చిట్టి బుర్ర గొప్ప ఆలోచనలు చేస్తున్నది. రేపటి భారతం సుదూర భవిష్యత్తును దర్శిస్తున్నది. తీవ్ర సమస్యలకు తమవైన పరిష్కారాలు వెదుకుతున్నది. ఇటీవల జరిగిన ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్’లో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ చూడాల్సిందే. రుతుచక్ర సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులకు తమదైన పరిష్కారం చూపారు.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థినులు ఆరోజు హరిణి, పొలాస శివకీర్తి.
ప్రకృతి సిద్ధమైన అరటి నారను ఉపయోగించి నాణ్యమైన శానిటరీ ప్యాడ్స్ తయారు చేశారు. దూది, వేప నూనె, లావెండర్ ఆయిల్ ముడి పదార్థాలుగా ఉపయోగించారు. ఈ ప్యాడ్స్‌ను తిరిగి వాడుకోవచ్చు కూడా. రుక్మాపూర్ సైనిక పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీలోనూ ఈ ఆలోచన ప్రథమ బహుమతిని సాధించింది. రాబోయే జాతీయ స్థాయి పోటీలలోనూ సత్తా చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విద్యార్థులు. ఈ ఫార్ములాపై పేటెంట్ తీసుకుని, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ఆ ఇద్దరి ఆలోచన.
– రంజిత్ రంగా వీర్ల