రుతువుల్లో అందమైనది ఏదీ అంటే వసంతానికే ఓట్లు ఎక్కువ పడతాయి. ఆకురాల్చడం నుంచి అందమైన పూలు పూసే దాకా సాగే కాలపు ముచ్చటైన మజిలీ ఇది. లేలేత చిగుళ్లు, చూడచక్కని వర్ణాల్లో విరబూసే విరిబాలలూ ఇక్కడి అలంకారాలు. అందుకే వసంతం అంటే ఓ ప్రత్యేకత.
మనసును కట్టిపడేసే ఆ సౌందర్యాన్ని ఫ్యాషన్ మాత్రం ఎందుకు వదిలేస్తుంది! లేత తమలపాకులను పోలిన స్త్రీల గోటి మీద ప్రదర్శించి తన తరహాలో ప్రకృతికి కితాబునిస్తుంది. అందుకే ఇప్పుడు ‘స్ప్రింగ్ నెయిల్స్’ అన్నది కొత్త నెయిల్ ట్రెండ్. లేలేత వన్నెలు, చిన్ని చిన్ని పువ్వులు గోళ్ల మీద ముద్రించడమే ఇందులో ప్రత్యేకత.
లేత గులాబీ, ఆకాశ నీలం, గోధుమ వన్నెలు ఎక్కువగా ఉంటాయిందులో. దాని మీద లేత చిగుళ్లు, చిట్టి పుష్పాలను నెయిల్ ఆర్ట్లాగా వేస్తారు. బంగారు రంగు ఫినిషింగ్‌లు, సన్నటి చుక్కల్లా మెరిసే కుందన్ల జోడింపులు అదనపు హంగులు. మొత్తానికి చూడగానే వసంతపు అందం గోటి మీద ప్రతిబింబించడమే ఈ ట్రెండ్ లక్ష్యం. మరి మీరూ వేస్తారా వసంతపు రంగులు?!