‘నవ్వడం ఒక భోగం – నవ్వించడం ఒక యోగం – నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నట్టుగానే నవ్వు.. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అనేక పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. తాజాగా, మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుందని మరో అధ్యయనం తేల్చింది. ‘డ్రై ఐస్’లాంటి కంటి సమస్యల నుంచి నవ్వు ఉపశమనం కలిగిస్తుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఓ కథనం ప్రచురితమైంది. బాగా నవ్వినప్పుడు కళ్ల నుంచి నీరుకారడం చూస్తుంటాం.
అలా కళ్లలో చేరిన తడి వల్ల.. డ్రై ఐస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా నవ్వడం వల్ల.. శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒత్తిడి స్థాయులను తగ్గించి.. నాడీ వ్యవస్థ సమతుల్యతను కాపాడటంలో సాయపడుతుంది. ఇది కన్నీటి ఉత్పత్తిని పెంచుతుంది. మరోవిషయం ఏమిటంటే, నవ్వు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కళ్లకు కూడా రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి.. దురద, మంట లాంటి ఇబ్బందులను దూరం చేస్తుందని అధ్యయనంలో తేలింది. ఇక ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ను తగ్గించడంలో లాఫింగ్ థెరపీ గొప్పగా పనిచేస్తుందట!