అమెజాన్ ప్రైమ్ : జనవరి 24, 2025
తారాగణం : రాగ్ మయూర్, మురళీధర్ గౌడ్, రూపలక్ష్మి, పావని కరణం, సన్నీ పల్లె తదితరులు
దర్శకుడు : భాస్కర్ మౌర్య
ఓటీటీల రాకతో తెరపై భాషా భేదాలు తొలగిపోయాయి. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఇతర భాషల్లోకి అనువాదం అవుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. అన్ని రాష్ర్టాల ప్రేక్షకులకూ చేరువవుతున్నాయి. వారివారి ఆదరాభిమానాలు పొందుతున్నాయి. అలా.. హిందీలో తెరకెక్కిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నది. దీనికి తెలుగు రీమేక్‌గా వచ్చిందే ‘సివరపల్లి’ సిరీస్! అయితే, స్టార్ హీరోల సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఇతర భాషల్లోకి అనువాదం అవుతున్న ఈ సమయంలో.. రీమేక్ చేయడం అంటే సాహసమే! అంతటి సాహసం చేయాలంటే.. కథలో కొత్తదనం ఉండాలి.
మరి, తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సివరపల్లి’లో అంతటి కొత్తదనం ఏముందో తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే! హైదరాబాద్‌లో మొదలై.. కామారెడ్డి జిల్లాలోని ‘సివరపల్లి’ అనే పల్లెలో కొనసాగే కథ ఇది. బీటెక్ చదివిన శ్యామ్ (రాగ్ మయూర్).. తన స్నేహితుల మాదిరిగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని అనుకుంటాడు. అయితే, తండ్రి బలవంతంతో పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగంలో చేరతాడు. కామారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామమైన ‘సివరపల్లి’లో పోస్టింగ్ తీసుకుంటాడు. మిత్రులంతా ఫారిన్లో సెటిల్ అవుతుంటే.. తాను ఈ పల్లెటూరికి రావడంతో ఇబ్బందిగా ఫీలవుతుంటాడు. ఇక సివరపల్లిలో మహిళా సర్పంచ్ సుశీల (రూపలక్ష్మి) ఇంటికే పరిమితం అవుతుంది.
ఊరి పెత్తనమంతా.. ఆమె భర్త సుధాకర్ (మురళీధర్ గౌడ్)దే! ఉద్యోగంలో చేరిన శ్యామ్.. ‘సివరపల్లి’ పంచాయతీ ఆఫీసులోనే ఒక గదిలో ఉంటాడు. ఆ పల్లె వాతావరణం.. అక్కడి మనుషుల ప్రవర్తన శ్యామ్‌కు చిరాకు కలిగిస్తూ ఉంటుంది. తానుకూడా సాధ్యమైనంత త్వరగా ఫారిన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో సర్పంచ్ భర్త, పంచాయతీ ఆఫీస్ ఉద్యోగులతో శ్యామ్ ఎలాంటి కష్టాలను అనుభవిస్తాడు? అతనికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేద్దామనే ఆలోచన సర్పంచ్‌కు ఎందుకొస్తుంది? ఫారిన్ వెళ్లాలనే శ్యామ్ ప్రయత్నం ఫలిస్తుందా? అనేవి.. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్‌లో ఆసక్తిని రేకెత్తించే అంశాలు.