం వదిలి రోడ్డెక్కడం అతనికి సమస్యే. అదును తప్పితే నేలలో పదును పోతుంది. విలువైన సమయం పెట్రోల్ బంకుల ముందు కరిగిపోతుంది. రైతులకు ఈ నిరీక్షణ తప్పించాలంటే బంకు దగ్గరకు బండి పోకూడదు. బండి దగ్గరకే బంకు రావాలి. గజ్వేల్ సమీప గ్రామాల్లో అదే చేసి చూపించాం. పెద్ద పెద్ద క్యాన్లతో డీజిల్ కోసం రావొద్దు. మేమే మీ గ్రామాలకు వస్తామని చెప్పాం. చెప్పినట్టే రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న మినీ ట్యాంకర్‌తో గ్రామాలకు పోయాం. రైతులకు కబురు చేశాం. బంకులో ఏ ధరకు డీజిల్ అమ్ముతున్నామో, అదే ధరకు ఊళ్లల్లో అమ్మాం. ఈ సర్వీస్ వల్ల రైతుకు సమయం కలిసొస్తుందని గుర్తించిన గ్రామ సర్పంచ్‌లు ‘మా ఊరికి రండి. రైతులకు డీజిల్ పోయండి’ అని మాకు లేఖలు రాశారు. వారి సహకారంతో జబ్బాపూర్, నర్సంపల్లి, మల్కాపూర్, అప్పాయిపల్లి, వెంకటాయపల్లి, మైలారం, బంగ్లావెంకటాపూర్, దండుపల్లి, బేగంపేట, మజిద్‌పల్లి, ఎల్కల్ గ్రామాలకు ఇంధనం సరఫరా చేశాం.
పెట్రోల్ బంక్ యాజమాన్యం కస్టమర్‌కు మంచినీళ్లు ఉచితంగా ఇవ్వాలి. టాయ్‌లెట్ సౌకర్యం కల్పించాలి. టైర్లకు గాలి ఎక్కించాలి. ఫీజు తీసుకోకూడదు. టిప్ అడగకూడదు. ఏడాది కాలంగా ఇది పక్కాగా అమలు చేస్తున్నాం. కస్టమర్లకే కాదు ఉద్యోగుల వేతనాలు, వెల్ఫేర్ విషయంలోనూ నియమాలు పాటిస్తున్నాం. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాను. మా ‘ఛాలెంజ్’ గురించి కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు నాలుగు సైన్ బోర్డులు పెడితే.. పోటీ వ్యాపారులు వాటికి తెల్లరంగు పూయించారు. అప్పుడు గజ్వేల్‌లో పెద్ద హోర్డింగ్ పెట్టించాను. చుట్టుపక్కల నలభై సైన్ బోర్డులు పెట్టించాను. ఇవన్నీ సహించలేని కొందరు మా బంక్‌పై రౌడీలతో దౌర్జన్యానికి దిగారు. మేనేజర్ని బెదిరించారు. కారు అద్దాలు పగులగొట్టారు. ప్రజల మద్దతు, కస్టమర్ల ఆదరణతో ఆ బెదిరింపులేవీ మమ్మల్ని వెనకడుగు వేయించలేదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండైర్డెజేషన్ (ఐఎఎస్ఓ) నుంచి నాణ్యత, నిర్వహణ, భద్రత మరికొన్ని కేటగిరీల్లో మా బంకు ఆరు సర్టిఫికేషన్లు పొందింది. వాగ్ధారా సంస్థ ‘బెస్ట్ పెట్రోల్ పంప్ డీలర్’ అవార్డు ప్రకటించింది. ముంబయిలో ఇటీవల జరిగిన వాగ్ధారా సమ్మాన్ సమరోహ్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నాను.
బతికినంత కాలం సేవ చేయాలని నేనూ, నా భార్య నిర్ణయించుకున్నాం. సునీత బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాం. నేను కార్యదర్శిగా, నా భార్య (ఆవులపాటి సునీత) కోశాధికారిగా ఈ సంస్థను నిర్వహిస్తున్నాం. వ్యాపారం చేసేది సొంత లాభం కోసమే. అయినా అందులో కొంత లాభం మానుకుని పొరుగువారి కోసం పాటుపడాలనుకున్నాం.
అంబులెన్స్‌లు, మహిళా ఆటోడ్రైవర్లు, వికాలాంగుల బైక్‌లకు పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యేక తగ్గింపు అమలు చేస్తున్నాం. ఇది మా వ్యాపారంలో లాభాలు తగ్గించుకుని చేసే సేవ. నలుగురి కోసం సంపద పంచాలన్న మా సంకల్పంతో ‘మానవ సేవ’ స్వచ్చంద సేవా సంస్థను నెలకొల్పాం. వాహన చోదకుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్డు మలుపులో సోలార్ పవర్ సాయంతో పని చేసే సిగ్నలింగ్ లైట్స్ పెట్టిస్తున్నాం. గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేశాం. పేద పిల్లలకు దుస్తులు ఇచ్చాం. వికలాంగులకు సహాయం చేస్తున్నాం. వాహనాల కోసం పొల్యూషన్ క్యాంప్ నిర్వహించి, ఫ్రీగా సర్టిఫికెట్లు ఇప్పించాం. మా ప్రయాణం ఇవే ప్రమాణాలతో ఇక ముందూ కొనసాగుతుందని ప్రమాణం చేస్తున్నాం.
– డాక్టర్ బాలాజీ మన్నెం,పెట్రోల్ పంప్ డీలర్
– నాగవర్ధన్ రాయల