నవ్వించడం అంటే నవ్వులాటేం కాదు. యాగం ఎవరైనా చేయొచ్చుగానీ, నలుగుర్నీ నవ్వించాలంటే మాత్రం యోగం ఉండాల్సిందే! అలాంటి యోగాన్ని పొంది, హాస్య యాగాన్ని చేస్తున్నారు ప్రముఖ స్టాండప్ కమెడియన్ శ్యామా హరిణి. వేసే ప్రతి పంచూ పండినా, ముల్లులా అది ఎవర్నీ గుచ్చకపోవడం ఆమె ప్రత్యేకత. నలుగురూ నడవని దారిలో నడుస్తూ, పదుగుర్నీ పగలబడి నవ్వించే ఆమె, ఈ విభిన్నమైన వృత్తిలోకి ఎలా వచ్చారు, అందులో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు… అన్న సంగతుల్ని జిందగీతో పంచుకున్నారిలా…
హాస్యం ఎక్కడినుంచో పుట్టదు. మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనల్లోనే దానికి మూలాలుంటాయి. నేనైతే ప్రోగ్రాములకు స్క్రిప్టు తయారు చేసేప్పుడు నాకు తారసపడ్డ సందర్భాలనే తీసుకుంటా. వాటినే కాస్త నవ్వు పుట్టించేలా చెబుతా. అందులో వాస్తవానికి దూరంగా, మనం మాట్లాడుకోలేని విధంగా ఉండే జోకులకు ఆస్కారం ఉండదు కదా! బహుశా అందరూ నా హాస్యాన్ని సున్నితంగా ఉందనీ, హుందాగా ఉంటుందనీ అనడానికి కారణం ఇదేనేమో. దానివల్లే నేను షోలు చేసేప్పుడు నలుగురూ కనెక్ట్ అవుతున్నారని అనుకుంటాను. మనం గమనిస్తే… స్కూలు, కాలేజీ, ఆఫీసు, ఫంక్షన్లు… ఇలా ప్రతిచోటా జరిగే సంఘటనల్లో హాస్యం తొంగి చూస్తుంటుంది. మీకో ఉదాహరణ చెబుతాను.. ‘మనం చిన్నప్పుడు ఇంగ్లిష్ కర్సివ్ రైటింగ్ రాసేవాళ్లం గుర్తుందా. నిజానికి అప్పటికే కంప్యూటర్లు వచ్చేశాయి. అయినా కాపీ బుక్‌లలో రోజూ కర్సివ్ రైటింగ్ రాయించేవారు. ఒకవేళ రాయకపోతే వేళ్ల మీదో, చేతి మీదో కొట్టేవారు. అసలు రాసేదే చేతితో… దాని మీదే కొడితే మళ్లీ ఎలా రాయగలమండీ… అసలు నాకీ విషయమే అర్థం కాదు…’ అనగానే ఎవరైనా సరే ఫక్కున నవ్వేస్తారు. ఇలాంటి క్లాస్‌రూం జోకులు నా కామెడీలో చాలా చూడొచ్చు.
ఇలా స్టాండప్ కామెడీవైపు రావాలని నేను చిన్నప్పటి నుంచీ కంకణాలూ, తాయెత్తులూ అవీ ఏం కట్టుకోలేదు. అలా జరిగిపోయిందంతే. అలా ఎలా జరిగిందో కూడా చెబుతాను. మా నాన్న వాళ్లది విజయవాడ. అమ్మది బందరు. నా చిన్నతనంలో ఎక్కువగా బందరుకు వస్తూపోతూ ఉండేవాళ్లం. అయితే నాన్న వ్యాపార రీత్యా మేం చెన్నైలో స్థిరపడ్డాం. నా చదువు కూడా ఇక్కడే సాగింది. నేను ఎంఏ చేశాను. డిగ్రీలో ఉండగానే పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా ‘ఏవం’ అనే ఓ డ్రామా, స్టాండప్ ప్రోగ్రాముల కంపెనీలో ఆర్గనైజర్‌గా చేరాను. నాకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. స్కూలు, కాలేజీల్లో డ్రామాలు వేసేవాళ్లం. స్టేజీల మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది ఓ సరదా. దీంతో ఈ సంస్థలో పనిచేసేప్పుడే స్టాండప్ కామెడీ ప్రయత్నించాలన్న ఆలోచన వచ్చింది. స్క్రిప్టు తయారు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించాను. అలా నేను ఎంఏ మొదటి సంవత్సరంలో ఉండగా (2018లో) నా తొలి స్టాండప్ కామెడీ షో చేశాను. ప్రశంసలు బాగానే వచ్చాయి.
నా షో చూసి బాగుంది, మీరు బాగా చెప్తారు అనడం చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే, కళాకారులకు ప్రశంసకు మించిన పురస్కారం మరొకటి ఉండదు. నాకు కార్టూన్లంటే ఇష్టం. అందుకే వాటికి సంబంధించిన డ్రెస్‌లు ఎక్కువగా వేసుకుంటుంటాను. కార్పొరేట్ ఆఫీసులు, ప్రైవేట్ ఈవెంట్లు… ఇలా అన్నీ కలిపి ఇప్పటికి 60 దాకా షోలు చేసి ఉంటాను. తెలుగు, తమిళం, ఇంగ్లిష్ మూడు భాషల్లోనూ కార్యక్రమాలు చేస్తాను. తెలుగులో యూట్యూబ్ కామెడీ షో ఖుషీఖుషీగాలో విన్నర్ అయ్యాను. అలాగే అమెజాన్ ప్రైమ్ వాళ్ల కార్యక్రమం కోసం స్టాండప్ కమెడియన్లు అందరం రెండు నెలలు ఒకే హోటల్లో ఉండి ప్రదర్శనలు ఇవ్వడం ఓ మంచి అనుభూతి. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘వేర మారి ఆఫీస్’ అనే సిరీస్‌తోపాటు, తమిళ్లోనే మరో వెబ్ సిరీస్‌లోనూ నటించాను. అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాకు దర్శకుడు జంధ్యాల గారి హాస్యం అంటే ఇష్టం. ఫేవరెట్ కమెడియన్లు చాలా మంది ఉన్నా, బాగా నచ్చే కమెడియన్ అంటే శ్రీలక్ష్మిగారని చెబుతాను. ఇక,‘శ్యామా ద గామా’ పేరిట ఒక యూట్యూబ్ చానెల్ ఇటీవలే ప్రారంభించాను. ఒక మహిళగా ఆడవాళ్ల సమస్యలను, వాళ్లకు సంబంధించిన విషయాలను సున్నితంగా, హాస్య రూపంలో నలుగురితో పంచుకుంటుంటాను. ఈ రంగంలో మహిళా కమెడియన్లు తక్కువ. మరింత మంది స్టాండప్ కమెడియన్లుగా వస్తే, ఆడవాళ్లకు సంబంధించిన మరిన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అది తప్పకుండా స్త్రీలపై ఎదుటి వాళ్ల దృష్టి కోణం మారడానికి సాయపడుతుంది. అందుకే నాలాగే ఇంకొందరు ఆడపిల్లలు ఈ వృత్తిలోకి రావాలని ఆశిస్తాను!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి