ముక్కు పరిసరాలలోని ఎముకలలో గాలితో నిండిన గదులను ‘సైనస్’ అంటారు. వీటి చుట్టూ ఉండే పొరల నుంచి వచ్చే ద్రవాలు చిన్నచిన్న రంధ్రాల ద్వారా ముక్కులోకి చేరి విసర్జితం అవుతాయి. జలుబు చేసినప్పుడు సైనస్లో ద్రవాల ఊట మరీ ఎక్కువ. కానీ, అవి బయటికి వచ్చే రంధ్రాలు మూసుకుపోవడంతో అక్కడే పేరుకుపోతాయి. ఫలితంగా, దానిలో బాక్టీరియా చేరుతుంది. సైనస్లో బాక్టీరియా చేరి చీము పట్టడాన్నే ‘సైనసైటిస్’ అంటారు.
మన శరీరంలో 4 సైనస్‌లు ఉంటాయి.
ఈ వ్యాధి బడికి వెళ్లే వయసు బాలల్లో, యుక్తవయసు పిల్లల్లో ఎక్కువ. బాక్టీరియా సూక్ష్మజీవులైన సైప్టోకాకస్ న్యుమోనియే, హెచ్.ఇన్‌ఫ్లుయెంజే, యం.కటరాలిస్ వల్ల వస్తుంది. వైరస్ల వల్ల వచ్చే జలుబు, ముక్కు ఎలర్జీ తరువాత సైనస్ దాడిచేసే అవకాశం ఎక్కువ. పెద్దలకు సిగరెట్ అలవాటు ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లల్లోనూ సైనసైటిస్ అధికంగా కనిపిస్తుంది. జలుబు లక్షణాలు 10, 14 రోజులైనా తగ్గనప్పుడు, ముక్కులో చుక్కల మందు వేసినా దిబ్బడలో మార్పు రానప్పుడు.. సైనస్ ప్రారంభమైనట్టు అనుమానించాలి.
లక్షణాలు
ముక్కుదిబ్బడ, పచ్చరంగు చీమిడి, జ్వరం, ముక్కు, నోటి దుర్వాసన, తలనొప్పి, ముందు పళ్ల నొప్పి, ముఖం నొప్పి, తల కిందికి వంచినప్పుడు తీవ్రత పెరిగే తలనొప్పి, వాసన తెలుసుకొనే శక్తిని కోల్పోవడం, చిన్న పిల్లల్లో కంటి చుట్టూ వాపు.
వైద్యం
తాత్కాలిక ఉపశమనం కోసం, పసుపువేసి మరిగించిన నీటితో ఆవిరిపట్టాలి. తరువాత కొద్దిసేపటికి, గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి ఆ నీటితో పుక్కిలించాలి. వ్యాధిని సరైన సమయంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మెదడుకు వ్యాపించి, ప్రాణాంతకంగా మారవచ్చు. వ్యాధి ముదిరి మందులు పనిచేయనప్పుడు, సైనస్‌కు రంధ్రం చేసి శుభ్రం చేయాలి. దీన్నే ‘ఆంట్రల్ వాష్’ అంటారు.
నివారణ చర్యలు
వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. న్యుమోకాకల్ వ్యాధి దరిచేరకుండా.. ప్రెవెనార్ టీకా, ఫ్లూ రాకుండా ఫ్లూ టీకా, హెచ్.ఇన్ఫ్లుయెంజా సోకకుండా హిబ్ టీకా వేయించాలి. జలుబుకు సకాలంలో వైద్యం చేస్తే, అది సైనస్‌గా పరిణమించకుండా నివారించవచ్చు.
-డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు