SSanthanam | క్రికెట్ చరిత్రలో వంద టెస్టుల రికార్డు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీకి ఓ మహిళా అభిమాని నుంచి అరుదైన కానుక అందింది. దాన్ని చూసి కోహ్లీ తబ్బిబ్బయ్యాడు. ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పాడు. స్నీకర్ ఆర్టిస్టు సంతానం పంపిన ‘షూ’ అది. కోహ్లీ బొమ్మ, రికార్డు బద్దలుకొట్టిన మ్యాచ్ తేదీతో ఆ పాదరక్షను కళాత్మకంగా తీర్చిదిద్దారామె. సంతానం తల్లిదండ్రులు విరాట్ వీరాభిమానులు. తమిళనాడు జట్టు తరఫున క్రికెట్ ఆడారు కూడా. స్నీకర్ ఆర్ట్‌కు ఓ రూపం ఇవ్వడానికి కనీసం ఐదు రోజులు పడుతుంది. కోహ్లీ కోసం 24 గంటల్లో పనంతా పూర్తిచేసింది సంతానం. తను స్నీకర్ ఆర్టిస్టు మాత్రమే కాదు, మంచి గాయని కూడా. పియానో అద్భుతంగా పలికిస్తుంది. షూ మీద బొమ్మ గీసేందుకు ఎనిమిది వేలు తీసుకుంటుంది. కాకపోతే, త్వరలోనే తన పెండ్లి. కొద్దిరోజులు వీటన్నిటికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నది. నిశ్చితార్థం సంగతి తెలిసి కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడట.