e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home జిందగీ సిటాపటా సినుకులకు.. యేడ తిన్నవ్‌రో రాతిరి!

సిటాపటా సినుకులకు.. యేడ తిన్నవ్‌రో రాతిరి!

నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం చాలు. కానీ, ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయింది ప్రభ. ‘ఇంకా అవసరమా?’ అనుకుని ఆశ వదులుకొనే సమయంలో ఒక చాన్స్‌ వచ్చింది. టాలెంట్‌ చాటుకోవడమే కాదు.. ఆ ఒక్క పాటతోనే ఫేమస్‌ అయిపోయింది. అచ్చమైన తీరొక్క పల్లె పదాలను పరిచయం చేస్తూ.. పాటనే ఇంటిపేరుగా మార్చుకున్న ‘సిటాపటా’ ప్రభ పాటల ముచ్చట ఆమె మాటల్లో..

నా పూర్తి పేరు బంగరిగల్ల ప్రభ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌ మా ఊరు. ఆరేండ్ల వయసులో పాట నాకు సోపతైంది. అమ్మే నా పాటల గురువు. అమ్మ మంగమ్మకు నేనన్నా, నా జానపదమన్నా ప్రాణం. ఎప్పటికైనా నేను మంచి సింగర్‌ అవుతానని మా నాయిన ముత్యాలుకు నమ్మకం.

- Advertisement -

ఏడూర్ల సెలబ్రిటీని
మా తల్లిగారి ఊరు యాచారం. నేను గవర్నమెంట్‌ స్కూల్లో చదువుకున్నా. రోజూ పాఠం అప్పజెప్పినట్టు జానపదం కూడా అప్పజెప్పేదాన్ని టీచర్లకు. శ్రీనివాస్‌ సార్‌, యాదయ్య సార్‌ నా పాటను గుర్తించిండ్రు. ఎలాంటి జానపదాలు ఎంచుకోవాల్నో చెప్తుండె. వాళ్ల సహకారంతో మొదాలు ‘శ్రీరాంపురం గట్లా నడుమ బండి పోదురో బావయ్యా.. బండీ పోదురో’ పాట పాడిన. బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం మధుప్రియ ‘ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ.. బాధపడకమ్మా.. నువ్వు దిగులు చెందకమ్మా’ పాటే. దీంతో స్కూల్ల్లోనే కాదు యాచారం చుట్టూ ఉన్న ఏడు గ్రామాల్లో నా పేరు మార్మోగిపోయింది. ఏడూర్ల ప్రజలు నన్ను చిన్నపాటి సెలబ్రిటీ లెక్కచూస్తుండె. ఎవ్వరి కంటపడినా ‘ఆడపిల్ల పాట పాడే అమ్మాయివి కదా’ అంటుండె.

అప్పుడు భయపడ్డా
ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు ఇబ్రహీంపట్నంలో చదివిన. ఆ గ్యాప్‌లోనే నాకు పాటపై స్పష్టత వచ్చింది. జానపదం విలువేంటో, పల్లె పదాల గొప్పదనమేంటో అర్థమైంది. మెల్లగా నేను ‘ఫోక్‌ సర్కిల్‌’లోకి వెళ్లిన. ఇక ఎక్కడైనా పాడగలననే నమ్మకం ఏర్పడింది. అప్పుడే, సందీప్‌ కుమార్‌తో పెండ్లి జరిగింది. బయటి ప్రోగ్రామ్స్‌కు వెళ్లలేకపోయిన. కెరీర్‌ పట్టాలెక్కే సమయంలోనే గ్యాప్‌ రావడంతో పాటకు దూరమవుతానేమో అనిపించింది. ఒకరకంగా భయపడ్డా. కొంతకాలం తర్వాత మల్లా ప్రయత్నాలు మొదలుపెట్టిన.

‘సిటాపటా’ ఇంటిపేరుగా..
అమ్మ నాకు ఇచ్చిన ఆస్తి ఆణిముత్యాల్లాంటి పాటలే. వాటికి అక్షర రూపం ఇచ్చి ఎవరెవర్నో కలిసిన. వెళ్లిన చోటల్లా పాటలు వినిపించిన. చూద్దాం చేద్దాం అన్నోళ్ల్లేగానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. చివరి ప్రయత్నంగా బచ్చెలకూర సురేశన్నకు వినిపిస్తే, ‘బాగుంది’ అన్నడు. గజ్వేల్‌ వేణన్నకు పంపించిండు. వేణన్నకూ నచ్చింది. అమూల్య స్టూడియోస్‌ ద్వారా నా మొదటి పాట ‘సిటా పటా సినుకులకు యేడ తిన్నవ్‌రో రాతిరి.. యేడ పన్నవ్‌రో రాతిరి’ విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

గొప్పగా అనిపించింది
మొదటి పాటనే హిట్‌ అవ్వడం గొప్ప అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. ‘సిటాపటా’ తర్వాత అవకాశాలు వాటంతట అవే వచ్చినయి. ‘కోమటొల్ల ఓ ఎంకటీ.. గాజులుగిట్టా పంపినావ నాకు’ పాడిన. అదికూడా మంచి గుర్తింపు తెచ్చింది.
‘సెప్పులు బైటున్నయో ఎమ్మెల్యే.. సెప్పకవోతున్నడో ఎమ్మెల్యే’, ‘యాపర్ల జాపర్ల సాయిలన్న ఏలేటి గోలుకొండ సాయిలన్నా’, ‘బిలబిలాల వాసన ఓ బిలాల వాసన’ వంటి జానపదాలు చానానే పాడిన. ఇంకా, 30 వరకు అమ్మ ఇచ్చిన ట్యూన్స్‌ ఉన్నయి. వాటికి తగ్గట్టు నేనే లిరిక్స్‌ రాసుకుంటా.

మెట్టినింట్లో నిలబెట్టింది
ఒకప్పుడు యూట్యూబ్‌లో పాడనీకెనే అష్టకష్టాలు పడిన. అసొంటిది పెద్ద పెద్ద వేదికలల్ల పాడే అవకాశం వచ్చింది. టీవీల్లో పాల్గొన్నా. ఈవెంట్స్‌ చేస్తున్నా. ఈ మధ్యకాలంలో ఈటీవీ ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో పాల్గొనే అవకాశం వచ్చింది. జానపదమే నన్ను లోకానికి పరిచయం చేసింది. పుట్టినింట్లో సంతోషాన్ని తీసుకొచ్చింది. మెట్టినింట్లో నన్ను నిలబెట్టింది. నాకు మంచి కెరీర్‌ను ఇచ్చింది. పాడటమే కాదు, పాటల్లో నటిస్తూ కూడా మెప్పించే అవకాశం కలిగించింది. నాకు ఇంత ఇచ్చిన జానపదాన్ని రోజు రోజుకూ సానపడుతూ.. అమ్మ నాకు ఇచ్చిన పాటలను జనాలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నా. సినిమాల్లో పాడటమే లక్ష్యంగా పెట్టుకున్నా.

అమ్మ మురిసిపోయింది
మా ఆయన హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో జాబ్‌ చేస్తడు. నేను పాడతా అని ఆయనకు తెలుసుగానీ, ప్రొఫెషనల్‌ సింగర్‌ స్థాయికి ఎదుగుతానని మాత్రం అనుకోలేదు. కానీ, ఫుల్‌ సపోర్ట్‌ చేస్తుండు. మాది లవ్‌ మ్యారేజ్‌. పెండ్లయిన తర్వాత చాలా సమస్యలు వచ్చినయి. అవన్నీ పాటల ద్వారానే పరిష్కారం అయినయి. అత్తామామ, ఆడబిడ్డలు అర్థం చేసుకున్నరు. నా ఫ్రెండ్స్‌, బంధువులు, తోబుట్టువులు.. అందరూ నా పాటను ఎంకరేజ్‌ చేసిండ్రు. అందరికంటే, అన్నిటికంటే మా అమ్మ మురిపెం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే, నన్ను సింగర్‌ని చేయాలని అమ్మకు చిన్నప్పటి నుంచే ఉండె. ఒకసారి, ఓ ఫేమస్‌ సింగర్‌ యాచారం వచ్చినప్పుడు ‘మా బిడ్డె బాగా పాడుతది. మీ వెంట తీస్కపోయి ఇంకా నేర్పిస్తరా?’ అని అడిగింది. ‘ఎవర్ని పడితే వాళ్లను ఉత్తగనే తీస్కపొయ్యి నేర్పిస్తరా, ఖర్చయితది మల్లా’ అనేసరికి అమ్మ బాధపడ్డది. ‘నీ పాట నచ్చి, జనం మెచ్చిననాడే పెద్ద స్టేజిల మీద పాడుదువు తియ్‌’ అని సర్దిచెప్పింది.

… దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement