సోమవారం 08 మార్చి 2021
Zindagi - Feb 10, 2021 , 03:00:08

పత్రాలతోనే హరితహారం

పత్రాలతోనే హరితహారం

కొన్ని పత్రాలు దైవారాధనలో, శుభకార్యాల్లో పాలుపంచుకుంటాయి. మరికొన్ని పత్రాలు ద్వారానికి స్వాగత తోరణాలై నిలుస్తాయి. ఇంకొన్ని నోరు పండించి, జీవితాల్ని తీర్చిదిద్దుతాయి. దాదాపు అన్ని రకాల పత్రాలూ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని ప్రాణవాయువును అందిస్తాయి. మానవ మనుగడలో పత్రాలది కీలక పాత్ర. ఆ పత్రాల నుంచి మొక్కలను సృష్టిస్తున్నారు కొత్తపల్లి శోభ.కొన్ని రకాల ఆకులను విత్తి..  మొక్కలు పుట్టించి, కొమ్మకొమ్మా మారాకు తొడిగేలా చేస్తున్నారు. పత్రాలతోనే హరితహారం నిర్మిస్తున్నారు.

అగ్రికల్చర్‌, సెరికల్చర్‌, హార్టికల్చర్‌ గురించి అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు లీఫ్‌కల్చర్‌ను పరిచయం చేస్తున్నారు సికింద్రాబాద్‌  బోయిన్‌పల్లికి చెందిన కొత్తపల్లి శోభ. విత్తనాలు చల్లకుండానే మిద్దెపై అందమైన తోటను ఆవిష్కరించారామె. అలాగని మొక్కలు నాటారనో, అంటుకట్టారనో భావించకండి. టిష్యూకల్చర్‌తో పని లేకుండా సులువైన పద్ధతిలో నాణ్యమైన మొక్కల్ని సృష్టిస్తున్నారామె. ఆకుల్ని నాటి మొక్కలకు ప్రాణంపోస్తున్నారు.   

ఆకులే విత్తులు

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శోభకు మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ. ఆమె బాల్యమంతా మొక్కల మధ్యే సాగింది. లాక్‌డౌన్‌ సమయంలో డాబామీద ఆకుకూరలు, కాయగూరలు సాగు చేయడం మొదలుపెట్టారు. సులభ రీతిలో మొక్కలను ఉత్పత్తి చేయాలనే తలంపుతో వినూత్నమైన ‘లీఫ్‌కల్చర్‌' పద్ధతిని అనుసరించారు. పచ్చి ఆకును నాటి, దానికి వేర్లు మొలిపించి తద్వారా నాణ్యమైన మొక్క ఆవిర్భావానికి కృషి చేశారు. 

మూడు వారాల్లో 

‘అతి తక్కువ ఖర్చుతో మొక్కలు నాటుకునేలా చేసే మార్గమే లేదా? విత్తనాలతో, షూట్‌ టిప్‌ కటింగ్స్‌తో, ఇతరత్రా కణజాలాలతో నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయగలుగుతున్నప్పుడు.. పచ్చి ఆకును నాటి ఎందుకు  చేయకూడదు? అనే ఆలోచనతో ప్రయోగాలు ప్రారంభించాను. ఈ క్రమంలో ఎదురైన వైఫల్యాలను అధిగమిస్తూ, ఎట్టకేలకు పచ్చి ఆకులు నాటి ఇంటిసాగు కొనసాగిస్తున్నాను. కేవలం ఇరవై రోజుల్లో తులసి, మనీ ప్లాంట్‌, స్నేక్‌ ప్లాంట్‌ ఆకుల నుంచి మొక్కలను ఉత్పత్తి చేయగలిగాను’ అంటారు శోభ.

వేర్లు మొలిపించడం ఇలా..

పత్రాలతో మొక్కలు పుట్టించే విధానం చాలా తేలికే. కాకపోతే జాగ్రత్తలు తప్పనిసరి. ప్రణాళికా బద్ధంగా సాగు చేస్తే నాణ్యమైన మొక్కలను పెంచవచ్చు.

అవసరమైన మొక్క నుంచి పచ్చి ఆకును తొడిమతో పాటు తుంచాలి. ఆ ఆకును తులసి రసంలో అరగంట సేపు నానబెట్టాలి. తరువాత గాజు గ్లాసులో సగం వరకు నీళ్లు పోసి అందులో ఆ పత్రాన్ని ఉంచాలి. రెండు రోజులకోసారి మరికొంత నీటిని చేర్చాలి. 10 నుంచి 15 రోజుల్లో వేర్లు పెరుగుతాయి. అప్పుడు ఆ పత్రాన్ని తీసి మట్టిలో నాటాలి.

లీఫ్‌ కల్చర్‌ ద్వారా వృద్ధి చేసి పుదీన, తులసి, మనీప్లాంట్‌ మొక్కలను పెంచుతున్నారు శోభ. కొన్ని క్రోటన్‌ జాతి మొక్కలను కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నారు. ‘అయితే, వేర్లు మొలిచిన ఆకులను తొట్టిలో పెట్టినప్పుడు ఆకు తొడిమె పూర్తిగా మట్టిలో  ఉండేలా జాగ్రత్తపడాలి. వేర్లు బలంగా రావడానికి మట్టిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నాలుగు వారాల్లో ఆకుకు వేర్లు మొలుస్తాయి. మరో నాలుగైదు వారాల్లో ఆకు పక్కనే మొక్క పెరుగుతుంది. అయితే ఈ పద్ధతి అన్ని మొక్కలకూ అనుకూలించకపోవచ్చు’ అని వివరించారు శోభ. ఈ వినూత్న విధానాన్ని అనుసరిస్తూ తన లోగిలిని హరిత భరితం చేస్తున్నారామె. 

అరుదైన పండ్ల మొక్కలు 

పత్రాలతో మొక్కల సాగుతోపాటు డాబా మీద రకరకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు శోభ. హిమాచల్‌ప్రదేశ్‌ వంటి శీతల ప్రాంతాల్లో పెరిగే స్ట్రా బెర్రీ మొక్కలను డాబా మీద కుండీల్లో పెంచుతున్నారు. బ్రొకోలిని కూడా సాగు చేస్తున్నారు. బొండుమల్లె, సన్నజాజి, కనకాంబరంతో పాటు పదిరకాల బంతి పూల జాతులను ఆమె డాబాపై చూడవచ్చు. క్యాబేజీ, మెంతి, కొత్తిమీర సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇంటికి కావలసిన కూరగాయలన్నీ  అక్కడే పండుతాయి. 

లీఫ్‌ కల్చర్‌పై అవగాహన

“ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేయడం చాలా సులువు. రైతులు, గృహిణులే కాదు, స్కూలు పిల్లలు కూడా ఈ పద్ధతిని నేర్చుకోగలుగుతారు. మొక్కల్ని కొనకుండా, స్వయంగా ఉత్పత్తి చేసే మార్గమిది. యంత్రాలు, ప్రయోగశాలలూ అవసరం లేదు. ఇప్పటికే చాలా మందికి ఆకులతో మొక్కల్ని ఉత్పత్తి చేసే పద్ధతిపై ఉచితంగా శిక్షణ ఇచ్చాను. ఆసక్తి ఉన్నవారికి నేర్పించడానికి నేను సదా సిద్ధమే.”

 శ్యాంమోహన్‌

కె.రమేష్‌ బాబు

VIDEOS

logo