తెలుగు ప్రజల సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది. ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు మన జీవితాల్లో నూతనత్వాన్ని నింపే ఉగాది పరాభవ నామ సంవత్సరంగా అడుగు పెడుతున్నది. ఉగాది రాకతో వసంతం మొదలై తరువులు కొత్త చిగురులు తొడుగుతాయి. అలాగే మన జీవితాల్లోనూ కొత్త ఆశలు, మంచి సంకల్పాలు ప్రారంభం కావాలి. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని సుఖ-దుఃఖాలు సహా వివిధ అనుభవాలను సూచిస్తూ వాటిని సమతాభావంతో స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయి. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం కాలం దైవస్వరూపం. మనిషి తనకు అందుబాటులో ఉన్న కాలాన్ని భక్తి, ధార్మిక కార్యాలు, భగవంతుడి స్మరణలో గడపాలి. తద్వారా జీవితానికి నిజమైన నూతన ఆరంభాన్ని ఇవ్వగలడు.
యుగాది లేదా ఉగాది అనే పేరు ‘యుగ’, ‘ఆది’ అనే సంస్కృత పదాల కలయిక నుంచి ఏర్పడింది, దీని అర్థం ‘నూతన యుగానికి నాంది’ ఉగాది. సనాతన సంప్రదాయం ప్రకారం, చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మత్స్యావతారధారి అయిన మహావిష్ణువు సోమకాసురుడిని వధించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణమిది. అందుకే తెలుగు ప్రజలు ఈ రోజును నూతన సంవత్సర ఆరంభంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు.
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, ఇది మానవ జీవితంలోని విభిన్న భావోద్వేగాలకు సంకేతం.
బెల్లం (తీపి): ఆనందానికి సంకేతం. ఉప్పు (ఉప్పు): జీవితంలో ఉత్సాహానికి, రుచిని సూచిస్తుంది. వేప పువ్వు (చేదు): బాధ కలిగించే అనుభవాలు. చింతపండు (పులుపు): నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు.
పచ్చి మామిడి (వగరు): కొత్త సవాళ్లు. కారం (కారం): సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే కష్టసుఖాలను సమభావంతో (స్థితప్రజ్ఞతతో) స్వీకరించాలన్నదే ఈ పచ్చడి ఇచ్చే గొప్ప సందేశం.
జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగిల్చి, మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. ప్రకృతిలో వసంతం కొత్త చిగురులను తెచ్చినట్లే, మనిషి కూడా పాత చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి, కొత్త పనులను ప్రారంభించడానికి ఈ రోజు అత్యంత అనువైనది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘నేనే సర్వానికీ ఆదిని, నేనే కాలాన్ని’ అని ప్రకటించాడు. విష్ణు సహస్రనామాల్లో భగవంతుడిని యుగాది కృత్ (యుగాలను సృష్టించేవాడు) అని సంబోధించారు.
ఆ విధంగా కాలం భగవంతుని స్వరూపం కాబట్టి, దానిని వృథా చేయకుండా ఆధ్యాత్మిక కార్యాల్లో గడపడం వల్ల మనిషి భవబంధాల నుంచి విముక్తుడై పరమపదాన్ని చేరుకోగలడు. ఉగాది రోజున భగవంతుడికి పచ్చడిని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ముఖ్యంగా హరేకృష్ణ మహామంత్ర జపం ప్రారంభించడం ద్వారా మనసు నిశ్చలమై, ఎన్ని కష్టాలు ఎదురైనా స్థితప్రజ్ఞతతో ఎదిరించే శక్తి లభిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అలాగే అన్నదానం, గోసేవ వంటి ధార్మిక కార్యాల్లో పాలుపంచుకోవడం మన జీవన విధానాన్ని
మెరుగుపరుస్తుంది.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, 96400 86664