ప్రభువు నోట వచ్చే మాటొకటి చాలు మనిషి నిండు నూరేళ్లూ వర్ధిల్లడానికి, జీవితం సార్థకం చేసుకోడానికి! అయితే, ఆయన మాటలు వినపడక ముందే ఆయనలోని చేష్టలు మున్ముందుగా కనబడతాయి. అంటే మాట్లాడని మల్లెలా, ప్రభువుది పెదవి విప్పని ప్రవర్తనా బోధన! నేటి బోధకులకు ఈ తీరు ఒక మాతృక. ఇంట్లో పసి పిల్లలకు చేష్టలే సుబోధకాలు, చూసి నేర్చుకోగల వాచకాలు! ప్రత్యేకంగా వారికి బోధించాల్సిన పనిలేదు. బోధించినా అర్థం కాని వయసు.
తల్లిదండ్రులు ఏం చేస్తే అది ఇట్టే పట్టేస్తారు. ప్రభువు చుట్టూ ఉండేది, పెద్దపెద్ద విద్యావంతులు కారు. కేవలం నిరక్షరాస్యులైన పామరులు. వారికి అర్థం కావాలంటే, ప్రభువును చూసి నేర్చుకోవడం కన్నా ఉత్తమ బోధన మరేం కావాలి? చాలామంది బోధిస్తారు. కానీ, ఆ చెప్పింది చేసేటప్పుడే కదా అసలైన క్లిష్టత. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటూనే జగమంతటికీ కాంతిని ప్రసాదిస్తున్నాడు సూర్యుడు. అలాగే విశాల జగత్తుపై వెన్నెల పరిచేస్తున్నాడు చంద్రుడు.
అలాగే ఉంటుంది క్రీస్తు బోధన! ఓ తప్పుడు స్త్రీని ప్రజలంతా రాళ్లతో చావగొడుతుంటే, ‘మీలో తప్పుచేయని వాడే ఆమెపై రాయి విసరండి’ అని నేలపై వేలిని తిప్పుతూ మౌనం వహించాడు క్రీస్తు. ఆ యువతిని కొట్టడానికి ఎత్తిన రాళ్లన్నీ మరుక్షణం అందరి చేతుల్లోంచి జారిపడిపోయాయి. ఒకరి కోసం మరొకరు ప్రేమతో ప్రవర్తించాలని మాటలతో చెప్పకుండానే ఆయన లోకం కోసం మరణించి ఆ విషయాన్ని నిరూపించాడు. క్రీస్తు మరణ సంఘటన కల్వరీపై ఇప్పటికీ ఎంత సంఘర్షణ చేస్తూ ఉందో మాటల్లో చెప్పే విషయం కాదు!
-ప్రొ॥బెర్నార్డ్ రాజు 98667 55024