గొంతెత్తితే చాలు.. శతఘ్నులు పేలుతున్న చప్పుడు. ప్రతి మాటా పదునైన తూటా. ఉదాహరణలు, గణాంకాలు, సాక్ష్యాలు, ఫలితాలు, ప్రభావాలు.. తూకమేసినట్టు, ప్రత్యర్థి తాటతీసినట్టు సాగిందా ఉపన్యాసం. యువ దౌత్యవేత్త స్నేహ దూబే ఇటీవల ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో పాక్ దుశ్చర్యల్ని ఎండగట్టినతీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్నేహ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయం ఇచ్చిందని కడిగిపారేశారు.
ఐరాసలో ఇమ్రాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపైనా ధ్వజమెత్తారు. దాయాది దేశం తీరు.. ఇంటికి నిప్పుపెట్టుకొని, తానే ఆర్పుకొంటున్న విధంగా ఉందని దెప్పిపొడిచారు. ఇంతకీ ఎవరీ సివంగి? స్నేహ దుబే 2012 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. పాఠశాల చదువును గోవాలో, ఉన్నత విద్యను పుణెలో పూర్తి చేశారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎంఫిల్ చేశారు. ఆమె తండ్రి బహుళ జాతి సంస్థలో ఉన్నతోద్యోగి, తల్లి ఉపాధ్యాయురాలు. ఆ కుటుంబం నుంచి మొదటి ప్రభుత్వ అధికారి తనే. పాక్ ప్రధాని వ్యాఖ్యలకు ఐరాసలో స్నేహ ఇచ్చిన ఘాటైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఏకంగా, అభిమాన సంఘాలూ ఏర్పడ్డాయి.