కంటినిండా నిద్రపోవాలనీ.. కమ్మటి కలలు కనాలనీ అందరికీ ఆశ ఉంటుంది. కానీ, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. ‘కునుకు’ రావడమే కష్టమై పోతున్నది. నేటి జనరేషన్లో ‘నిద్రలేమి’ ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో ‘మంచినిద్ర’ కోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే.. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. దీనివల్ల మానసిక, శారీరక ఒత్తిడి చిత్తవుతుంది. కమ్మటి నిద్ర ఆవహిస్తుంది. ఇక పడుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేసినా..మంచి నిద్రపడుతుంది.
రాత్రి భోజనం త్వరగా ముగించాలి. అదికూడా.. మంచి పోషక విలువలు ఉండే తేలికపాటి ఆహారమే తీసుకోవాలి. రాత్రిపూట జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి.. త్వరగా జీర్ణంకాని ఆహారం తింటే, నిద్ర సరిగ్గా పట్టదు.
భోజనం తర్వాత ఓ పది – పదిహేను నిమిషాలు నడవండి. ఆ తర్వాత.. అలసట తగ్గి, బాగా నిద్రపోవాలంటే.. కప్పు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. పసుపులోని యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. శరీర అలసట, నొప్పిని తగ్గిస్తాయి.
పడుకోవడానికి గంట ముందే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పక్కన పెట్టేయాలి. కొందరికి పడుకునేముందు పాటలు వినడం, టీవీ చూడటం అలవాటు. వీటివల్ల మెదడుకు ఏకాగ్రత తగ్గుతుంది. నిద్ర దూరమవుతుంది. ఇక ఫోన్లు, ట్యాబ్ల నుంచి వచ్చే కాంతి తరంగాలు.. నిద్రకు భంగం కలిగిస్తాయని పరిశోధనల్లోనూ తేలింది.
రాత్రిపూట అధిక మసాలాలు, వేయించిన ఆహారం, కాఫీలు, టీలు.. నిద్రను దూరం చేస్తాయి. మసాలా ఆహారం.. కడుపులో చికాకు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కలిగిస్తుంది. దీని కారణంగా నిద్రలో అసౌకర్యంగా అనిపిస్తుంది. నిద్ర ఎగిరిపోతుంది. కాఫీలో అధిక మొత్తంలో ఉండే కెఫిన్.. నిద్రపోవాలనే కోరికను తగ్గిస్తుంది.
వేయించిన ఆహారంతో జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచి.. నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే, రాత్రిపూట ఇలాంటి ఆహార పదార్థాలను దూరంపెట్టాలి.