జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో సమస్త మానవాళికీ ఒక దివ్యమైన బహుమతిని ప్రసాదించాడు. ప్రస్తుత యుగంలో కురుక్షేత్రాన్ని తలపించే మన రోజువారీ జీవితాలకు మార్గనిర్దేశం చేసే దిక్సూచి గీత. ధర్మం క్షీణించి, అధర్మం
ప్రబలినపుడల్లా, లోకంలో శాంతి సౌభాగ్యాల కోసం ధర్మాన్ని పునఃస్థాపించడానికి తాను యుగయుగాన అవతరిస్తానని గీతాచార్యుడు ప్రకటించి ఉన్నాడు.
మరి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు?
ప్రపంచంలో నానాటికీ అధర్మం, అశాంతి, నేరాలు, అసంతృప్తి పెరిగిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో శ్రీ కృష్ణుడు ఎక్కడున్నాడని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఈ క్షణంలోనూ ఆయన మన మధ్యే ఉన్నాడు. మనందరికీ నిత్యం అందుబాటులోనే ఉంటున్నాడు! ప్రస్తుత యుగంలో కృష్ణపరమాత్మ తన పవిత్ర నామ రూపంలో ఈ లోకాన అవతరించాడని శాస్ర్తాలు వివరిస్తున్నాయి.
కలికాలే నామ రూపే కృష్ణావతార
నామ హాయితే హయ సర్వ-జగత్-నిస్తార॥
ప్రస్తుత కలియుగంలో భగవంతుడి పవిత్ర నామం, హరేకృష్ణ మహామంత్రమే పరమాత్మ అవతార స్వరూపం. ఆ పవిత్ర నామాన్ని జపించినంత మాత్రాన భగవంతుడితో ప్రత్యక్షానుభూతి లభిస్తుంది. సమస్త కర్మ ఫలాల నుంచి విముక్తి లభిస్తుంది.
(చైతన్య చరితామృతం 17.22)
దోష నిధి అయిన కలియుగానికి ఒక గొప్ప గుణం కూడా ఉంది. అదేమిటంటే.. కృష్ణనామ స్మరణమే!
కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వ్రజేత్
(శ్రీమద్భాగవతం 12.3.51)
రాజా! కలియుగం దోషసాగరమే అయినప్పటికీ దీనిలో ఉన్న ఒక మహాగుణం ఏమంటే.. కేవలం హరేకృష్ణ నామాన్ని కీర్తించడం. ఈ మహామంత్రాన్ని స్మరించడం చేత మనుషులు భవబంధ విముక్తులై పరంధామానికి చేరగలుగుతారు.
శ్రీకృష్ణుడి పవిత్ర నామం ఒక్కటే కలియుగంలో
మోక్షానికి గల ఏకైక మార్గమని సమస్త వైదిక శాస్ర్తాలూ వివరిస్తున్నాయి.
నామ విను కలికాలే నాహి ఆర ధర్మ
సర్వ మంత్ర సార నామ, ఏయ్ శాస్త్ర మర్మ॥
(చైతన్య చరితామృత, ఆది లీల 7.14)
ప్రస్తుత కలియుగంలో పవిత్ర భగవన్నామ ఉచ్చారణ కన్నా.. గొప్పదైన ధర్మం మరొకటి లేదు. ఇదే సమస్త వైదిక సూక్తుల సారం. సమస్త శాస్ర్తాల మర్మం.
ఆ పవిత్ర మహామంత్రం:హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరేకృష్ణ మహామంత్రంలోని ఈ పదహారు పదాలు ప్రత్యేకంగా కలి కల్మషాలను నిర్మూలిస్తాయి. కలి దోషాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ పదహారు నామాలు కాకుండా, ఇందుకు ప్రత్యామ్నాయం మరొకటి కనిపించదని భాగవతుల సందేశం. ఈ మహామంత్రాన్ని జాతి, కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, వయో భేదాలేవీ లేక ప్రతిఒక్కరూ జపించవచ్చు. జపించడం అంటే మృదువుగా మంత్రాన్ని ఉచ్చరిస్తూ, భక్తిశ్రద్ధలతో వినడం. ఈ మంత్రం కేవలం మనసులో ఆంతరికంగా జపించేది కాదు. జిహ్వ, పెదాలను కదిలిస్తూ, మంత్రాన్ని ఉచ్చరిస్తూ శ్రద్ధతో వినాలి.
మంత్రాన్ని జపించేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. కేవలం జపిస్తూ మంత్రాన్ని వినాలి. భగవన్నామ శబ్ద ప్రకంపనల్లోనే భగవంతుడు సాక్షాత్కరించి ఉంటాడు. ప్రతిరోజూ నిర్ణీత సంఖ్యలో మంత్రాన్ని జపించాలి. తొలుత చిన్న సంఖ్యతో ప్రారంభించి, క్రమంగా పెంచవచ్చు. ఒక్క మాల అంటే 108 సార్లు జపించాలి. ఆపై జపసంఖ్యను పెంచుతూ నిత్యం 16 మాలలు చేయడం అలవాటుగా చేసుకోవాలి. ఈ ఉత్కృష్టమైన మంత్రాన్ని పఠించడానికి మంచిరోజు కోసమో, సుముహూర్తం కోసమో వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆ మంత్రాన్ని పఠించాలనే ఉద్దేశం కలగడమే భగవత్ అనుగ్రహానికి సంకేతం. కాబట్టి, శీఘ్రమే ప్రతి ఒక్కరూ హరేకృష్ణ మంత్రాన్ని జపించండి. ఆనందంగా జీవించండి.
-శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస ప్రభూజీ
93969 56984