‘మీరేంటి ఇంత సన్నగా ఉన్నారు!’- ఈ మాట వినడానికి సంతోషంగా ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో ఇది కూడా చాలా ప్రమాదకరమైన కాంప్లిమెంట్ కావచ్చు. ఎందుకంటే.. బరువు తక్కువగా కనిపించినా, లోపల పేరుకుపోయిన కొవ్వు మీకు డయాబెటిస్‌లాంటి రోగాలను తెచ్చిపెట్టవచ్చు. చాలా ఏళ్లుగా మనం ఆరోగ్యం అంటే తక్కువ బరువు, అందంగా కనిపించడం అని అనుకుంటున్నాం. కానీ, ఈ అభిప్రాయం చాలా ప్రమాదకరం. తూకం చూసే స్కేల్ చెప్పేది అబద్ధం కావచ్చు. శరీరం లోపల చాలా ప్రమాదకరమైన కథ నడుస్తున్నది. ఇది ఊహించిన దానికంటే ముందే టైప్ 2 డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక రోగాల వైపు నెడుతున్నది.
ఈ తరహా ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు ‘ఆసియన్ ఇండియన్ ఫినోటైప్’ అని పిలుస్తున్నారు. ఈ పరిశోధనలు ధ్రువీకరించిన దాని ప్రకారం, భారతీయుల శరీర నిర్మాణం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇతర దేశాలవారిలో ఒకే BMI (బాడీ మాస్ ఇండెక్స్) ఉన్నా, భారతీయుల్లో కొవ్వు శాతం కాస్త అధికంగా ఉంటుంది. అంతేకాదు.. కొవ్వు ఎక్కడ నిల్వ అవుతున్నదన్నది చాలా ముఖ్యం. భారతీయులకు పొత్తికడుపు లోపల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. ఈ అంతర్గత కొవ్వు కాలేయం, క్లోమం.. లాంటి అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. ఈ కొవ్వు విషపూరిత అవయవం లాగా పనిచేసి, నిరంతరం ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తుంటుంది. అందుకే ఒక వ్యక్తి బయటకు సన్నగా కనిపించినా, లోపల ప్రమాదకరమైన కొవ్వును మోయవచ్చు. ఈ అంతర్గత కొవ్వు వల్లే భారతదేశం డయాబెసిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇన్సులిన్ నిరోధకతను అంతర్గత కొవ్వు పెంచుతుంది. దానివల్ల క్లోమం అతిగా పనిచేసి, చివరికి బలహీనపడుతుంది. ఇది ప్రీ డయాబెటిస్.. ఆ తర్వాత టైప్ 2 డయాబెటిస్‌కి దారి తీస్తుంది. అందుకే భారతీయులు అత్యంత తక్కువ BMI వద్ద కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్యకరంగా భావించే BMI 23 దగ్గరే ఆసియన్ భారతీయులకు ఊబకాయం మొదలవుతుంది. అందుకే బరువు కంటే నడుము చుట్టుకొలత ముఖ్యం.
నడుము కొలతలు ఇలా ఉండాలి..
అదుపు చేయడం ఎలా?
ఆరోగ్యాన్ని బయటి రూపంతో అంచనా వేయడం మానేయాలి. నడుము చుట్టుకొలత పెరిగితే అది ప్రమాదకరమైన హెచ్చరికగా భావించాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, మన జీవనశైలిని మార్చుకోవాలి.
సమయపాలన: నిదానంగా తినాలి. సమయానికి, సరైన ఆహారం మితంగా తీసుకోవాలి.
వ్యాయామం: స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగ అభ్యాసం చేయాలి.
మానసిక ఆరోగ్యం: మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం చేయాలి, తగినంత నిద్రపోవాలి.
వైద్య పర్యవేక్షణ: అవసరం అనుకుంటే వైద్య పర్యవేక్షణలో మెడిసిన్ వాడాలి.